2027లో ఐదు గ్రహణాలు.. తొలి సూర్య గ్రహణం ఎప్పుడు? భారత్‌లో కనిపిస్తుందా?
2026 సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యంలో, 2027లో ఏర్పడబోయే సూర్య, చంద్ర గ్రహణాలపై ఖగోళ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. వచ్చే ఏడాది మొత్తం ఐదు గ్రహణాలు సంభవించనున్నాయి. వీటిలో రెండు సూర్య గ్రహణాలు, మూడు చంద్ర గ్రహణాలు ఉండనున్నాయి.
ఆకాశంలో జరిగే ఖగోళ అద్భుతాలు ఎప్పుడూ మానవాళిని విపరీతంగా ఆకట్టుకుంటూనే ఉంటాయి. ముఖ్యంగా సూర్య గ్రహణం ఏర్పడినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖగోళ శాస్త్రవేత్తలు, ఆసక్తి గలవారు ఆ అరుదైన దృశ్యాన్ని కనులారా చూసేందుకు ఉత్సాహం చూపుతారు.

జ్యోతిష్య శాస్త్రంలోనూ సూర్య గ్రహణానికి విశేషమైన స్థానం ఉంది. సూర్యుడు, భూమి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు ఈ అద్భుతం ఆవిష్కృతమవుతుంది. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా లేదా కొంత భాగం కప్పివేయడంతో సూర్య కాంతి భూమిపై పడకుండా నిలిచిపోతుంది, ఫలితంగా కొన్ని గంటల పాటు ఆ ప్రాంతంలో నీడ కమ్ముకుంటుంది.
ప్రస్తుత ఏడాది 2026 చివరి దశకు చేరుకుంటున్న తరుణంలో, ఈ ఏడాది ఇకపై ఏవైనా సూర్య గ్రహణాలు ఉన్నాయా లేదా అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. ఈ నేపథ్యంలో రాబోయే 2027 సంవత్సరంలో ఏర్పడబోయే గ్రహణాల వివరాలు వెలుగులోకి వచ్చాయి.
2027లో గ్రహణాల జోరు.. మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు?
ప్రస్తుత సంవత్సరం 2026లో ఇకపై ఎలాంటి సూర్య గ్రహణాలు ఏర్పడే అవకాశం లేదు. ఇక వచ్చే ఏడాది అనగా 2027లో ఖగోళ ప్రియులకు వరుస గ్రహణాలు కనువిందు చేయనున్నాయి. 2027 సంవత్సరంలో మొత్తం ఐదు గ్రహణాలు సంభవించనున్నాయి. వీటిలో రెండు సూర్య గ్రహణాలు కాగా, మరో మూడు చంద్ర గ్రహణాలు ఉండటం విశేషం.
వచ్చే ఏడాదిలోని తొలి సూర్య గ్రహణం 2027 ఫిబ్రవరి 6వ తేదీన రానుంది. విశేషమేమిటంటే ఆ రోజు పవిత్రమైన 'మౌని అమావాస్య' పర్వదినం కావడంతో జ్యోతిష్య పరంగా దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది ఒక 'వలయాకార సూర్య గ్రహణం' (Annular Solar Eclipse). దీనినే మనం సాధారణంగా 'రింగ్ ఆఫ్ ఫైర్' (Ring of Fire) అని పిలుస్తాము.
'రింగ్ ఆఫ్ ఫైర్' అంటే ఏమిటి?
చంద్రుడు, భూమికి సూర్యుడికి మధ్యగా పయనిస్తూ ఆ సమయానికి కాస్త దూరంగా ఉన్నప్పుడు ఈ వలయాకార గ్రహణం ఏర్పడుతుంది. ఈ స్థితిలో చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పివేయలేక పోవడంతో, సూర్యుడి బయటి అంచు మాత్రం ఒక ప్రకాశమానమైన బంగారు వలయంలా ప్రకాశిస్తుంది. చూడటానికి అగ్ని ఉంగరంలా కనిపించే ఈ అరుదైన దృశ్యాన్నే రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు.
భారత్‌లో ఈ గ్రహణం కనిపిస్తుందా? సూతక కాలం వర్తిస్తుందా?
ఖగోళ శాస్త్రం ప్రకారం, 2027 ఫిబ్రవరి 6న ఏర్పడే తొలి సూర్య గ్రహణం భారతదేశంలో కనిపించదు. దేశంలోని ఏ ప్రాంతం నుంచి కూడా ఈ ఖగోళ దృశ్యాన్ని వీక్షించే అవకాశం లేదు.
ఫిబ్రవరి 6న సాయంత్రం 06:28 గంటలకు ప్రారంభమయ్యే ఈ గ్రహణం, రాత్రి 09:30 గంటలకు అత్యున్నత దశకు చేరుకుంటుంది. రాత్రి 11:25 గంటలకు పూర్తి గ్రహణం ముగియగా, అర్ధరాత్రి దాటాక 12:32 గంటలకు గ్రహణం పూర్తి అవుతుంది. దాదాపు 06 గంటల 04 నిమిషాల పాటు ఈ గ్రహణ కాలం కొనసాగుతుంది. దక్షిణ అమెరికా, పశ్చిమ ఆఫ్రికా ప్రాంతాలలో ఈ గ్రహణం ఆకారంలో పాక్షికంగా కనిపించనుంది. దక్షిణ చిలీ, అర్జెంటీనా దేశాలలో వలయాకార సూర్య గ్రహణాన్ని స్పష్టంగా చూడవచ్చు.
భారతదేశంలో తదుపరి సూర్య గ్రహణం ఎప్పుడు?
భారతదేశంలో నివసించే వారికి తదుపరి సూర్య గ్రహణాన్ని వీక్షించే అవకాశం 2027 ఆగస్టు 02వ తేదీన లభిస్తుంది. దాదాపు 06 నిమిషాల 23 సెకన్ల పాటు ఈ గ్రహణం తన అత్యున్నత స్థితిలో కొనసాగనుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


