Visha Yogam in Meena Rashi: మీన రాశిలో శని, చంద్రుల కలయికతో విష యోగం.. రెండు రోజులు గడ్డుకాలం.. తస్మాత్ జాగ్రత్త!
Visha Yogam in Meena Rashi: మీన రాశిలో శని, చంద్రులు కలవడం వల్ల అత్యంత ప్రమాదకరమైన విష యోగం ఏర్పడుతోంది. దీని ప్రభావంతో మే 14 వరకు కుంభం, మీనం సహా నాలుగు రాశుల వారికి ఆర్థిక, మానసిక ఇబ్బందులు తప్పవు. తస్మాత్ జాగ్రత్త!
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం ఎప్పుడూ ఒకేలా ఉండదు. గ్రహాల కలయిక వల్ల కొన్నిసార్లు రాజయోగాలు పడితే, మరికొన్నిసార్లు అశుభ యోగాలు ఇబ్బంది పెడుతుంటాయి. ప్రస్తుతం అటువంటి ఒక గడ్డు కాలం మొదలవుతోంది. శని దేవుడు ఇప్పటికే మీన రాశిలో సంచరిస్తుండగా, చంద్రుడు కూడా అదే రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. జ్యోతిష్య పరిభాషలో శని, చంద్రులు ఒకే రాశిలో కలిస్తే దానిని 'విష యోగం' అంటారు.

మే 12వ తేదీ మంగళవారం అనగా ఈరోజు రాత్రి 07:24 గంటలకు చంద్రుడు కుంభ రాశి నుంచి మీన రాశిలోకి అడుగుపెడతాడు. మే 14వ తేదీ రాత్రి వరకు చంద్రుడు అక్కడే ఉంటాడు. మీన రాశిలో ఇప్పటికే శని ఏలినాటి శని రెండో దశ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఏర్పడుతున్న విష యోగం కొన్ని రాశుల వారిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా నాలుగు రాశుల వారు ఈ రెండు రోజులు చాలా అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈరోజు నుంచి ఈ రాశులకు గడ్డుకాలం.. తస్మాత్ జాగ్రత్త
1.మీన రాశి
విష యోగం మీ సొంత రాశిలోనే ఏర్పడుతోంది. దీనివల్ల మీకు మానసిక ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. చిన్న చిన్న విషయాలకే ఆందోళన చెందడం, తెలియని భయం మిమ్మల్ని వెంటాడవచ్చు. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పనులు చివరి నిమిషంలో ఆగిపోయే ప్రమాదం ఉంది. ఈ సమయంలో భావోద్వేగాలకు లోనై ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకండి. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి.
2.కుంభ రాశి
మీ రాశిపై ప్రస్తుతం ఏలినాటి శని చివరి దశ నడుస్తోంది. చంద్రుడు మీ రాశి నుంచి రెండో స్థానంలోకి వెళ్లడం వల్ల ధన నష్టం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో అజాగ్రత్తగా ఉంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో పాత గొడవలు మళ్ళీ మొదలయ్యే అవకాశం ఉంది. మీ మాట తీరును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. పెట్టుబడులకు ఇది ఏమాత్రం మంచి సమయం కాదు.
3.మకర రాశి
శని-చంద్రుల ప్రభావం వల్ల మీలో ఆత్మవిశ్వాసం తగ్గే అవకాశం ఉంది. మీరు పడే కష్టానికి తగిన గుర్తింపు రాకపోవడంతో నిరాశకు లోనవుతారు. తోబుట్టువులతో సత్సంబంధాలు దెబ్బతినవచ్చు. బద్ధకాన్ని వదిలి పనిపై దృష్టి పెట్టండి. అడ్డదారులు తొక్కి పనులు పూర్తి చేయాలని చూస్తే కొత్త సమస్యలు కొనితెచ్చుకున్నట్టే అవుతుంది. ఓపికతో వ్యవహరించడం ఉత్తమం.
4.కన్యా రాశి
కన్యా రాశిపై శని ఏడవ దృష్టి పడుతోంది. దీనివల్ల మీ వైవాహిక జీవితంలో లేదా వ్యాపార భాగస్వామ్యాల్లో మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. మీ భాగస్వామిని అనుమానించడం లేదా వారిపై కోప్పడటం వల్ల సంబంధాలు దెబ్బతింటాయి. ఆరోగ్యం విషయంలోనూ జాగ్రత్త అవసరం. ముఖ్యంగా పొట్ట, కాళ్లకు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. ఆహార నియమాలు పాటించడం మర్చిపోకండి.
అశుభ ప్రభావం తగ్గాలంటే ఏం చేయాలి?
"విష యోగ ప్రభావం వల్ల కలిగే ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందాలంటే దైవ ప్రార్థన ఒక్కటే మార్గం," అని పండితులు సూచిస్తున్నారు. ఈ రెండు రోజులు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శని దోషం తగ్గుతుంది. అలాగే సోమ, మంగళవారాల్లో శివలింగానికి అభిషేకం చేయడం, 'ఓం నమః శివాయ' మంత్రాన్ని జపించడం వల్ల చంద్రుడి వల్ల కలిగే మానసిక అశాంతి దూరమవుతుంది. వీలైతే నల్ల నువ్వులు లేదా మినుములను దానం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


