Ganesh Immersion : గణేష్ నిమజ్జనం తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదని ఎందుకు అంటారు? జీవిత సత్యాలు

Ganesh Immersion 2026 : గణేశ నిమజ్జనం తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదనే నియమం వెనక అనేక నమ్మకాలు ఉన్నాయి. ఈ ఆచారం ఎప్పటి నుంచో వస్తుంది. కొందరు దీనిని పాటిస్తే.. మరికొందరు పట్టించుకోరు.

Published on: Sep 15, 2026, 21:37:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గణేష్ చతుర్థి నాడు గణపతిని ఆహ్వానించేటప్పుడు ఎంతటి ఉత్సాహం, ఉల్లాసం ఉంటుందో.. గణేశుని నిమజ్జన సమయం కూడా అంతే భావోద్వేగభరితంగా ఉంటుంది. ఒకటిన్నర, మూడు, ఐదు, ఏడు లేదా పది రోజుల పాటు కొలువుదీరి పూజలు అందుకునే గణపతికి వీడ్కోలు పలికేటప్పుడు ప్రతి కుటుంబం తమదైన సంప్రదాయాలు, ఆచారాలను పాటిస్తుంది. ఉత్తర పూజ, మంగళ హారతి, అక్షతలు సమర్పించడం, నైవేద్యాలు సమర్పించడం, నిమజ్జనం మంత్రాలు పఠించడం, జై బోలో గణేష్ మహారాజ్‌కి జై అంటూ నినాదాలు చేయడం.. ఇంకా తరతరాలుగా పాటిస్తున్న వివిధ ఆచారాలు ఈ వీడ్కోలులో ఒక ముఖ్యమైన భాగం.

వినాయక నిమజ్జనం
వినాయక నిమజ్జనం

కానీ ఈ ఆచారాలన్నిటి మధ్య.. ఒక విషయం మాత్రం ఎప్పుడూ పెద్ద చర్చనీయాంశంగా ఉంటుంది. అదే.. 'గణేశుడిని నీటిలో నిమజ్జనం చేసిన తర్వాత, ఏ కారణం చేత కూడా వెనక్కి తిరిగి చూడకూడదు' అనే నియమం. కొందరు దీనిని ధర్మశాస్త్ర నియమంగా భావిస్తుండగా, మరికొందరు దీనిని కేవలం ప్రజల మూఢనమ్మకం లేదా విశ్వాసంలో ఒక భాగంగా పరిగణిస్తారు.

గణేశుని నిమజ్జనం సమయంలో ప్రజలు, భక్తుల మధ్య తరచుగా తలెత్తే ప్రశ్న ఏమిటంటే, 'నిమజ్జనం తర్వాత నిజంగా వెనక్కి తిరిగి చూడకూడదా?' ఈ నమ్మకం వెనక అనేక విశ్వాసాలు, మతపరమైన భావాలు ఉన్నాయి.

విశ్వాసాల ప్రకారం.. గణేశుడి నిమజ్జనం చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే.. ఆయనకు వీడ్కోలు పలుకుతున్నప్పుడు కూడా మనసులో అనుబంధం, ఆసక్తి, విచారం కొనసాగుతాయి. సంపూర్ణ భక్తితో దేవునిలో లీనమవ్వడానికి బదులుగా, మనసు భౌతిక ఆకర్షణలో చిక్కుకుపోయి ఉంటుంది. అంటే అయ్యో వినాయకుడు నిమజ్జనం అవుతున్నాడు కదా అనే విషయంపై మనసు ఫోకస్ చేస్తుంది. ఇన్ని రోజులు పూజలు అందుకున్న వినాయకుడిని మనస్ఫూర్తిగా, భక్తితో మనసులో గుర్తుచేసుకోవడం అనే అంశం మీద దృష్టి తగ్గుతుందని పెద్దలు చెబుతుంటారు.

గణేశుడిని ప్రతిష్ఠించి, పూజలు చేసి, నిమజ్జనానికి తీసుకెళ్లేటప్పుడు మనకు సంబంధించి అన్ని కష్టాలను, ఇబ్బందులను, ప్రతికూల శక్తులను, అడ్డంకులను తనతో పాటు తీసుకుపోతాడని నమ్ముతారు. అందువల్ల ఆయన నిమజ్జనం తరువాత, భక్తులు వెనదిరిగి చూడకుండా, కొత్త ఆశతో, కొత్త ఉత్సాహంతో, పాజిటివ్ ఆలోచనలతో తమ ఇళ్లకు తిరిగి రావాలనే ఉద్దేశంతో ఈ సంప్రదాయాన్ని పాటిస్తారు.

ఏది ఏమైనా.. ఈ ఆచారంలోని ముఖ్య సారాంశం ఏమిటంటే.. పూజించిన దైవాన్ని సాగనంపేటప్పుడు మనసులో వైరాగ్యం, అంకితభావం ఉండాలి. మనిషికి చివరిగా ఏ బంధం కూడా తోడు రాదు. లౌకిక బంధాల పట్ల వ్యామోహం ఉండకూడదు. ఎవరూ.. ఎవరి వెంట ఉండరు. భక్తి మాత్రమే శాశ్వతం అని పెద్దలు అంటుంటారు.

మమకారం, నిరాశలను వదిలేయడం

గణపతిని ఇంటికి తెచ్చి రోజులు తరబడి పూజించి కుటుంబంలో ఒకరిగా భావిస్తారు. నిమజ్జనం చేసేటప్పుడు మనసులో బాధ లేదా ఇష్టం మిగిలిపోకూడదని, నిమజ్జనం తర్వాత వెనక్కు చూడకుండా ముందుకు సాగడం ద్వారా "మమకారాన్ని తొలగించుకోవడం" ప్రతీకాత్మకంగా సూచిస్తారు.

దేవుని వీడ్కోలు ఆధ్యాత్మికత

ఉత్తర పూజ, నిమజ్జనం ద్వారా స్వామివారి ఆవాహన ముగిసి, ఆయన తన దివ్య ధామానికి (కైలాసానికి) పయనమవుతారని నమ్ముతారు. ఆయన వెళ్తున్నప్పుడు ఆందోళనతో లేదా దిగులుతో వెనక్కి తిరిగి చూడటం ఆటంకంగా భావిస్తారు.

కష్టాలు, దరిద్రాన్ని వదిలించుకోవడం

స్వామివారు విగ్రహంతో పాటు ఇంట్లోని ప్రతికూలతలను, కష్టాలను తనతో పాటు తీసుకెళ్తారని నమ్మకం. నిమజ్జనం చేశాక వెనక్కు తిరిగితే ఆ ప్రతికూల శక్తులు మళ్లీ మనల్ని వెంటాడతాయనేది ఒక నమ్మకం.

ముందుకు సాగే తత్వం

జీవితంలో ఏది స్థిరం కాదు, మార్పు సహజం. గతాన్ని లేదా ముగిసిపోయిన దాన్ని పదే పదే తలచుకోకుండా "ముందుకు సాగాలి" అనే ఆధ్యాత్మిక సందేశాన్ని ఈ నిమజ్జన ప్రక్రియ అందిస్తుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More