శివ పార్వతులు పెట్టిన షరతు.. గణేశుడు తన తెలివితో ఎలా విజయం సాధించాడంటే?
వినాయక చవితి సందర్భంగా వినాయకుడు, కార్తికేయుడి మధ్య జరిగిన భూమండల ప్రదక్షిణ పోటీ కథ ఎంతో ఆసక్తికరమైనది. ముందుగా భూమండలాన్ని చుట్టి వచ్చిన వారికి వివాహం చేస్తామని శివపార్వతులు షరతు పెట్టగా, కార్తికేయుడు నెమలిపై బయలుదేరాడు.
వినాయక చవితి పర్వదినాన్ని సెప్టెంబర్ 14, సోమవారం నాడు జరుపుకోబోతున్నాము. అయితే, ఈ సందర్భంగా శ్రీ గణేశుడి జన్మ వృత్తాంతం, వినాయకుడిగా, గజాననుడిగా మారిన కథను తెలుసుకుందాం. శ్రీ గణేశుడు, సోదరుడు కార్తికేయుడు మధ్య జరిగిన ఆసక్తికరమైన కథ మీకు తెలుసా? ఇద్దరు సోదరులు భూమండలానికి ప్రదక్షిణలు చేసి ముందుగా ఎవరు తిరిగి వస్తారనే విషయంలో పోటీ పడతారు.

శివపార్వతుల షరతు
పురాణ కథనం ప్రకారం చూసినట్లయితే, పరమశివుడు, పార్వతీదేవి ఇద్దరు కుమారులైన వినాయకుడు, కుమారస్వామి వివాహం గురించి ఆలోచించారు. ముందుగా ఎవరికి వివాహం జరిపించాలి అనే విషయంలో ఇద్దరికీ ఒక షరతు పెట్టారు. భూమండలం చుట్టూ ప్రదక్షిణలు చేసి ముందుగా తిరిగి వచ్చిన వారికి వివాహం చేస్తామని చెప్తారు. అప్పుడు వారిద్దరూ కూడా అంగీకరిస్తారు. శివపురాణంలోని రుద్రసంహితలోని కుమారఖండంలో వినాయకుడి వివాహ కథతో ఈ సంఘటన సంబంధం కలిగి ఉంది.
నెమలి వాహనంపై కుమారస్వామి
విన్న వెంటనే కుమారస్వామి తన వాహనమైన నెమలిపై అధిరోహించి భూమండల ప్రదక్షిణకు బయలుదేరాడు. నెమలి వాహనంతో కుమారస్వామి వేగంగా ప్రయాణం చేయగలడు కాబట్టి, తానే ముందు తిరిగి వస్తానని నమ్మకంతో బయలుదేరాడు. వినాయకుడి వాహనం ఎలుక కావడంతో, సుదీర్ఘమైన ప్రయాణం చేయడానికి కష్టంగా మారే పరిస్థితి ఉంది.
మరో మార్గాన్ని వెతికిన వినాయకుడు
కుమారస్వామి వెళ్లిపోయాక వినాయకుడు తొందరపడలేదు. ఈ పోటీలో గెలవడానికి ఇంకో మార్గం ఏంటని ఆలోచించాడు. పరమశివుడు, పార్వతీదేవిని ఒక పీఠంపై కూర్చోబెట్టి పూజించాడు. తల్లిదండ్రులను పూజించిన తర్వాత వినాయకుడు వారి చుట్టూ ఏడు సార్లు ప్రదక్షిణలు చేసి నమస్కరించాడు. గణేశుడు తన తల్లిదండ్రుల చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణలు చేసి, తల్లిదండ్రులే తనకు సమస్త ప్రపంచమని వినాయకుడు ప్రకటించాడు. తల్లిదండ్రులను పూజించి, వారి చుట్టూ ప్రదక్షిణలు చేయడం భూమండలానికి ప్రదక్షిణ చేసినంత ఫలితాన్ని ఇస్తుందని శివపురాణం చెప్తోంది.
తెలివితేటలతో వినాయకుడి విజయం
వినాయకుడి జ్ఞానం, తెలివితేటలను ప్రశంసించిన పరమేశ్వరుడు, పార్వతీదేవి పోటీలో విజేతగా ప్రకటించారు. గణేశుడు తన శారీరక బలం లేదా వేగాన్ని కాకుండా వివేకాన్ని ఉపయోగించి విజయాన్ని అందుకున్నాడు.
ఈ కథ చెప్పే గొప్ప నీతి
ఈ ఇద్దరి మధ్య పోటీ మనకు ఒక విషయాన్ని తెలుపుతుంది. ప్రతి పనినీ కేవలం శారీరక బలం లేదా వేగంతోనే సాధించలేము. కొన్నిసార్లు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం మరింత ముఖ్యమైనది. వినాయకుడు పరిస్థితిని అర్థం చేసుకుని, తెలివితేటలను ఉపయోగించి ఈ సవాలుకు సులువైన పరిష్కారాన్ని కనుగొన్నాడు. జ్ఞానం, వివేకం ఉన్నట్లయితే ఎలాంటి కష్టమైన పరిస్థితినైనా అధిగమించవచ్చని శివపురాణం కూడా గణేశుడి జ్ఞానాన్ని ప్రశంసిస్తూ చెప్తోంది.
తల్లిదండ్రులను గౌరవించాలి
ఈ కథ తల్లిదండ్రులను గౌరవించాలి అనే విషయాన్ని కూడా తెలుపుతోంది. తల్లిదండ్రులను గౌరవించడం, వారి ప్రాధాన్యతను అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యమని ఈ కథ మనకు తెలుపుతోంది. తల్లిదండ్రులకు సేవ చేయడం, వారిని పూజించడం గురించి కూడా పద్మపురాణంలో వివరించడం జరిగింది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


