Sankranthi 2026: ఈ ఏడాది సంక్రాతి జనవరి 14న, 15న? భోగి, సంక్రాతి, కనుమ పండుగ తేదీల వివరాలను తెలుసుకోండి!
2026 సంక్రాంతి పండుగ తేదీలు: అందమైన రంగురంగుల రంగవల్లికలు, భోగి మంటలు, పిండి వంటలు, గాలిపటాలు, కొత్త బట్టలు ఇలా ఎంతో సందడిగా సంక్రాంతి పండుగను జరుపుకుంటాము. చిన్నపిల్లలకు భోగి పండ్లు పోస్తారు. అలాగే గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసు కీర్తనలు, కోడిపందాలు, బొమ్మల కొలువులు, కొత్త అల్లుళ్ల సందడులు.
ప్రతి ఏటా మనం జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో సంక్రాంతి పండుగ ఒకటి. అందుకే సంక్రాంతి పండుగను “పెద్ద పండుగ” అని అంటారు. అందమైన రంగురంగుల రంగవల్లికలు, భోగి మంటలు, పిండి వంటలు, గాలిపటాలు, కొత్త బట్టలు ఇలా ఎంతో సందడిగా సంక్రాంతి పండుగను జరుపుకుంటాము. చిన్నపిల్లలకు భోగి పండ్లు పోస్తారు. అలాగే గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసు కీర్తనలు, కోడిపందాలు, బొమ్మల కొలువులు, కొత్త అల్లుళ్ల సందడులు మధ్య సంక్రాంతి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటాము.

ఉత్తరాయణ పుణ్యకాలం
కాలచక్రానికి అధిపతి, గ్రహాలకు రారాజు అయినటువంటి సూర్యుడు ఆధీనంలో నిరంతరం తిరిగే కాలచక్రంలో రెండు అయనాలు వస్తాయి. ప్రతి ఏడాది ఆరు నెలల పాటు దక్షిణాయనం, మరో ఆరు నెలల పాటు ఉత్తరాయణం వస్తాయి. జనవరి నెల సంక్రాంతి పండుగ సమయంలో ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. అందుకే దీనిని ఉత్తరాయణ పుణ్యకాలం అని అంటారు. ఈ సమయంలో పంటలు చేతికి వస్తాయి. ఇప్పుడు ఈ సంవత్సరం సంక్రాంతి, భోగి, కనుమ పండుగలు ఎప్పుడు వచ్చాయో, ఏ రోజు ఏ పండుగను జరుపుకోవాలో తెలుసుకుందాం.
2026 సంక్రాంతి పండుగ తేదీలు
భోగి పండుగ- జనవరి 13, మంగళవారం
మకర సంక్రాంతి- జనవరి 14, బుధవారం
కనుమ పండుగ- జనవరి 15, గురువారం
ముక్కనుమ- జనవరి 16, శుక్రవారం
భోగి 2026
ఈ సంవత్సరం భోగి పండుగ జనవరి 13, మంగళవారం నాడు వచ్చింది. భోగి నాడు భోగి మంటలు వేస్తారు. ఉత్తరాయణ కాలం మొదలయ్యే ముందు రోజు ఎక్కువ చలి ఉంటుంది, దానిని తట్టుకోవాలని భోగి మంటలు వేస్తారు. ధనుర్మాస వ్రతం భోగి పండుగతోనే ముగుస్తుంది. అలాగే భోగి నాడు సూర్యాస్తమయం లోపు చిన్నపిల్లలకు భోగి పండ్లు పోస్తారు. చెరుకు ముక్కలు, రేగు పండ్లు, చిల్లర కాసులు కలిపి తలపై పోస్తారు. ఇరుగుపొరుగు వారిని పిలిచి వాయునాలు ఇస్తారు.
మకర సంక్రాంతి 2026
మకర సంక్రాంతి నాడు ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. ఈ సంవత్సరం జనవరి 14, బుధవారం నాడు వచ్చింది. మకర సంక్రాంతినాడు దానధర్మాలు చేస్తే ఎంతో మంచి జరుగుతుంది. గుమ్మడికాయను దానం చేస్తే పితృదేవతలు సంతృప్తి చెందుతారు. నువ్వులు ఏదో ఒక రూపంలో తిన్నట్లయితే ఆయుష్షు పెరుగుతుంది.
కనుమ 2026
కనుమ నాడు రైతులు పశుశాలలను శుభ్రం చేసుకుని, ఆవులను గేదెలను శుభ్రంగా కడిగి, పసుపు రాసి, పువ్వులు కుంకుమతో అలంకరిస్తారు. వాటిని సాయంత్రం మేళతాళాలతో ఊరేగించడం వంటివి చేస్తారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


