Telangana : అబ్దుల్లాపూర్‌మెట్ లో ఏసీబీ సోదాలు - రూ.20 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎమ్మార్వో, సర్వేయర్
అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి, సర్వేయర్ శ్రీనివాసులు రూ.20 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. హెచ్‌ఎమ్‌డీఏ లేఔట్ సర్వే నివేదిక కోసం వీరిద్దరూ రూ.30 లక్షలు డిమాండ్ చేశారు.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోమవారం సాయంత్రం సోదాలు నిర్వహించారు. హెచ్‌ఎండీఏ (HMDA) నిబంధనల ప్రకారం భూమిని సర్వే చేసి, జాయింట్ ఇన్‌పెక్షన్ సర్వే నివేదికను జారీ చేయడానికి పెద్దమొత్తంలో లంచం డిమాండ్ చేసిన అధికారుల గుట్టును రట్టు చేశారు. బాధితుడి నుంచి రూ.20 లక్షల లంచం తీసుకుంటుండగా మండల సర్వేయర్ బటుక శ్రీనివాసులతో పాటు ఎమ్మార్వోను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఈ భారీ లంచం డిమాండ్ వ్యవహారంలో అబ్దుల్లాపూర్‌మెట్ మండల తహసీల్దార్ బి. సుదర్శన్‌రెడ్డికి నేరుగా ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లభించాయి. దీంతో ఆయనను కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చి అరెస్టు చేశారు.
రూ.20 లక్షలకు బేరం….
ఏసీబీ అధికారులు విడుదల చేసిన ప్రకటనలోని వివరాల ప్రకారం…. భూ సర్వే నివేదిక ఇవ్వడానికి నిందితులు ప్రారంభంలో ఏకంగా రూ.30 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితుడు అంత ఇచ్చుకోలేనని చెప్పడంతో… బేరసారాల తర్వాత ఆ మొత్తాన్ని రూ.20 లక్షలకు కుదించారు. తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకే మండల సర్వేయర్ శ్రీనివాసులు ఫిర్యాదుదారు నుంచి ఈ సొమ్మును స్వీకరించారు. ఆ సమయంలో ముందస్తు ప్రణాళిక ప్రకారం దాడి చేసిన ఏసీబీ బృందం… సర్వేయర్‌ను అదుపులోకి తీసుకుంది.
అరెస్టు సమయంలో సర్వేయర్ శ్రీనివాసులు వద్ద నుంచి రూ.20 లక్షల డబ్బులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆయన చేతి వేళ్లకు రసాయన పరీక్షలు (కెమికల్ టెస్ట్) నిర్వహించగా పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. ప్రభుత్వ అధికారులు తమ అధికారిక హోదాను దుర్వినియోగం చేస్తూ, ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ అవినీతికి పాల్పడినట్లు అధికారులు స్పష్టం చేశారు. బాధ్యులైన ఇద్దరిపై చట్టపరమైన చర్యలు వేగవంతం చేశారు. అరెస్ట్ అనంతరం ఏసీబీ కోర్టుకు తరలించారు.
ఏవరైనా ప్రభుత్వ అధికారి లేదా ఉద్యోగి లంచం డిమాండ్ చేస్తే ప్రజలు వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 ద్వారా సంప్రదించాలని అధికారులు కోరారు. అంతేకాకుండా…. వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఫిర్యాదుదారుల సమాచారాన్ని అత్యంత రహస్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

