పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు
తులసి కల్యాణం ఎందుకు చేస్తారు? బృందాదేవి త్యాగం నుంచి సాలగ్రామ వివాహం వరకు.. ఈ పురాణ గాథలోని ఆసక్తికర విశేషాలు
స్కంద పురాణం ప్రకారం తులసి మొక్క ఆవిర్భావం క్షీరసాగర మథనంతో ముడిపడి ఉంది. క్షీరసాగర మథన సమయంలో అమృత కలశం బయటకు వచ్చినప్పుడు, శ్రీమహావిష్ణువు ఆనందంతో కార్చిన కన్నీటి చుక్కలు అమృత కలశంపై పడి తులసి ఆవిర్భవించిందని పురాణ కథనం చెబుతోంది. అప్పటి నుంచి తులసి విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైనదిగా మారింది.
ఉదయాన్నే తులసి కోటకు నీళ్లు పోసి, సాయంత్రం దీపం వెలిగించడం తరతరాలుగా వస్తున్న ఆచారం. కార్తీక మాసంలో అయితే తులసి పూజకు మరింత ప్రాధాన్యత పెరుగుతుంది. అసలు తులసి మొక్క ఎలా పుట్టింది, విష్ణుమూర్తికి అంత ఇష్టమైనదిగా ఎలా మారింది అనే విషయాలను స్కంద పురాణం వివరంగా చెబుతోంది. ఆధ్యాత్మికంగా ఎంతో విలువైన ఈ కథను తెలుసుకుంటే పూజా విధానంపై స్పష్టత వస్తుంది.

అమృత కలశం నుంచి తులసి ఆవిర్భావం
క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి, చంద్రుడు, కౌస్తుభమణి, ధన్వంతరి రూపంలోని శ్రీహరి, దివ్య ఔషధులతో పాటు అమృత కలశం బయటకు వచ్చింది. జరామరణాలు లేని అమృతాన్ని రెండు చేతులతో పట్టుకున్న విష్ణుమూర్తి ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఆ సంతోషంలో ఆయన కళ్ల నుంచి వచ్చిన ఆనందబాష్పాలు ఆ అమృత కలశంపై పడ్డాయి.
ఆ కన్నీటి చుక్కల నుంచే గుండ్రటి ఆకారంలో తులసి అవతరించిందని స్కంద పురాణం వివరిస్తోంది. అక్కడే ఉద్భవించిన లక్ష్మీదేవిని, తులసిని బ్రహ్మదేవుడు తదితర దేవతలు శ్రీహరికి సమర్పించారు. అప్పటి నుంచి తులసి విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైనదిగా మారింది. "తులసి లేకుండా నేను నైవేద్యం కూడా స్వీకరించను, నా పూజ జరిగే చోట తప్పకుండా తులసి ఉంటుంది," అని బృందాదేవికి శ్రీమహావిష్ణువు వరమిచ్చారు.
జలంధరుడు, బృందాదేవి కథ
మరో పురాణ గాథ ప్రకారం, కాలనేమి అనే రాక్షసుడి కూతురు బృంద. ఆమెను జలంధరుడు అనే మహాబలవంతుడైన రాక్షసుడికి ఇచ్చి పెళ్లి చేశారు. తన భార్య వృంద పాతివ్రత్య మహిమ వల్లే జలంధరుడికి అపారమైన శక్తి వచ్చింది. ఆ శక్తితో దేవతలను సైతం ఓడిస్తూ ముందుకు సాగాడు. లక్ష్మీదేవిని దక్కించుకోవాలనే దురాశతో యుద్ధం చేసి ఓడిపోయిన జలంధరుడు, ఆ తర్వాత పార్వతీదేవిని పొందాలని కైలాసానికి వెళ్లాడు. శివుడి రూపంలో పార్వతీదేవి వద్దకు వెళ్లిన అతడిని తల్లి వెంటనే గుర్తుపట్టింది. ఆగ్రహించిన పార్వతీదేవి జరిగిన విషయాన్ని విష్ణుమూర్తికి చెప్పింది.
భార్య పాతివ్రత్యం వల్ల జలంధరుడిని ఎవరూ ఓడించలేని పరిస్థితి ఏర్పడింది. దాంతో అతడి బలాన్ని దెబ్బతీయడానికి బృంద పాతివ్రత్యాన్ని భంగం చేయడమే మార్గంగా మారింది. విష్ణుమూర్తి ఒక ముని వేషంలో బృంద ఒంటరిగా ఉన్న అడవిలోకి వెళ్లారు. అక్కడికి ఇద్దరు మాయా రాక్షసులను వెంటబెట్టుకుని వెళ్లారు. వారిని చూసి బృంద భయపడింది. కైలాసంలో శివుడితో యుద్ధానికి వెళ్లిన తన భర్త సంగతి ఏమిటని ఆ మునిని అడిగింది.
మాయాజాలం, తులసిగా మారిన బృంద
ఆ సమయంలో ఒక కోతి చేతిలో జలంధరుడి తలను, మరో కోతి చేతిలో మొండాన్ని విష్ణుమూర్తి మాయతో చూపించారు. భర్తకు అలా జరిగిందని చూసి బృంద స్పృహ తప్పి పడిపోయింది. స్పృహలోకి వచ్చిన తర్వాత విష్ణుమూర్తి తన మాయతో తలను, మొండాన్ని కలిపి ఆ శరీరంలోకి ప్రవేశించారు. ఈ మాయను గ్రహించలేని బృంద, తన భర్తే వచ్చాడని భావించి సేవలు చేసింది. ఆ క్షణంలో ఆమె పాతివ్రత్యం భంగం కావడంతో యుద్ధంలో జలంధరుడు మరణించాడు.
నిజం తెలుసుకున్న బృంద కోపంతో రగిలిపోయి, విష్ణుమూర్తిని రాయిగా మారిపోవాలని శపించింది. ఆ తర్వాత తాను అగ్నిలో పడి ప్రాణాలు విడిచింది. బృంద దహనమైన చోటనే తులసి మొక్క మొలిచింది. ఆమె త్యాగానికి మెచ్చిన శ్రీహరి, తన సాలగ్రామ రూపంతో తులసికి వివాహం జరిపించే వారికి ఇహపర సుఖాలు దక్కుతాయని చెప్పారు. తులసి పూజ జరిగే చోట యమధర్మరాజు కూడా అడుగు పెట్టడని, మరణ సమయంలో తులసి ఆకులు, గంగాజలం వేసిన వారికి స్వర్గప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. తెలుగు రాష్ట్రాల్లో కార్తీక మాసంలో జరిగే తులసి కల్యాణాల వెనుక ఈ పవిత్రత దాగి ఉంది.

E-Paper
