తెలంగాణ పోలీసుల ఎదుట 41 మంది మావోయిస్టులు లొంగుబాటు - లిస్టులో కీలక నేతలు..!
మావోయిస్టు పార్టీ నుంచి లొంగుబాట్లు కొనసాగుతున్నాయి. తెలంగాణ డీజీపీ సమక్షంలో భారీ స్థాయిలో 41 మంది మావోయిస్టులు శుక్రవారం లొంగిపోయారు. 24 తుపాకులతో పాటు మందుగుండు సామాగ్రిని అందజేశారు.
మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే కీలక నేతలు మృతి చెందగా… భారీస్థాయిలో లొంగుబాట్లు జరుగుతున్నాయి. తాజాగా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇందులో పలువురు రాష్ట్రస్థాయి నేతలు ఉన్నారు. 24 ఆయుధాలను అందజేశారు.

కీలక నేతలు…
లొంగిపోయిన వారిలో ప్లాటూన్ కమిటీ మెంబర్లు, డివిజనల్ కమిటీ సభ్యులు ఉన్నారని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది 509 మంది మావోయిస్టులు లొంగిపోయారని వివరించారు.
లొంగిపోయినవారిలో కొమురంభీం ఆసిఫాబాద్- మంచిర్యాల డివిజనల్ కమిటీ కార్యదర్శి ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్(40), అర్బన్ ఏరియా పార్టీ సభ్యుడు కనికారపు ప్రభంజన్(33) ఉన్నారని డీజీపీ పేర్కొన్నారు. లొంగిపోయిన వారిలో తెలంగాణకు చెందిన వారు వీరిద్దరే ఉన్నారని చెప్పారు. రవి కామారెడ్డి జిల్లా ఆరెపల్లి వాసి అని… ప్రభంజన్‌ది మంచిర్యాల జిల్లా జన్నారమని వెల్లడించారు.
ఇరవై నాలుగు తుపాకులతో పాటు పెద్ద స్థాయిలో మందుగుండు సామగ్రిని కూడా అందజేశారని డీజీపీ పేర్కొన్నారు. లొంగిపోయిన ఆయుధాలలో ఒక ఇన్సాస్ లైట్ మెషిన్ గన్, మూడు ఏకే-47 రైఫిల్స్, ఐదు ఎస్ఎల్ఆర్లు, ఏడు ఇన్సాస్ రైఫిల్స్, ఒక బీఎల్ గన్, నాలుగు .303 రైఫిల్స్, ఒక సింగిల్ షాట్ రైఫిల్, రెండు ఎయిర్ గన్లు, 733 లైవ్ రౌండ్ల మందుగుండు సామగ్రి, ఎనిమిది బీజీఎల్ షెల్స్ ఉన్నాయని వివరించారు.
మావోయిస్టు కార్యకర్తలు హింసను విడిచిపెట్టి రాష్ట్ర అభివృద్ధి ప్రక్రియలో పాల్గొనాలని కోరుతూ అక్టోబర్ నెలలో సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా కూడా పలువురు లొంగిపోయారని పోలీసులు తెలిపారు. అంతేకాకుండూ భద్రతా దళాల నుంచి నిరంతర ఒత్తిడి ఉండటంతో పాటు పార్టీలో నెలకొన్న అంతర్గత చీలికలు కూడా లొంగబాటుకు కారణమని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వ పునరావాస విధానం కింద ర్యాంక్ ఆధారంగా రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు ఆర్థిక సాయం అందజేస్తామని డీజీపీ తెలిపారు. శుక్రవారం లొంగిపోయిన 41 మంది కార్యకర్తలకు డాక్యుమెంటేషన్ పూర్తయిన తర్వాత మొత్తం రూ.1.46 కోట్లు పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే రూ.25 వేల చొప్పున మధ్యంతర ఉపశమనం అందజేశామని పోలీసులు తెలిపారు.
ఒక్క 2025లోనే కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులతో సహా వివిధ ర్యాంకులకు చెందిన 509 మంది మావోయిస్టు కార్యకర్తలు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారని డీజీపీ శివధర్ రెడ్డి వివరించారు. మిగిలి ఉన్న అండర్ గ్రౌండ్ కార్యకర్తలు కూడా జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. పునరావాసం స్కీమ్ లో భాగంగా… అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

