TGSRTC : ఎంటర్‌టైన్‌మెంట్ హబ్స్‌గా 13 టీజీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్లు.. షాపింగ్, ఫుడ్ కోర్ట్‌లు

TGSRTC Bus stations : ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు టీజీఎస్ఆర్టీసీ ప్రణాళికలు వేస్తోంది. ఇందులో భాగంగా బస్ స్టేషన్లను ఎంటర్‌టైన్‌మెంట్‌ హబ్స్‌గా మార్చేందుకు సిద్ధమవుతోంది.

Published on: Sep 17, 2026, 09:58:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TGSRTC) బస్ స్టేషన్లను వినోద కేంద్రాలుగా (ఎంటర్‌టైన్‌మెంట్ హబ్స్) మార్చే ప్రణాళికలను ప్రకటించింది. వీటిలో మల్టీప్లెక్స్‌లు కూడా ఉండే అవకాశం ఉంది. ఆర్టీసీ తెలిపిన వివరాల ప్రకారం.. 13 అత్యాధునిక బస్ స్టేషన్లు ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ బస్ స్టేషన్లుగా పనిచేస్తాయి. ఈ విధానం ప్రకారం.. ఆ స్టేషన్ కేవలం రవాణా కేంద్రంగానే కాకుండా, వ్యాపారాలు, వినోదం, ఇతర రవాణా వ్యవస్థల కలయికగా కూడా ఉంటుంది.

తెలంగాణ ఆర్టీసీ
తెలంగాణ ఆర్టీసీ

ఈ స్టేషన్లలోని సౌకర్యాలు విమానాశ్రయాలను తలపించేలా ఉంటాయని టీజీఎస్ఆర్టీసీ పేర్కొంది. 'తెలంగాణ ప్రభుత్వం సహకారం, టీజీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి వినూత్న ఆలోచనలతో రూపొందించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం, రవాణా శాఖ నుండి ఇప్పటికే అధికారిక ఆమోదం లభించింది.' అని ఆర్టీసీ తెలిపింది.

బస్సు దిగిన వెంటనే ప్రయాణికులకు రైల్వే సేవలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు ఉంటాయని సంస్థ పేర్కొంది. ఈ కాంప్లెక్స్‌లో షాపింగ్ కేంద్రాలు, వ్యాపార కేంద్రాలు కూడా ఉంటాయి. అలాగే గేమింగ్ జోన్‌లు, ఫుడ్ కోర్ట్‌లు, వినోద ప్రాంతాలు కూడా అందుబాటులో ఉంటాయి.

నాగర్‌కర్నూల్, రేగొండ, హుజూర్‌నగర్, కోదాడ, కొడంగల్, కోస్గి, మద్దూరు, కేశముద్రం, హుస్నాబాద్, ములుగు, మధిర, నల్గొండ, కొత్తగూడెం బస్ స్టేషన్లలో ఈ సౌకర్యాలు కల్పించేలా ప్లాన్ చేస్తున్నారు. ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయం ప్రయాణికులకు రవాణాను సులభతరం చేయడమే కాకుండా, ఆధునిక సౌకర్యాలు, సరికొత్త అనుభూతిని అందిస్తుంది. రాష్ట్రంలో ఉన్న బస్ స్టేషన్ల రూపరేఖలు మారిపోతాయి. ఈ మోడల్ బస్ స్టేషన్ల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.

టీజీఎస్ఆర్టీసీని పునరుద్ధరించడం, టికెట్ల అమ్మకాల ద్వారా కాకుండా ఇతర మార్గాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవడం అనే ఆలోచన గత దశాబ్ద కాలంగా పరిశీలనలో ఉంది. 2018లో అప్పటి ప్రభుత్వం టీజీఎస్ఆర్టీసీ ఆస్తులలో మల్టీప్లెక్స్‌లు లేదా థియేటర్లు, షాపింగ్ మాల్స్‌ను ఏర్పాటు చేసే సాధ్యాసాధ్యాలను పరిశీలించింది. అంతకుముందు 2016లోనే.. బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ పద్ధతిలో అనేక బస్ డిపోలలో మినీ-థియేటర్లను ఏర్పాటు చేసే ఆలోచనను కూడా పరిశీలించింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More