కార్తీక మాసంలో 365 వత్తుల దీపం ఎప్పుడు వెలిగించాలి? పూజా సామగ్రి, పూజా విధానంతో పాటు పూర్తి వివరాలు

కార్తీక మాసానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ మాసంలో శివకేశవులను భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులతో దీపం వెలిగించడం ఒక ప్రత్యేకమైన ఆచారం. ఏడాదిలోని 365 రోజులకు గుర్తుగా ఒక్కో వత్తిని వెలిగించడం ద్వారా ఏడాది పొడవునా దీపారాధన చేసిన పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. 

Published on: Nov 19, 2026, 12:30:50 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

హిందూ సంప్రదాయంలో కార్తీక మాసానికి ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కార్తీక మాసంలో శివకేశవులను భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. కార్తీక మాసం వచ్చిందంటే చాలు, ప్రతి ఇంట్లో తెల్లవారుజామున నుంచే దీపాలు వెలుగుతూ ఉంటాయి. తెల్లవారుజామున నదీ స్నానం చేయడం, శివాలయాలకు వెళ్లడం, తులసి కోట దగ్గర దీపారాధన చేయడం.. ఇలా వివిధ రకాల పద్ధతులను చాలా మంది అనుసరిస్తూ ఉంటారు.

కార్తీక మాసంలో 365 వత్తుల దీపం ఎప్పుడు వెలిగించాలి? పూజా సామగ్రి, పూజా విధానంతో పాటు పూర్తి వివరాలు (AI)
కార్తీక మాసంలో 365 వత్తుల దీపం ఎప్పుడు వెలిగించాలి? పూజా సామగ్రి, పూజా విధానంతో పాటు పూర్తి వివరాలు (AI)

కార్తీక మాసంలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది 365 వత్తులతో దీపం. కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి కూడా ఎంతో విశిష్టత ఉంది. చాలా మంది ఆ రోజు 365 వత్తులతో దీపాన్ని వెలిగిస్తారు. ఇలా చేయడం వల్ల ఏడాదిలో ఏ ఒక్కరోజు దీపారాధన చేయకపోయినా, ఏడాది అంతా దీపారాధన చేసిన ఫలితాన్ని పొందడానికి వీలవుతుందని నమ్ముతారు. ఈ దీపాన్ని కార్తీక మాసంలో ఏ రోజు వెలిగిస్తే మంచిది? ఏ నూనె లేదా నెయ్యిని ఉపయోగించాలి? ఏ రోజుల్లో వెలిగిస్తే శుభప్రదం? వంటి వివరాలను తెలుసుకుందాం.

365 వత్తుల దీపాన్ని కార్తీక మాసంలో ఎప్పుడు వెలిగించాలి?

కార్తీక పౌర్ణమి రోజు ఈ 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తే మంచిది. ఈ ఏడాది నవంబర్ 24, మంగళవారం నాడు కార్తీక పౌర్ణమి వచ్చింది. ఆ రోజు సాయంత్రం సూర్యాస్తమయం అయ్యాక ప్రదోష సమయంలో 365 వత్తుల దీపాన్ని వెలిగించవచ్చు. సాయంత్రం 5:33 నుంచి రాత్రి 8:24 మధ్యలో వెలిగించుకోవచ్చు. ప్రదోష సమయంలోనే దీపారాధన చేయాలని గుర్తుపెట్టుకోండి.

ఈ దీపాన్ని ఎందుకు వెలిగిస్తారు?

హిందూ సంప్రదాయంలో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం రెండు పూటలా దీపారాధన చేస్తారు. ఉద్యోగాలు, కుటుంబ బాధ్యతలు, ఇతర కారణాల వల్ల ఒక్కోసారి దీపం వెలిగించడం సాధ్యం కాకపోవచ్చు. అయితే రోజూ దీపం పెట్టిన ఫలితం రావాలంటే కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. సంవత్సరంలోని ఒక్కో రోజుకు ఒక్కో వత్తి చొప్పున 365 వెలిగిస్తే ఏడాది పొడవునా దీపం పెట్టిన పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. ఈ దీపాన్ని వెలిగించడం వల్ల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కూడా కలుగుతాయని విశ్వసిస్తారు.

365 వత్తుల దీపాన్ని కార్తీక మాసంలో ఎప్పుడు వెలిగించాలి? (AI)
365 వత్తుల దీపాన్ని కార్తీక మాసంలో ఎప్పుడు వెలిగించాలి? (AI)

ఏ నూనె లేదా నెయ్యి ఉపయోగించాలి?

ఆవు నెయ్యిలో 365 వత్తులను నానబెట్టి, ఆ నానబెట్టిన వత్తులను తులసి కోట దగ్గర వెలిగించుకోవాలి.

పూజ కోసం 365 వత్తులు, మట్టి ప్రమిద లేదా ఇత్తడి దీపపు కుందె, ఆవు నెయ్యి సిద్ధం చేసుకోవాలి. ఒకవేళ ఆవు నెయ్యితో వెలిగించడం కుదరకపోతే నువ్వుల నూనె ఉపయోగించండి.

పసుపు, కుంకుమలు, పూలు, అక్షింతలు, కర్పూరం, అగరబత్తులు.. ఇలా పూజకు కావాల్సిన సామగ్రిని సిద్ధం చేసుకోవాలి.

కార్తీక పురాణం

వీలైతే కార్తీక పౌర్ణమి నాడు పూజ చేసి, దీపారాధన చేశాక కార్తీక పురాణం చదివితే మంచిది. ఇందులో ఉండే కథలను చదవడం లేదా వినడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు.

కార్తీక మాసంలో రానున్న శుభప్రదమైన రోజులు

నవంబర్ 21, శనివారం – క్షీరాబ్ధి ద్వాదశి

నవంబర్ 23, సోమవారం – కార్తీక సోమవారం

నవంబర్ 24, మంగళవారం – కార్తీక పౌర్ణమి

నవంబర్ 30, సోమవారం – కార్తీక సోమవారం

డిసెంబర్ 7, సోమవారం – కార్తీక సోమవారం, మాస శివరాత్రి

డిసెంబర్ 8, మంగళవారం – కార్తీక అమావాస్య (ఆ రోజు పితృదేవతలను స్మరిస్తూ దీపదానం చేయడం శుభప్రదం).

365 వత్తుల దీపాన్ని వెలిగించేటప్పుడు పాటించాల్సిన నియమాలు

  • దీపం వెలిగించే ప్రదేశం శుభ్రంగా ఉండాలి. పరిశుభ్రతను కచ్చితంగా పాటించండి.
  • సాధ్యమైనంత వరకు పత్తితో చేసిన శుభ్రమైన వత్తులను ఉపయోగించండి.
  • ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే మంచిది. లేకపోతే నువ్వుల నూనె ఉపయోగించవచ్చు.
  • దీపం కింద వేడిని తట్టుకునేలా లోహపు పళ్లెం పెట్టండి.
  • దీపాన్ని స్థిరంగా ఉండే వెడల్పాటి ప్రమిదలో వెలిగించండి.
  • దీపం వెలిగించేటప్పుడు శివనామస్మరణ లేదా విష్ణు నామస్మరణ చేయండి.

కార్తీక పౌర్ణమి నాడు దీపాన్ని వెలిగించడం ఒక ఆచారమే కాదు, అజ్ఞానం, అహంకారం, ప్రతికూల ఆలోచనలను తొలగించుకోవడానికి మంచి మార్గం కూడా. ఆరోజు శివవిష్ణువులను తప్పక ఆరాధించండి. తులసి పూజ చేయండి. దీపదానం, అన్నదానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయని విశ్వసిస్తారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More