రాయదుర్గంలో ఎకరం రూ.269 కోట్లు.. హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ఆకాశాన్నంటిన భూముల ధర
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో భూముల ధరలు మరోసారి వామ్మో అనిపించాయి. రాయదుర్గంలో ఎకరం భూమి ధర రూ.269 కోట్లుగా అమ్ముడుపోయింది.
రాజధాని హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచే ఐటీ కారిడార్ భూముల ధరల్లో మరొక చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. రాయదుర్గం వ్యాపార ప్రాంగణంలో భూముల విలువ కొత్త రికార్డులను తిరగరాస్తోంది. ఇటీవల జరిగిన ఈ వేలంలో ఎకరం ధర ఏకంగా రూ.269 కోట్లు పలకడం స్థానికంగా, జాతీయ స్థాయి రియల్టీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) రాయదుర్గం సర్వే నంబరు 83/1 పరిధిలో ఉన్న 5.38 ఎకరాల విలువైన స్థలానికి బహిరంగ ఆన్‌లైన్ వేలం నిర్వహించింది. అధికారులు ఎకరానికి కనీస మద్దతు ధరను రూ.175 కోట్లుగా నిర్ణయించారు. ఈ వేలంలో పాల్గొనేందుకు సుమారు రూ.10 కోట్ల ముందస్తు రుసుము చెల్లించిన ప్రధాన సంస్థలకు మాత్రమే ప్రవేశం కల్పించారు.
దేశంలోనే అగ్రగామి నిర్మాణ రంగ సంస్థలు హోరాహోరీగా పోటీపడగా, ఆఖరికి వంశీరాం బిల్డర్స్ ఎకరానికి రూ.269 కోట్ల చొప్పున వేలం దక్కించుకుంది. ఈ బిడ్డింగ్ ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఒకేసారి సుమారు రూ.1,447 కోట్ల భారీ ఆదాయం సమకూరింది.
రాయదుర్గం ప్రాంతంలో భూముల ధరలు ఎంత వేగంగా పెరుగుతున్నాయో చెప్పడానికి ఈ వేలమే ప్రత్యక్ష నిదర్శనం. సరిగ్గా వారం క్రితం ఈ ప్లాట్‌కు ఆనుకుని ఉన్న మరొక స్థలంలో ఎకరం భూమి రూ.264 కోట్లకు అమ్ముడుపోగా, ఇప్పుడు దాని పక్కనే ఉన్న స్థలం ఏకంగా రూ.269 కోట్లకు అమ్ముడై పాత రికార్డును తుడిచిపెట్టేసింది.
రాయదుర్గం, నాలెడ్జ్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాలు అంతర్జాతీయ కార్పొరేట్ కంపెనీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. మౌలిక వసతులు అద్భుతంగా ఉండటం, మెట్రో రైలు కనెక్టివిటీ, ఔటర్ రింగ్ రోడ్డు అందుబాటులో ఉండటం, వాణిజ్య సముదాయాల నిర్మాణానికి ఇక్కడ ఉన్న అనుకూలతలే భూముల ధరలు ఈ స్థాయికి చేరడానికి ప్రధాన కారణాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో ప్రీమియం ఆఫీస్ స్పేస్, లగ్జరీ కమర్షియల్ ప్రాజెక్ట్‌లకు విపరీతమైన డిమాండ్ ఉంది.
ప్రభుత్వం నిర్వహించిన ఈ వేలం విజయవంతం కావడంతో హైదరాబాద్ రియల్టీ మార్కెట్ క్రమంగా మరింత పుంజుకుంటుందని, రాబోయే రోజుల్లో ఇతర ఐటీ ప్రాంతాల్లో కూడా భూముల విలువ మరింత పెరిగే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ రంగా నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
రాయదుర్గం, పాన్‌మక్త వంటి ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల వేలానికి స్పందన బాగుంటుంది. ఐటీ సంస్థలు, గ్లోబల్ కంపెనీలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను ఇలాంటి ప్రాంతాల్లోనే విస్తరిస్తున్నాయి. దీంత భూములకు భారీగా డిమాండ్ పెరుగుతోంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


