క్షీరాబ్ధి ద్వాదశి 2026: తులసి అమ్మవారికి శాలిగ్రామంతో వివాహం.. క్షీరాబ్ధి ద్వాదశి వెనుక ఉన్న విశేషాలు, పూజా విధానం!

కార్తీక మాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో క్షీరాబ్ధి ద్వాదశి ఒకటి. దీనినే చిలుక ద్వాదశి, బృందావన ద్వాదశి, తులసి ద్వాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజున శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి, తులసి అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తారు.  

Published on: Nov 18, 2026, 12:30:42 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

చాలామంది కార్తీక మాసం నెలరోజులూ భక్తిశ్రద్ధలతో పరమేశ్వరుని ఆరాధిస్తారు. తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం ఆచరించి, దీపారాధన, శివుడికి జలాభిషేకం వంటివన్నీ పాటిస్తూ ఉంటారు. అయితే కార్తీక మాసంలో అత్యంత శక్తివంతమైన రోజుల్లో క్షీరాబ్ధ ద్వాదశి ఒకటి. దీనిని చిలుక ద్వాదశి అని కూడా అంటారు.

క్షీరాబ్ధి ద్వాదశి 2026: తులసి అమ్మవారికి శాలిగ్రామంతో వివాహం.. క్షీరాబ్ధి ద్వాదశి వెనుక ఉన్న విశేషాలు! (AI)
క్షీరాబ్ధి ద్వాదశి 2026: తులసి అమ్మవారికి శాలిగ్రామంతో వివాహం.. క్షీరాబ్ధి ద్వాదశి వెనుక ఉన్న విశేషాలు! (AI)

బృందావన ద్వాదశి, తులసి ద్వాదశి అని కూడా దీనికి పేర్లు ఉన్నాయి. విష్ణువును, లక్ష్మీదేవిని, తులసిని పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. తులసి అమ్మవారికి, శాలిగ్రామ రూపంలో ఉన్న విష్ణువుకు వివాహం జరిపించడం ఈ పర్వదినం విశేషం.

పురాణాల విశ్వాసాల ప్రకారం చూసినట్లయితే, ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు యోగనిద్రలోకి వెళ్లిన విష్ణువు కార్తీక ఏకాదశి నాడు మేల్కొంటాడు. ఆ తర్వాత రోజు వచ్చేది ద్వాదశి. దీనినే క్షీరాబ్ధి ద్వాదశిగా జరుపుకుంటారు. క్షీరసాగరంలో విష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొనే పవిత్ర సందర్భంగా ఈ రోజును భావిస్తారు. తులసి వివాహం నిర్వహించడం ద్వారా విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు.

క్షీరాబ్ధి ద్వాదశి అనే పేరు ఏ విధంగా వచ్చింది?

క్షీరము అంటే పాలు, సముద్రం లేదా క్షీరసాగరం అని అర్థం. దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేస్తారు. దీనినే సముద్ర మథనం అని అంటారు. ఇందులో నుంచి దివ్య వస్తువులు ఆవిర్భవించాయి. లక్ష్మీదేవి కూడా క్షీరసాగర మథనం సమయంలో ఆవిర్భవించి విష్ణువును వరించింది.

చిలుక ద్వాదశి అని ఎందుకు వచ్చింది?

క్షీరసాగర మథనాన్ని చిలకడం లేదా మథించడం కారణంగా చిలుక ద్వాదశి అనే పేరు వచ్చింది. ఉసిరి చెట్టు కొమ్మను తులసి కోట దగ్గర పెట్టి ప్రత్యేక పూజలు జరుపుతారు. ఉసిరి చెట్టును విష్ణు స్వరూపంగా, తులసిని లక్ష్మీదేవిగా భావించి పూజలు చేస్తారు.

క్షీరాబ్ధి ద్వాదశి పూజా విధానం

తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని, పూజామందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. రోజూ పూజ చేసుకుని సాయంత్రం క్షీరాబ్ధి ద్వాదశి పూజ చెయ్యాలి.

తులసి కోట దగ్గర పసుపు, కుంకుమలతో అలంకరించాలి. తులసి మొక్కకు పూలు, పసుపు, కుంకుమలు, అక్షింతలు సమర్పించాలి.

తులసి కోటలో ఉసిరి కొమ్మను పెట్టి పూజలు చేయాలి. శాలిగ్రామాన్ని లేదా విష్ణు ప్రతిమను కూడా పెట్టి పూజించవచ్చు. తులసి అమ్మవారికి గాజులు, చీర, పూలు వంటివి సమర్పించవచ్చు.

సాయంత్రం తులసి కోట చుట్టూ దీపాలు వెలిగించాలి. అలాగే విష్ణు సహస్రనామం, తులసి స్తోత్రం చదువుకోవాలి.

అటుకులు, పండ్లు, బెల్లం, కొబ్బరికాయ మొదలైన వాటిని నైవేద్యంగా పెట్టి కుటుంబ సభ్యులు ప్రసాదాన్ని స్వీకరించాలి.

దీపాలను ఎందుకు వెలిగించాలి?

ఆ రోజున 21 దీపాలు చాలా మంది వెలిగిస్తారు. ఎవరి పద్దతిని బట్టి వారు అనుసరిస్తూ ఉంటారు. క్షీరాబ్ధి ద్వాదశి నాడు తులసి కోట చుట్టూ దీపాలు వెలిగించడం శుభప్రదం. విష్ణువు, లక్ష్మీదేవిని ప్రత్యేకంగా ఆరాధించడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. అలాగే క్షీరాబ్ధి ద్వాదశి నాడు భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తే ఇంట్లో సుఖసంతోషాలు, సౌభాగ్యం కలుగుతాయని విశ్వాసం.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More