Ugadi 2026: ఉగాది ఎలా ప్రారంభం అయ్యింది? ఈ పండుగ విశిష్టత, ఉగాది పచ్చడి ప్రాముఖ్యత తెలుసుకోండి!
ఉగాది పండుగ మార్చి 19, అనగా రేపు వచ్చింది. ఉగాది అంటే అందరికీ గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం. చైత్ర మాస శుక్లపక్ష పాడ్యమి రోజు బ్రహ్మ ఈ జగత్తును సృష్టించాడని అంటారు. అసలు ఈ ఉగాది పండుగ ఎలా ప్రారంభమైంది? ఈ పండుగ ప్రారంభం గురించి తెలుసుకోవడంతో పాటు ఉగాది పండుగ విశిష్టత తెలుసుకుందాం.
ఉగాది తొలి పండుగ. ఉగాది నుంచి కూడా కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది వచ్చే కొత్త తెలుగు సంవత్సరం పేరు పరాభవ నామ సంవత్సరం. ఈ సంవత్సరం ఉగాది పండుగ మార్చి 19, అనగా రేపు వచ్చింది. ఉగాది అంటే అందరికీ గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం. చైత్ర మాస శుక్లపక్ష పాడ్యమి రోజు బ్రహ్మ ఈ జగత్తును సృష్టించాడని అంటారు. అయితే అసలు ఈ ఉగాది పండుగ ఎలా ప్రారంభమైంది? ఈ పండుగ ప్రారంభం గురించి తెలుసుకోవడంతో పాటు ఉగాది పండుగ విశిష్టత, ఉగాది పచ్చడి ప్రాముఖ్యత కూడా తెలుసుకుందాం.

అసలు ఉగాది ఎలా ప్రారంభమైంది?
సోమకుడు అనే రాక్షసుడు బ్రహ్మ నిద్రిస్తున్నప్పుడు వేదాలను దొంగిలించాడు. తిరిగి వాటిని తీసుకు రావడానికి శ్రీహరి మత్స్యావతారం ఎత్తాడు. సోమకుడిని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకు ఇస్తాడు. అలా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణాల ద్వారా తెలుస్తోంది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు సూర్యోదయం సమయంలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడు అని చెబుతారు.
అంటే కాలగణనను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింప చేశాడని చెబుతారు. వసంత ఋతువు కూడా ఆ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకని కొత్త సంవత్సరానికి నాందిగా ఉగాది పండుగను మనం జరుపుకుంటాము. చైత్ర మాసం తొలిరోజు శుద్ధ పాడ్యమి నాడు సకల జగత్తును కూడా సృష్టించారట. అదే యుగానికి ఆది. యుగాది. ఉగాదిగా వచ్చింది.
పక్షుల కిలకిలలు, లేత చిగుళ్లు
మనం పండుగలను ఋతువుల ఆధారంగా జరుపుకుంటాము. ఉగాది కూడా అలాంటిదే అని చెప్పొచ్చు. ఆకు రాలే కాలం శిశిర ఋతువు నుంచి వసంతంలోకి అడుగుపెట్టే రోజున ఉగాది పండుగను జరుపుకుంటాము. ఉగాది నుంచి మొక్కలు చిగురు తొడుగుతాయి. ప్రకృతి పచ్చగా మారుతుంది. పక్షులు, పూలు, లేత చిగుళ్ల మధ్య ప్రకృతి మరింత అందంగా మారుతుంది. ఋతువులు మారితే వ్యాధులు వస్తాయి. కాబట్టి శక్తిని పొందడానికి షడ్రుచులతో ఉండే ఉగాది పచ్చడిని స్వీకరిస్తాము.
ఉగాది పండుగ రోజు ముస్తాబయ్యే ఇళ్ళు, వాకిళ్లు
ఉగాది రోజు వేకువజామునే తలస్నానం చేసి కొత్త వస్త్రాలు ధరిస్తాము. అలాగే గుమ్మానికి మామిడి ఆకు తోరణాలు, వాకిల్లో అందమైన ముగ్గులు వేసి అలంకరిస్తాము. ఉగాది నాడు ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తాము. పూజ చేసుకున్నాక ఉగాది పచ్చడిని స్వీకరిస్తాము. జీవితంలో ఎదురయ్యే అన్నిటినీ కూడా సమానంగా చూడాలని ఉద్దేశంతో ఉగాది పచ్చడిని తింటాము.
ఉగాది పచ్చడి ప్రాముఖ్యత:
బెల్లం ఆనందానికి సంకేతం.
ఉప్పు ఉత్సాహానికి సంకేతం.
వేప పువ్వు చేదు, బాధకు సంకేతం.
చింతపండు పులుపు, నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులను సూచిస్తుంది.
మామిడి వగరు, కొత్త సవాళ్లను సూచిస్తుంది.
కారం సహనం కోల్పోయేటట్టు చేసే పరిస్థితులను సూచిస్తుంది.
ఇలా ఆరు రుచులతో ఉన్న పచ్చడిని తింటే జీవితంలో కష్ట సుఖాలను సమానంగా చూడాలని మనకు నేర్పుతుంది. జీవితంలోని అన్నీ భావాలను తెలిపే భావం ఉగాది పచ్చడిలో ఉంది. కనుక ఎంతో ముఖ్యమైన ఈ షడ్రుచుల పచ్చడిని ఉగాది నాడు కచ్చితంగా తినాలని అంటారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


