పంతంగి టోల్ ప్లాజా వద్ద ఒక్క రోజులో 52,000 వాహనాల రాకపోకలు.. నిమిషానికి 36

దసరా పండుగ, సెలవుల నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా వాహనాలు వెళ్తున్నాయి. సగటున నిమిషానికి 36 వాహనాలు ప్రయాణించినట్టుగా అధికారులు తెలిపారు.

Published on: Oct 18, 2026, 14:13:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

శనివారం(అక్టోబర్ 17) నాడు పంతంగి టోల్ ప్లాజా వద్ద నిమిషానికి సగటున 36 వాహనాలు ప్రయాణించాయి. దసరా పండుగల రద్దీ కారణంగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ గణనీయంగా పెరిగి 24 గంటల్లో 52,000 వాహనాలు ఈ మార్గం గుండా వెళ్లాయి. పది రోజుల క్రితం ఇదే సమయంలో సుమారు 37,000 వాహనాలు మాత్రమే నమోదయ్యాయి.

హైదరాబాద్-విజయవాడ హైవే ట్రాఫిక్
హైదరాబాద్-విజయవాడ హైవే ట్రాఫిక్

పండుగ సీజన్ కావడంతో హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ పట్టణాలకు ప్రయాణించే వారి సంఖ్య భారీగా పెరిగింది. దీనివల్ల టోల్ ప్లాజా వద్ద, రహదారికి ఇరువైపులా వాహనాలు బారులు తీరాయి, ట్రాఫిక్ చాలా నెమ్మదిగా సాగింది. ఇప్పటికీ అదే పరిస్థితి ఉంది. టోల్‌ప్లాజా వద్ద వాహనాలు నెమ్మదిగా కదలడంతో జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

టోల్ ప్లాజా అధికారుల తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 17 అర్ధరాత్రి నుండి అక్టోబర్ 18 అర్ధరాత్రి వరకు పంతంగి టోల్ ప్లాజా మీదుగా రెండు వైపులా కలిపి మొత్తం 52,000 వాహనాలు ప్రయాణించాయి. అంటే గంటకు సగటున సుమారు 2,167 వాహనాలు రాకపోకలు సాగించాయి.

శుక్రవారం నాడు 49,000 వాహనాలు, అక్టోబర్ 7న సుమారు 37,000 వాహనాలు నమోదవ్వగా, తాజా గణాంకాలు పది రోజుల్లోనే రోజువారీ ట్రాఫిక్‌లో 40.5 శాతం పెరుగుదల కనిపిస్తున్నాయి. సాధారణ రోజుల్లో ఇక్కడ సుమారు 30,000 నుండి 35,000 వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయని అధికారులు తెలిపారు. గత వారం రోజులుగా ఈ సంఖ్య 40,000 వరకు ఉందని, గత రెండు రోజుల్లో ట్రాఫిక్ గణనీయంగా పెరిగిందంటున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ సమీపంలో ఉన్న పంతంగి టోల్ ప్లాజా, హైదరాబాద్‌ను విజయవాడతో కలిపే ముఖ్యమైనది. ఈ రహదారిపై ప్రైవేట్ కార్లు, టాక్సీలు, అంతర్రాష్ట్ర బస్సులు, వాణిజ్య వాహనాలు, భారీ సరుకు రవాణా వాహనాలు వెళ్తుంటాయి. ఇది తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌లోని అనేక పట్టణాలు, జిల్లాలతో ఇది కనెక్ట్ చేస్తుంది.

పండుగ సీజన్‌లో సాధారణ వాణిజ్య వాహనాల రాకపోకలతోపాటు తమ సొంత ఊళ్లకు వెళ్లే కుటుంబాలు, ప్రయాణికుల ప్రైవేట్ కార్లు, బస్సుల సంఖ్య భారీగా పెరగడంతో ఈ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఎక్కువైంది. ప్రధాన రహదారిపై రద్దీని తగ్గించడానికి.. ట్రాఫిక్ పోలీసులు చౌటుప్పల్‌లోని లక్కారం నుండి కొన్ని వాహనాలను వలిగొండ మీదుగా చిట్యాల వైపు మళ్లించినట్లుగా తెలుస్తోంది. పండుగ కాలంలో ట్రాఫిక్ ఎంత తీవ్రంగా పెరిగిందో టోల్ ప్లాజా గణాంకాలను చూస్తే అర్థం చేసుకోవచ్చు. అక్టోబర్ 7వ తేదీన సుమారు 37,000 వాహనాలు దాటగా, అక్టోబర్ 16న 49,000, అక్టోబర్ 17 నాటికి 52,000 వాహనాలు దాటాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More