Hyderabad Raidurg Land Auction : రాయదుర్గంలో రికార్డు ధర - ఎకరం రూ.264 కోట్లు!
హైదరాబాద్ లోని రాయదుర్గంలో ఎకరం రూ.264 కోట్లకు అమ్ముడుపోయింది. టీజీఐఐసీ నిర్వహించిన ఈ వేలం ద్వారా రూ.1,386 కోట్ల ఆదాయం సమకూరింది.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగా చరిత్రలోనే సరికొత్త రికార్డు నమోదైంది. నగరంలోని అత్యంత డిమాండ్ ఉన్న రాయదుర్గం ప్రాంతంలో ఉన్న ప్లాట్ నంబర్ పి1 (P1) వేలంలో ఊహించని ధరకు అమ్ముడై భూముల విలువలో కొత్త చరిత్ర సృష్టించింది. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) నిర్వహించిన ఈ ఈ-వేలంలో 5.25 ఎకరాల స్థలానికి ఏకంగా రూ.1,386 కోట్ల ఆదాయం వచ్చింది.

ఎకరం రూ.264 కోట్లు…
మల్టీ-యూజ్ జోన్ పరిధిలోకి వచ్చే 5.25 ఎకరాల రాయదుర్గంలోని ప్లాట్ పి1 కోసం టీజీఐఐసీ మొదట ఎకరానికి రూ.175 కోట్ల ప్రాథమిక ధర (Reserve Price) నిర్ణయించింది. అయితే వేలం ప్రారంభమైన తర్వాత ప్రముఖ డెవలపర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. చివరికి ఈ స్థలం ఎకరానికి రూ.264 కోట్ల దక్కించుకున్నారు. అంటే రిజర్వ్ ధర కంటే ఇది ఏకంగా 50.9 శాతం ఎక్కువ ప్రీమియం సాధించింది. హైదరాబాద్‌లోని వ్యూహాత్మక కారిడార్లలో భూములకు ఉన్న విపరీతమైన డిమాండ్‌ను, ఇన్వెస్టర్లలో కనిపిస్తున్న భరోసాను ఈ రికార్డు ధర ప్రతిబింబిస్తోంది.
రాయదుర్గం కారిడార్‌లో భూముల ధరలు ఎంత వేగంగా పెరుగుతున్నాయో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. సరిగ్గా మూడు నెలల కిందట, అంటే 2026 మే నెలలో TGIIC నిర్వహించిన వేలంలో ఇక్కడి స్థలం ఎకరానికి రూ.237 కోట్లు పలికింది. అది అప్పటికి రికార్డు కాగా…. ఇప్పుడు ఆగస్టు 2026 నాటికి ప్లాట్ పి1 వేలం ఆ పాత రికార్డును చెరిపేస్తూ ఎకరానికి రూ.264 కోట్లకు చేరింది. స్వల్ప వ్యవధిలోనే ఎకరానికి ఏకంగా రూ.27 కోట్లు పెరగడం ఐటీ కారిడార్‌పై రియల్టర్లకు ఉన్న నమ్మకానికి అద్దం పడుతోంది.
దేశవ్యాప్తంగా ఉన్న అగ్రగామి రియల్ ఎస్టేట్ డెవలపర్లు ఈ వేలంలో పాల్గొన్నారు. ఎంఎస్టీసీ (MSTC) ఈ-వేలం వేదిక ద్వారా అత్యంత పారదర్శకంగా ఈ ప్రక్రియ సాగింది. ప్రముఖ అంతర్జాతీయ ఆస్తి సలహా సంస్థ జేఎల్‌ఎల్ (JLL) ఈ లావాదేవీకి ఎక్స్‌క్లూజివ్ ట్రాన్సాక్షన్ అడ్వైజర్‌గా వ్యవహరించి, వేలం పోటీ వాతావరణంలో సజావుగా సాగేలా చూసింది.
ఈ వేలం విజయంపై TGIIC వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కె. శశాంక సంతోషం వ్యక్తం చేశారు. "ప్లాట్ పి1 వేలానికి లభించిన స్పందన తెలంగాణ భవిష్యత్తుపై డెవలపర్లు ఉంచిన నమ్మకాన్ని తెలియజేస్తోంది. ఇది కేవలం భూమికి వచ్చిన అధిక ధర మాత్రమే కాదు; పారదర్శకత, అద్భుతమైన మౌలిక సదుపాయాలు, వాటాదారులకు విలువను సృష్టించడం అనే రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సిద్ధాంతానికి లభించిన స్పష్టమైన ఆమోదం" అని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ ఒక అంతర్జాతీయ స్థాయి వ్యాపార కేంద్రంగా మారిన వైనాన్ని ఈ పోటీ వేలం ప్రతిబింబిస్తోందని ఆయన అన్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

