ఈ 3 రకాల స్నేహితులకు వెంటనే దూరం ఉండండి! లేదంటే జీవితంలో తీరని నష్టాలు తప్పవు

ఆచార్య చాణక్యుడు స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో అత్యంత జాగ్రత్త అవసరమని సూచించారు. పైకి తియ్యగా మాట్లాడి వెనుక ద్రోహం చేసే వారు, మన రహస్యాలను బయటపెట్టే నమ్మకద్రోహులు, విచక్షణ లేని మూర్ఖులతో స్నేహం చేయకూడదని హెచ్చరించారు. 

Published on: Aug 7, 2026, 08:00:56 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మేధావిగా, గొప్ప అర్థశాస్త్రవేత్తగా, రాజనీతిజ్ఞుడిగా ఆచార్య చాణక్యుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన అందించిన 'చాణక్య నీతి' మనిషి జీవితాన్ని సరైన మార్గంలో నడిపించడానికి ఒక దిక్సూచిలా పనిచేస్తుంది. మానవ సంబంధాలు, స్నేహాలు, శత్రువులు, కుటుంబం మరియు సమాజంలో ఎలా ప్రవర్తించాలనే అంశాలపై ఆయన ఎన్నో అమూల్యమైన సూత్రాలు చెప్పారు.

ఈ 3 రకాల స్నేహితులకు వెంటనే దూరం ఉండండి! లేదంటే జీవితంలో తీరని నష్టాలు తప్పవు
ఈ 3 రకాల స్నేహితులకు వెంటనే దూరం ఉండండి! లేదంటే జీవితంలో తీరని నష్టాలు తప్పవు

కుటుంబం తర్వాత జీవితంలో కష్ట సుఖాల్లో తోడుండేది మిత్రుడే అని అందరూ నమ్ముతారు. అయితే, ప్రతి ఒక్కరినీ గుడ్డిగా నమ్మి స్నేహం చేయడం వల్ల భవిష్యత్తులో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఏయే లక్షణాలున్న వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ దూరంగా ఉండాలో ఆయన తన శ్లోకాల ద్వారా స్పష్టంగా వివరించారు.

ముందు పొగడ్తలు.. వెనుక గోతులు

మనిషి జీవితంలో స్నేహితులను ఎంపిక చేసుకునేటప్పుడు ఎంతో అప్రమత్తంగా ఉండాలని చాణక్య సూచిస్తున్నారు. ఎవరైతే ముఖం మీద ఎంతో తియ్యగా మాట్లాడుతారో, కానీ మన వెనుక మాత్రం మన పనులను చెడగొట్టడానికి ప్రయత్నిస్తారో అలాంటి వారిని క్షణం కూడా ఆలోచించకుండా వదిలేయాలి.

ఇలాంటి మనుషుల స్వభావాన్ని ఒక విషపు కుండతో పోల్చారు. కుండ పైభాగంలో పాలు ఉన్నప్పటికీ, లోపల మాత్రం ప్రాణాంతకమైన విషం నిండి ఉంటుంది. పైకి కనిపించే మంచితనాన్ని చూసి మోసపోతే, సమయం వచ్చినప్పుడు వారు వెన్నుపోటు పొడిచి మన జీవితాన్ని సర్వనాశనం చేస్తారు. అందువల్ల ఇలాంటి స్వార్థపరులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

నమ్మకద్రోహం చేసే చెడ్డ మిత్రుడు

ఎవరినైనా అతిగా నమ్మి మన రహస్యాలు చెప్పడం చాలాసార్లు ప్రమాదకరంగా మారుతుంది. ముఖ్యంగా చెడ్డ ఆలోచనలు ఉన్న మిత్రుల పట్ల ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ ఏ చిన్న మనస్పర్థలు వచ్చినా, గొడవలు జరిగినా సరే.. ఇలాంటి మిత్రులు మన జీవితంలోని రహస్యాలన్నింటినీ బయటపెట్టేస్తారు.

సమాజంలో పరువు తీయడానికి ఏ మాత్రం వెనుకాడరు. ఇది వ్యక్తిగత జీవితంలో తీవ్రమైన మానసిక ఆందోళనకు, సమస్యలకు దారితీస్తుంది. అందుకే మనసులోని రహస్యాలను అందరితో పంచుకోకూడదని పెద్దలు చెబుతుంటారు.

మూర్ఖులతో స్నేహం అనర్థం

కేవలం మోసగాళ్లే కాకుండా, ఎలాంటి విచక్షణ లేని మూర్ఖులతో స్నేహం చేయడం కూడా ప్రమాదకరమే అని స్పష్టం చేశారు. ఏది మంచి, ఏది చెడు అనే ఇంగితజ్ఞానం లేని వ్యక్తిని ఎవరైతే స్నేహితుడిగా ఎంచుకుంటారో, వారు భవిష్యత్తులో పెద్ద పెద్ద సంక్షోభాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మూర్ఖుని ఆలోచనలు ఎప్పుడూ ఇతరులను ఇబ్బందుల్లోకి నెట్టేలాగే ఉంటాయి.

జీవితంలో ప్రశాంతంగా, సంతోషంగా ఉండాలంటే మనచుట్టూ ఎలాంటి వ్యక్తులు ఉన్నారనేది చాలా ముఖ్యం. చాణక్య చెప్పిన ఈ మార్గాలను పాటిస్తూ, మోసపూరిత వ్యక్తులను ముందుగానే గుర్తించి దూరం పెట్టడం ద్వారా అనవసరమైన మానసిక క్షోభ నుంచి బయటపడవచ్చు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More