...
...
Next Story

ACB Raid : ఆదాయానికి మించిన ఆస్తులు.... ఏసీబీకి చిక్కిన నిమ్స్‌ అడిషనల్‌ సూపరింటెండెంట్‌

హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి ఆసుపత్రి అదనపు సూపరింటెండెంట్‌ లక్ష్మీభాస్కర్ నివాసంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తించి… డీఏ కేసు నమోదు చేశారు.

Published on: Sep 23, 2026, 08:22:19 IST
Advertisement

హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మక నిమ్స్‌ ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్న వైద్యాధికారి అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రి అదనపు సూపరింటెండెంట్‌ డా.నోరి లక్ష్మీభాస్కర్‌(56) నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహించగా… ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు కాగా… దర్యాప్తు కొనసాగుతోంది.

నిమ్స్‌ వైద్యుడికి ఆదాయానికి మించిన ఆస్తులు - ఏసీబీ కేసు నమోదు
నిమ్స్‌ వైద్యుడికి ఆదాయానికి మించిన ఆస్తులు - ఏసీబీ కేసు నమోదు

డాక్టర్ ఎన్. లక్ష్మీభాస్కర్ తన అధికారిక పదవిని దుర్వినియోగం చేస్తూ… అవినీతి అక్రమాల ద్వారా ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై ఏసీబీ సోదాలు చేపట్టింది. అధికారిక ఆదాయ మార్గాలకు భిన్నంగా అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో ఆయనపై అవినీతి నిరోధక చట్టం 1988 (2018 సవరణ) ప్రకారం కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఏకకాలంలో దాడులు

కేసు నమోదు చేసిన అనంతరం ఏసీబీ బృందాలు సోదాలను ముమ్మరం చేశాయి. హైదరాబాద్‌లోని ఆయన నివాసంతో పాటు ఆయన బంధువులు, స్నేహితులు, బినామీలు, ఇతర సన్నిహితులకు చెందిన ఏడు వేర్వేరు ప్రాంతాల్లో మంగళవారం ఏకకాలంలో అధికారులు విస్తృత సోదాలు చేపట్టారు. ఈ దాడుల్లో ఆయనకు చెందిన పలు స్థిర, చర ఆస్తు పత్రాలు, పెట్టుబడుల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఏసీబీ సోదాల్లో బయటపడిన ఆస్తుల అధికారిక పత్రాల ప్రకారం లక్ష్మీభాస్కర్ వద్ద రూ.6.13 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి…

  • 8 ప్లాట్లు / అపార్ట్‌మెంట్లు మరియు 5 ఖాళీ స్థలాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు.
  • వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ. 41 లక్షల నగదు నిల్వలు.
  • పోస్టాఫీసులో చేసిన రూ. 12 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్లు.
  • ప్రైవేట్ ఆర్థిక సంస్థలలో రూ. 35 లక్షల పెట్టుబడులు.
  • మ్యూచువల్ ఫండ్లలో పెట్టిన రూ. 29.55 లక్షల పెట్టుబడులు.
  • సుమారు 517.8 గ్రాముల బంగారు ఆభరణాలు.
  • 3 నాలుగు చక్రాల వాహనాలు (కార్లు), 4 ద్విచక్ర వాహనాలు, మరియు ఖరీదైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు.

బహిరంగ మార్కెట్ లో భారీగా విలువ…

ఇవే కాకుండా…. డెట్ రికవరీ ట్రిబ్యునల్ (DRT) వివాదంలో ఉన్న ఒక అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ను కొనుగోలు చేయడానికి ఆయన ఏకంగా రూ. 1.3 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు ఏసీబీ విచారణలో తేలింది. అంతేకాకుండా వివిధ వ్యక్తులకు రూ. 1.33 కోట్లను చేతి బదులుగా (హ్యాండ్ లోన్స్) ఇచ్చారని విచారణ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ వ్యవహారానికి సంబంధించి మరిన్ని రహస్య ఆస్తుల వివరాలను సేకరించే పనిలో ఉన్నామని… కేసు విచారణ శరవేగంగా కొనసాగుతోందని ఏసీబీ అధికారులు తెలిపారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks