కార్తీకమాసం ఇక పూర్తి కాబోతోంది. ఈరోజే కార్తీక అమావాస్య. కార్తీక అమావాస్య నాడు పితృ పూజకు ఎంతో పవిత్రమైన రోజు. ఈ రోజు పితృదేవతలను ఆరాధించడం వలన పితృదేవతల అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు. ప్రతి నెలలో వచ్చే అమావాస్యకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. కార్తీకమాసంలో వచ్చే అమావాస్య కూడా చాలా విశేషమైనది. కార్తీక అమావాస్య నవంబర్ 20 అంటే ఈరోజు వచ్చింది. ఈరోజు పవిత్ర స్నానాలు చేయడం వలన సకల పాపాలు తొలగిపోతాయి.

శ్రార్ధ కర్మ, పితృతర్పణం, నిరుపేదలకు సహాయం చేయడం వంటివి చాలా మంచి ఫలితాలను తీసుకొస్తాయి. పితృదోష నివారణ కోసం చాలామంది రకరకాల పనులు చేస్తూ ఉంటారు, దానాలు చేస్తూ ఉంటారు. కార్తీక అమావాస్య నాడు ఏం చేస్తే శుభఫలితాలు కలుగుతాయి? ఎలాంటి తప్పులు చేయకూడదు? అనే విషయాలను తెలుసుకుందాం.
చంద్రుని పూజ చేయండి
కార్తీక అమావాస్య నాడు చంద్రుడిని పూజించడం, ఉపవాసం ఉండడం వలన కోరికలు తీరుతాయి. జీవితంలో ఆనందం ఉంటుంది. కార్తీక అమావాస్య రోజు కొన్ని పనులు మాత్రం పొరపాటున కూడా చేయకూడదు.
కార్తీక అమావాస్య నాడు ఏం చేస్తే మంచిది?
- కార్తీక అమావాస్య నాడు నది స్నానం చేయడం వలన చాలా మంచి జరుగుతుంది. అలా కుదరకపోతే చెరువు లేదా కొలనులో చేయొచ్చు. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి ఉపవాసం ఉంటే కూడా సకల బాధలు తొలగిపోయి ఆనందంగా ఉండొచ్చు.
- పూర్వీకుల ఆత్మకు శాంతి కలగాలంటే ఈ అమావాస్యనాడు శ్రద్ధకర్మ, తర్పణాలు, పిండదానం వంటివి చేస్తే మంచిది.
- సత్యనారాయణ కథ వింటే కూడా ఈరోజు ఎంతో పుణ్యం వస్తుంది.
- పేదవారికి దుప్పట్లు, బూట్లు, చెప్పులు, బెల్లం, నువ్వులు, ఉసిరి, పంచదార వంటి దానాలు చేస్తే కూడా చాలా మంచిది.
కార్తీక అమావాస్య నాడు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి
- కార్తీక అమావాస్య నాడు పెద్దలను కించపరచడం, అగౌరవపరచడం వంటివి చేయకూడదు.
- మద్యం, మాంసం, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి వాటికి దూరంగా ఉంటే మంచిది.
- కొత్త ఇల్లు కొనుగోలు చేయడం, కొత్త కారు కొనడం వంటివి మంచిది కాదు.
- కార్తీక అమావాస్య నాడు నల్లని దుస్తులు ధరించడం మంచిది కాదు.
దోషాలు తొలగి పోవాలంటే ఈ రోజు ఇలా చేయండి
- కార్తీక అమావాస్య నాడు వెండి దీపంలో బంగారు వత్తి వేసి దానం చేస్తే అఖండ సామ్రాజ్య ప్రాప్తి కలుగుతుందని పురాణాలు తెలుపుతున్నాయి. లేదంటే దీపదానం చేస్తే కూడా అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలిగి సంతోషంగా ఉండొచ్చు.
- కార్తీకమాసం స్వయంపాకం ఇస్తే కూడా మంచి జరుగుతుంది.
- కార్తీక అమావాస్య నాడు ఉపవాసం ఉండి సాయంత్రం శివుడిని ఆరాధిస్తే చాలా మంచి జరుగుతుంది. జలాభిషేకం చేస్తే అపవృత్తి దోషాలు కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది.
- ఈరోజు దానం, జపం, స్నానం, తపస్సు చేస్తే ఎంతో మంచి ఫలితాలని పొందవచ్చు. 30 రోజులు ఏ పూజ చేయని వారు, దీపారాధన చేయని వారు ఈ ఒక్క రోజుని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే సరిపోతుంది. సూర్యోదయానికి ముందు స్నానం చేసి దీపారాధన చేసి జపం చేసి ఉపవాసం ఉంటే సరిపోతుంది. అలాగే సాయంత్రం దేవతార్చన చేసుకోవాలి. అన్నదానం చేస్తే కూడా విశేష ఫలితాలను పొందవచ్చు.