బొల్లారం మద్రాస్ రెజిమెంట్‌ ఆర్మీ క్యాంపు ఫైరింగ్‌ రేంజ్‌ వెనక ప్లాస్టిక్‌ బకెట్‌లో 160 ఎలక్ట్రిక్ డిటోనెటర్లు

హైదరాబాద్ బొల్లారంలోని మద్రాస్‌ రెజిమెంట్‌లో డిటోనేటర్లు బయటపడటం సంచలనం సృష్టిస్తోంది. ఫైరింగ్‌ రేంజ్‌ వెనుక గోడ సమీపంలో ప్లాస్టిక్‌ బకెట్‌లో 160 ఎలక్ట్రిక్ డిటోనెటర్లు దొరికాయి.

Published on: Sep 3, 2026, 10:56:02 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఉన్న మిలిటరీ స్థావరం భద్రతా లోపాలతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే బొల్లారంలోని 20వ మద్రాస్ ఆర్మీ రెజిమెంట్‌లో భారీ స్థాయిలో ఆయుధాలు చోరీకి గురికావడం, ఆ మరుసటి రోజే ఆర్మీ క్యాంప్ ఫైరింగ్ రేంజ్ సమీపంలో భారీగా డిటోనేటర్లు బయటపడటం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఆర్మీ అంతర్గత విచారణతో పాటు తెలంగాణ పోలీసులు, కేంద్ర మిలిటరీ ఇంటెలిజెన్స్ సంయుక్తంగా ఈ కేసుపై ముమ్మర దర్యాప్తు ప్రారంభించాయి.

బొల్లారంలో డిటోనెటర్లు కలకలం
బొల్లారంలో డిటోనెటర్లు కలకలం

ఆగస్టు 30 రాత్రి నుంచి ఆగస్టు 31వ తేదీ తెల్లవారుజాము మధ్య చోరీ జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆర్మీ కంటోన్మెంట్ లోపల ఉన్న ఆర్మరీ (ఆయుధాల నిల్వ గది) తాళాలను అగంతకులు విరగ్గొట్టి, లోపలికి ప్రవేశించారు. 4 ఏకే-47 రైఫిళ్లు, 6 పిస్టళ్లు, 1 ఇన్సాస్ రైఫిల్‌తో పాటు మరొక ఆయుధం కలిపి మొత్తం 12 అత్యాధునిక ఆయుధాలను దొంగిలించారు. వీటితో పాటు మరికొన్నింటిని కూడా ఎత్తుకెళ్లినట్టుగా తెలుస్తోంది.

అత్యున్నత స్థాయి భద్రత ఉండే సైనిక పరిసరాల్లోకి సాధారణ వ్యక్తులు ప్రవేశించడం అసాధ్యం. ఈ నేపథ్యంలో లోపలి సిబ్బంది సహకారం లేకుండా ఈ స్థాయిలో చోరీ జరగదని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఆయుధాల చోరీ ఘటనపై బొల్లారం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదై విచారణ కొనసాగుతుండగానే, మద్రాస్ రెజిమెంట్ ఫైరింగ్ రేంజ్ వెనుక ఉన్న గోడ వద్ద ఒక అనుమానాస్పద ప్లాస్టిక్ బకెట్ లభ్యమైంది.

ఆర్మీ సిబ్బంది ఆ బకెట్‌ను తనిఖీ చేయగా అందులో 8 బండిళ్లలో ప్యాక్ చేసిన 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు బయటపడ్డాయి. మార్కెట్లో వీటి విలువ సుమారు రూ.32,000 వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. సమాచారం అందుకున్న మల్కాజిగిరి బాంబ్ డిస్పోజల్ టీమ్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, ఆ డిటోనేటర్లను స్వాధీనం చేసుకుని సురక్షిత ప్రాంతానికి తరలించింది.

మిలిటరీ నుంచి ఏకే-47 వంటి ఆయుధాలు, భారీగా తూటాలు, డిటోనేటర్లు మాయమవ్వడం వెనుక ఏదైనా ఉగ్రవాద కోణం ఉందా? లేదా అక్రమ ఆయుధ వ్యాపారుల ప్రమేయం ఉందా? అనే కోణంలో పోలీసు ఉన్నతాధికారులు లోతుగా విచారిస్తున్నారు.

కంటోన్మెంట్ సరిహద్దులు, అన్ని చెక్‌పోస్టులు, సీసీటీవీ ఫుటేజీలను సైనిక, సివిల్ పోలీసులు జల్లెడ పడుతున్నారు. లోపలి వ్యక్తుల కాల్ డేటా, విధి నిర్వహణలో ఉన్న సెక్యూరిటీ గార్డుల వివరాలను కూడా సేకరిస్తున్నారు. దేశ రక్షణకు సంబంధించిన అత్యంత సున్నితమైన వ్యవహారం కావడంతో అధికారులు కేసు సమాచారాన్ని తీవ్ర గోప్యంగా ఉంచుతూ, నిందితుల కోసం గాలింపు చర్యలను తీవ్రతరం చేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More