ఈరోజు ఇందిరా ఏకాదశి వ్రతం చేసేవారు ఈ పనులకు దూరంగా ఉండాలి.. పురాణాల్లో చెప్పిన నియమాలు!

హిందూ సనాతన ధర్మంలో పితృపక్షంలో వచ్చే ఇందిరా ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది. పూర్వీకులకు మోక్షప్రాప్తి కలగాలని కోరుకుంటూ ఈ రోజున ఉపవాసం, శ్రీమహావిష్ణువు పూజ, పితృ తర్పణం, శ్రాద్ధం, దానధర్మాలు చేయడం శుభప్రదంగా భావిస్తారు.  

Published on: Oct 6, 2026, 07:00:34 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

హిందూ సనాతన ధర్మంలో పితృ పక్షంలో వచ్చే ఇందిరా ఏకాదశికి అత్యంత విశిష్టత ఉంది. వైకుంఠ ప్రాప్తిని పొందలేక, యమరాజ భటుల చేతిలో కష్టాలు అనుభవిస్తున్న పూర్వీకులకు మోక్షాన్ని ప్రసాదించడంలో ఈ వ్రతం ఎంతో శక్తివంతమైనదిగా భావిస్తారు. ఈ పవిత్ర రోజున ఉపవాసం ఉండి, పూర్వీకుల పేరిట శ్రాద్ధ తర్పణాలు సమర్పించి, బ్రాహ్మణులకు దానధర్మాలు చేయడం ద్వారా పితృ దేవతలకు సద్గతి కలుగుతుందని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, ఈ వ్రతాన్ని ఆచరించే వారు కొన్ని కఠినమైన నియమాలను విధిగా పాటించాల్సి ఉంటుంది.

ఇందిరా ఏకాదశి వ్రతం చేసేవారు ఈ పనులకు దూరంగా ఉండాలి.. పురాణాల్లో చెప్పిన నియమాలు! (AI)
ఇందిరా ఏకాదశి వ్రతం చేసేవారు ఈ పనులకు దూరంగా ఉండాలి.. పురాణాల్లో చెప్పిన నియమాలు! (AI)

దశమి నాటి నుంచే ప్రారంభమయ్యే నియమాలు

ఏకాదశి వ్రత నిబంధనలు కేవలం ఆ ఒక్క రోజుతో ముగియవు. ఈ వ్రతం దశమి తిథి నుంచే ప్రారంభమవుతుంది. దశమి రోజు రాత్రి పూట తామసిక ఆహారాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. ఆ రోజు కేవలం ఒక్క పూట మాత్రమే భోజనం చేయడం మంచిది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రోజు భోజనంలో బియ్యం (అన్నం) తీసుకోకూడదు. అలాగే రాగి లేదా కంచు పాత్రలలో భోజనం చేయడం ఈ మూడు రోజుల పాటు (దశమి, ఏకాదశి, ద్వాదశి) నిషేధించబడింది.

ఏకాదశి రోజున పూజా విధానం, ఆచరించాల్సిన పద్ధతులు

ఏకాదశి నాడు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించాలి.

ఆ తర్వాత భగవంతుడి ముందు నిలబడి, ''ఈ రోజు నేను ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నాను. నాపై ప్రసన్నుడై ఈ వ్రతాన్ని విజయవంతం చేసే శక్తిని ప్రసాదించు" అని మనసారా సంకల్పం చేసుకోవాలి.

ఆ రోజు రోజంతా ఉపవాస దీక్షను ఆచరిస్తూ శ్రీహరిని పూజించాలి.

మధ్యాహ్న సమయంలో పూర్వీకుల జ్ఞాపకార్థం తర్పణాలు విడిచిపెట్టాలి. ఒక బ్రాహ్మణుడిని ఆహ్వానించి శ్రాద్ధ భోజనం పెట్టి, శక్తికొద్దీ దక్షిణ తాంబూలాలు సమర్పించి సత్కరించాలి. రాత్రి సమయంలో భగవంతుని నామస్మరణతో జాగరణ చేయడం శ్రేయస్కరం. ఈ తతంగానికి సంబంధించి ఏవైనా పొరపాట్లు జరిగితే ఆ శ్రీహరిని క్షమించమని వేడుకోవాలి.

ఏకాదశి రోజు పొరపాటున కూడా ఈ తప్పులు చెయ్యద్దు

పురాణాల ప్రకారం ఏకాదశి వ్రత ఫలం పూర్తిగా దక్కాలంటే కొన్నింటిని పూర్తిగా తీసుకోకూడదు. ఉల్లి, వెల్లుల్లితో పాటు ముల్లంగి, అన్నం మొదలైనవి తినకూడదు.

రెండు సార్లు భోజనం చేయడం పూర్తిగా నిషిద్ధం

కేవలం ఆహార నియమాలే కాకుండా ప్రవర్తనా నియమాలు కూడా అత్యంత ముఖ్యం. ఏకాదశి నాడు జూదం ఆడటం, పగటి నిద్ర పోవడం, తాంబూలం వేసుకోవడం, పెద్దలను బాధపెట్టడం వంటివి చేయడం, ఇతరులను కించపరచడం, దొంగతనం, హింసకు పాల్పడటం, కోపగించుకోవడం మరియు అసత్యం మాట్లాడడం వంటి దుర్గుణాలకు దూరంగా ఉండాలి. ఈ కఠినమైన త్రిదిన నియమాలను (దశమి, ఏకాదశి, ద్వాదశి) నిష్టగా పాటించినప్పుడే వ్రత పూర్తి ఫలితం లభిస్తుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More