సెప్టెంబర్ 14న వినాయక చవితి.. గణపతిని ఏ సమయంలో ప్రతిష్టించాలి? అమృత, సర్వార్థ సిద్ధి యోగాలతో ప్రత్యేక పర్వదినం!
2026లో వినాయక చవితి సెప్టెంబర్ 14న జరుపుకోనున్నారు. భాద్రపద శుక్ల చతుర్థి తిథి సెప్టెంబర్ 14 ఉదయం 7:06 గంటలకు ప్రారంభమై, సెప్టెంబర్ 15 ఉదయం 7:44 గంటలకు ముగుస్తుంది. గణపతి విగ్రహ ప్రతిష్టాపనకు సెప్టెంబర్ 14 ఉదయం 11:00 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు శుభ సమయంగా పేర్కొన్నారు.
ఈ ఏడాది సెప్టెంబర్ 14న ఘనంగా వినాయక చవితి వేడుకలు ప్రారంభంకానున్నాయి. అమృత, సర్వార్థ సిద్ధి యోగాల కలయికతో వస్తున్న ఈ పర్వదినాన గణపతిని ఏ సమయంలో ప్రతిష్టించాలి? పూజా విధానం ఎలా ఉండాలో పూర్తి వివరాలు తెలుసుకోండి.

హిందువుల అత్యంత ప్రీతిపాత్రమైన పండుగల్లో వినాయక చవితి ముందుంటుంది. భాద్రపద మాసంలో వచ్చే శుక్ల పక్ష చతుర్థి రోజున విఘ్నేశుడిని భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. ఈ ఏడాది సెప్టెంబర్ 14న వినాయక చవితి పర్వదినం వచ్చింది. సోమవారం రోజున ఈ పండుగ రావడంతో పాటు అమృత యోగం, సర్వార్థ సిద్ధి యోగం తోడుకావడం విశేషం. శివునికి అత్యంత ప్రీతికరమైన సోమవారం రోజే ఆయన కుమారుడైన గణనాథుడి పూజలు ప్రారంభంకానుండటంతో ఈసారి పండుగ ప్రాధాన్యత మరింత సంతరించుకుంది.
గణపతి పూజకు అత్యంత శుభ ముహూర్తం ఇదే
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. భాద్రపద శుక్ల చతుర్థి తిథి సెప్టెంబర్ 14న ఉదయం 7:06 గంటలకు ప్రారంభమై, సెప్టెంబర్ 15న ఉదయం 7:44 గంటలకు ముగుస్తుంది. పురాణాల ప్రకారం స్వామివారు మధ్యాహ్న సమయంలో జన్మించారని నమ్ముతారు. అందుకే మధ్యాహ్న సమయంలోనే విగ్రహ ప్రతిష్టాపన చేయడం ఉత్తమమని పండితులు చెబుతున్నారు. సెప్టెంబర్ 14న ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల మధ్య విగ్రహాన్ని ప్రతిష్టించి, పూజలు నిర్వహించడానికి అత్యంత అనుకూలమైన సమయం.
విగ్రహ ప్రతిష్టాపన విధానం మరియు దిశ
ఇంట్లో లేదా పూజా మందిరంలో ఈశాన్య మూల లేదా తూర్పు దిశలో గణపతి ప్రతిమను ఏర్పాటు చేయడం శ్రేయస్కరం.
పీఠంపై ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రం పరిచి మట్టితో చేసిన విగ్రహాన్ని ఉంచాలి.
స్వామివారికి 21 గరిక పోచలు, మందార పూలు, సింధూరం, అక్షతలు, జనేవు సమర్పించాలి.
నైవేద్యంగా మోదకాలు లేదా లడ్డూలను ఉంచడం ద్వారా స్వామివారి విశేష అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు.
వినాయక చవితి రోజు రాత్రి సమయంలో చంద్ర దర్శనం చేయకూడదని పెద్దలు చెబుతుంటారు.
ఆ రోజు చంద్రుడిని చూస్తే అవాంఛిత నిందలు వచ్చే అవకాశం ఉందని పౌరాణిక విశ్వాసం.
ఉత్సవాలు మరియు నిమజ్జనం
వినాయక చవితితోనే దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంటుంది. భక్తులు తమ స్థానిక ఆచారాలను బట్టి తొమ్మిది రోజుల పాటు లేదా పదహారు రోజుల పాటు స్వామి వారిని పూజిస్తారు. పది రోజుల పాటు సాగే ఈ గణేశ ఉత్సవాలు సెప్టెంబర్ 25న అనంత చతుర్దశి రోజున ఘనంగా జరిగే నిమజ్జనంతో ముగుస్తాయి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


