ఈరోజే శక్తివంతమైన స్కంద షష్ఠి.. ఈ వ్రత మహత్యంతో పాటు పాటించాల్సిన నియమాలు తెలుసుకోండి!
ఈరోజు స్కంద షష్టి. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే శుభ ఫలితాలు, విజయాలు కలుగుతాయి. సంతానం కలగడానికి కూడా ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధిస్తే మంచిది. అలాగే ఈ వ్రత మహత్యంతో పాటుగా ఎలాంటి నియమాలను పాటించాలో కూడా ఇప్పుడే తెలుసుకోండి.
ప్రతి నెలా శుక్లపక్షంలో వచ్చే షష్టిని స్కంద షష్టిగా జరుపుకుంటాము. మే నెలలో స్కంద షష్టి మే 21, అనగా ఈరోజు వచ్చింది. ఈ విశేషమైన పర్వదినాన వేకువజామునే నిద్రలేచి ఉపవాస వ్రతాన్ని ఆచరించాలి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ప్రత్యేకించి పూజించాలి. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఎలా పూజించాలో తెలుసుకోవడంతో పాటు పౌరాణిక గాధ కూడా తెలుసుకుందాం.

ఈ స్కంద షష్టిని ఎందుకు జరుపుకోవాలి? స్కంద షష్టి విశిష్టత ఏంటి?
స్కంద షష్టిని సుబ్రహ్మణ్య షష్టి అని కూడా పిలుస్తారు. దక్షిణాది ప్రాంతాలలో ఎక్కువగా ఈ వ్రతాన్ని జరుపుతారు. ఈ పవిత్ర దినాన ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించడం వలన ఎంతో పుణ్యం కలుగుతుంది. ప్రతి నెలా శుక్ల పక్ష షష్టి నాడు స్కంద షష్టిని మనం జరుపుకుంటాము. షష్టి తిథి ఈరోజు ఉదయం 8:27 కి మొదలై రేపు ఉదయం 6:25 తో ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం స్కంద షష్టి వ్రతాన్ని మే 21, అనగా ఈరోజు జరుపుకోవాలి.
పౌరాణిక గాధ
వ్యాస మహర్షి రాసిన స్కాంద పురాణం ప్రకారం చూసినట్లయితే.. అప్పట్లో తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు పరమేశ్వరుడి నుంచి వరాలను పొందాడు. ఆ అపారమైన శక్తితో భూలోకంలో విధ్వంసం సృష్టించాడు. అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవగణాలతో పాటు శివుని ఆజ్ఞ ప్రకారం ఆరు రోజుల పాటు యుద్ధం చేయాల్సి వచ్చింది. చివరికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తారకాసురుడుని ఓడిస్తాడు.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విజయం
తారకాసురుడిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు సంహరించిన రోజు శుక్లపక్ష షష్టి. అందుకనే అప్పటి నుంచి ప్రతి నెలలో వచ్చే శుక్ల పక్ష షష్టి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విజయాన్ని పురస్కరించుకొని మనం ఈ స్కంద షష్టిని జరుపుకోవడం జరుగుతోంది.
విజయాలు కలుగుతాయి
సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు తారకాసురునిపై విజయాన్ని సాధించిన రోజు కనుక, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ప్రత్యేకించి మనం పూజిస్తే విజయం కలుగుతుంది. సంతానం కలగడానికి కూడా చాలా మంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ప్రత్యేకించి ఆరాధిస్తారు.
స్కంద షష్టి పూజ చేసేటప్పుడు వీటిని పాటించండి
ఈరోజు కార్తికేయుడితో పాటు శివపార్వతులను కూడా ఆరాధించాలి.
అలాగే అష్టోత్తర శతనామాలతో పూజ చేసి పండ్లు, బెల్లం, కొబ్బరికాయ వంటివి నైవేద్యంగా పెట్టాలి.
కార్తికేయ కథను చదువుకుని అక్షింతలు తలపై వేసుకోవాలి.
ఇలా ధూప దీప నైవేద్యాలతో భక్తిగా కార్తికేయుడిని ఆరాధిస్తే శుభ ఫలితాలను పొందవచ్చు.
ఓం శరవణ భవయే నమః అని 108 సార్లు జపిస్తే కూడా చాలా మంచిది. ఆ కార్తికేయుని అనుగ్రహం కలుగుతుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


