...
...
Next Story

TGSRTC Electric Buses : హైదరాబాద్‌లో మరో 60 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం

TGSRTC Electric Buses : కూకట్‌పల్లి డిపో పరిధిలో 60 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. హైదరాబాద్‌ను కాలుష్య రహితంగా మార్చేందుకు 3,000 ఈవీ బస్సులను తెస్తున్నామని తెలిపారు. త్వరలోనే ఆర్టీసీ కార్మిక ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి ప్రకటించారు.

Published on: May 27, 2026, 12:21:03 IST
Advertisement

TGSRTC Electric Buses : భాగ్యనగర వాసులకు పర్యావరణ హితమైన, సౌకర్యవంతమైన ప్రజా రవాణాను మరింత చేరువ చేస్తూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) మరో కీలక అడుగు వేసింది. గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా కూకట్‌పల్లి బస్ డిపోకు కేటాయించిన 60 సరికొత్త ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం జెండా ఊపి అధికారికంగా ప్రారంభించారు.

హైదరాబాద్‌లో మరో 60 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం
హైదరాబాద్‌లో మరో 60 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం

కూకట్‌పల్లి బస్ డిపోలో అత్యంత ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్, ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ (MD) వై. నాగిరెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి సహా పలువురు ఉన్నతాధికారులు, స్థానిక నేతలు పాల్గొన్నారు.

బస్సుల ప్రారంభోత్సవం అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ…. నగరంలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. "హైదరాబాద్ నగరం భవిష్యత్తులో కాలుష్య కోరల్లో చిక్కుకుని మరో ఢిల్లీలా మారకూడదనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాలను (EV) పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరల విపరీతమైన ప్రభావం ప్రజా రవాణాపై ఎంత భారంగా మారిందో మనందరికీ తెలుసు. కాలుష్యాన్ని తగ్గించాలనే స్పష్టమైన లక్ష్యంతో 2027 నాటికి మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం సంకల్పించింది" అని మంత్రి వివరించారు.

రవాణా శాఖ గణాంకాల ప్రకారం ప్రస్తుతం ఆర్టీసీలో మొత్తం 10 వేల బస్సులు ఉండగా….. అందులో 1,000 ఎలక్ట్రిక్ బస్సులు విజయవంతంగా నడుస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 960 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తుండగా…. అందులో కేవలం హైదరాబాద్ నగరంలోనే 545 ఈవీ బస్సులు సేవలందిస్తున్నాయి. దీనితో పాటు ఇంటర్‌సిటీ (నగరాల మధ్య) సేవల కింద మరో 580 బస్సులు నడుస్తున్నాయని మంత్రి పొన్నం పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో కొత్త కాలనీలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజా రవాణా వ్యవస్థను కూడా సమాంతరంగా బలోపేతం చేస్తున్నామని మంత్రి తెలిపారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేసిన విజ్ఞప్తికి మంత్రి సానుకూలంగా స్పందిస్తూ.. కేపీహెచ్‌బీ (KPHB) లో కొత్త బస్ డిపోను ఏర్పాటు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కూకట్‌పల్లి డిపో విస్తరణలో భాగంగా ఐదు (5) ఎకరాల అనుకూలమైన స్థలంలో ఈ కొత్త డిపోను ఏర్పాటు చేసేందుకు మేడ్చల్ జిల్లా కలెక్టర్, ఆర్టీసీ అధికారులు వెంటనే హౌసింగ్ బోర్డు అధికారులకు లేఖ రాయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ వేదికపైనే సూచించారు. ఇకపై కూకట్‌పల్లి పరిసర ప్రాంతాలను కాలుష్య రహితంగా మార్చేందుకు ఈ ఈవీ బస్సులు రోడ్లపై విస్తృతంగా తిరుగుతాయన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టామని మంత్రి ప్రకటించారు. కొత్త నియామకాలు చేపట్టడం, సరికొత్త బస్సులను ప్రవేశపెట్టడంతో తెలంగాణ ఆర్టీసీ నేడు దేశంలోనే నంబర్ వన్ సంస్థగా నిలుస్తోందన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘మహాలక్ష్మి’ ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా రాష్ట్రంలో మహిళలు ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 310 కోట్ల జీరో టికెట్లను వినియోగించుకున్నారని మంత్రి వెల్లడించారు. కేవలం మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడమే కాకుండా, రాబోయే రోజుల్లో మహిళలను సొంతంగా బస్సుల యజమానులుగా కూడా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోందని ఒక పెద్ద అప్‌డేట్ ఇచ్చారు.

త్వరలోనే గుర్తింపు ఎన్నికలు - మంత్రి పొన్నం

ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు. కార్మికుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ఒక పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

ఇకపై ప్రతి నెల రెండవ మంగళవారం నాడు అన్ని డిపోల మేనేజర్లు (DM), రీజినల్ మేనేజర్లు (RM) మరియు ఇతర ఉన్నతాధికారులు తప్పనిసరిగా కార్మికులతో సమావేశమవుతారని మంత్రి ప్రకటించారు. వారి సమస్యలపై క్షేత్రస్థాయిలో చర్చించి పరిష్కరిస్తారని వివరించారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఆర్టీసీ కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలను త్వరలోనే ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

ఎన్నికలు ముగిసిన వెంటనే, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన సంఘాల ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి కార్మికుల సుదీర్ఘకాల సమస్యలన్నింటినీ శాశ్వతంగా పరిష్కరిస్తామని వివరించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks