రేపే నాగుల చవితి. నాగుల చవితి వేళ నాగులకు ఆహారం ఇవ్వడం వలన మంచి జరుగుతుంది. నాగులకు ఆహారం అందజేయడం వలన నాగదోషంతో పాటు మొత్తం దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయని అంటారు. అలాగే నాగుల చవితి నాడు నాగులను పూజించడం వలన సర్వరోగాలు తొలగిపోతాయని, సౌభాగ్యవంతులవుతారని నమ్ముతారు.
నాగుల చవితి 2025

నాగుల చవితిని ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా జరుపుతారు. కొన్ని ప్రాంతాల వారు దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక చవితిని నాడు నాగుల చవితిగా జరుపుతారు. అలాగే మరి కొంత మంది శ్రావణ శుద్ధ చతుర్థి నాడు నాగుల చవితిని జరుపుతారు. నాగుల చవితి నాడు తక్షకుడు, వాసుకి, కర్కోటకుడు, శేషుడు వంటి 100 మంది నాగ ప్రముఖులు పుట్టారని అంటారు.
సర్పాలను పూజిస్తే మంచిది:
నాగుల చవితి నాడు సర్పాలను పూజిస్తే సర్వరోగాలు తొలగిపోతాయట. అలాగే వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. దాంపత్య దోషాలు, గర్భదోషాలు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు. కుజ దోషం, కాలసర్ప దోషానికి అధినేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనుక పుట్టకు పూజ చేస్తే దోషాలన్నీ తొలగిపోతాయని చెబుతారు. కుజదోషం ఉంటే నాగుల చవితి నాడు పూజ చేయడం ఎంతో శుభప్రదం.
నాగుల చవితి పూజా విధానం:
- నాగుల చవితి నాడు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేయాలి.
- ఆ తర్వాత జంట నాగులకు ఆవుపాలుతో అభిషేకం చేయాలి. మళ్లీ వాటిని శుభ్రమైన నీటితో కడగాలి.
- పసుపు, కుంకుమల్లో నీళ్లు కలిపి నాగులకు అభిషేకం చేయాలి. ఆ తర్వాత మళ్లీ నీళ్లతో కడిగేయాలి.
- విగ్రహాలకు పసుపు రాసి బొట్లు పెట్టాలి. పత్తిని వస్త్రంలా చేసి కుంకుమ బొట్లు పెట్టి జంట నాగుల విగ్రహాలకు దానితో అలంకరించాలి.
- మట్టి ప్రమిదను నాగుల ముందు పెట్టి నువ్వుల నూనె ఒత్తులు వేసి దీపారాధన చేయాలి.
- తొమ్మిది రకాల నాగదేవతలు ఉంటారని 9 వత్తులతో దీపం పెడతారు.
- జిల్లేడు ఆకులో బెల్లం ముక్క వేసి నైవేద్యం పెట్టాలి. ఆ తర్వాత తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి.
పుట్ట దగ్గర ఎలా పూజించాలి?
- ముందు ఉదయాన్ని తలస్నానం చేసి, పుట్ట దగ్గరకు వెళ్లి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయాలి.
- బియ్యం పిండితో అక్కడ ముగ్గు వేయాలి. ఆ తర్వాత పుట్టను పసుపు కలిపిన నీటితో అభిషేకించాలి.
- పుట్టపై కొంచెం బియ్యం పిండి, కుంకుమ, పసుపు వేయాలి. తర్వాత పుట్ట చుట్టూ పువ్వులను పెట్టి అలంకరించాలి.
- పుట్ట దగ్గర దీపారాధన చేయాలి.
- చలిమిడి, చిమ్మిలిని నైవేద్యంగా పెట్టాలి. పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేయాలి.
- ఆ తర్వాత పుట్టమన్నును చెవులకు, కంఠానికి పెట్టుకోవాలి.