Hyderabad Book Fair 2026 : పుస్తక ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే హైదరాబాద్ పుస్తక మహోత్సవానికి (హైదరాబాద్ బుక్ ఫెయిర్) ముహూర్తం ఖరారైంది. 39వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శనను ఈ ఏడాది డిసెంబర్ 18 నుంచి 28 వరకు లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ ప్రకటించింది.

ఇందుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షుడు రాంపల్లి రమేష్ వెల్లడించారు. సమాజ చైతన్యానికి అక్షరమే బలమైన ఆయుధమని వ్యాఖ్యానించారు.
"రాత అనేది ఆలోచనలకు పదును పెట్టే ఒక శక్తివంతమైన ఆయుధం. పుస్తక సంస్కృతిని విరివిగా వ్యాప్తి చేయడం, పాఠకాభిరుచిని పెంచడం సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత," అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే సందర్భంగా బుక్ ఫెయిర్ సొసైటీ నూతన కార్యవర్గాన్ని ఆయన మీడియాకు పరిచయం చేశారు. ఈ సారి ప్రదర్శనను మరింత వైభవంగా, సమాజంలోని అన్ని వర్గాలకు చేరవేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. యువత, విద్యార్థులు, మహిళలు, రచయితలు, పుస్తక ప్రేమికులను విశేషంగా ఆకట్టుకునేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు స్పష్టం చేశారు.
సొసైటీ ప్రధాన కార్యదర్శి పి. నారాయణరెడ్డి మాట్లాడుతూ…. 11 రోజుల పాటు జరిగే ఈ పుస్తక ప్రదర్శనలో ప్రతిరోజూ ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. ముఖ్యంగా పిల్లల్లో పఠనాసక్తిని, సృజనాత్మకతను పెంపొందించేందుకు 'బాలోత్సవ్' పేరిట ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు వివరించారు.
స్టాళ్ల కేటాయింపులో పూర్తి పారదర్శకత.
ఈసారి పుస్తక ప్రదర్శనలో వ్యాపారులు, పబ్లిషర్లకు ప్రాంగణంలో స్టాళ్ల కేటాయింపు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకున్నట్లు సొసైటీ ఉపాధ్యక్షుడు కె. బాలరెడ్డి పేర్కొన్నారు. అందుకోసం ప్రత్యేకంగా ఆన్లైన్ నమోదు విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చామని ఆయన వెల్లడించారు.ఈ