...
...
Next Story

రూ.100 కోట్ల అవినీతి చేసిన డిప్యూటీ కలెక్టర్.. ముందే లాకర్లు ఖాళీ చేసిన కిలాడీ ఆఫీసర్!

మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ ఇళ్లపై ఏసీబీ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో విస్తూపోయే నిజాలు తెలిశాయి. రూ.100 కోట్ల వరకు అవినీతి చేసినట్టుగా అధికారులు గుర్తించారు.

Published on: May 23, 2026, 11:22:26 IST
Advertisement

ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తూ, అక్రమ సంపాదనతో కోట్లు కూడబెట్టిన మరో పెద్ద అవినీతి తిమింగలం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలకు చిక్కింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ (అర్బన్ ల్యాండ్ సీలింగ్ విభాగం) మర్రి వంశీమోహన్‌పై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు.

రూ.100 కోట్ల అవినీతి చేసిన డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్
రూ.100 కోట్ల అవినీతి చేసిన డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్

శుక్రవారం తెల్లవారుజామునే రంగంలోకి దిగిన ఏసీబీ బృందాలు హైదరాబాద్ వనస్థలిపురంలోని ఆయన నివాసంతో పాటు మేడ్చల్ యూఎల్‌సీ కార్యాలయం, గుంటూరులోని ఆయన మామ ఇల్లు, బంధువులు, బినామీలకు చెందిన మొత్తం 11 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించాయి.

మార్కెట్ విలువ రూ.100 కోట్లు!

ఈ సోదాలలో వంశీమోహన్‌కు చెందిన భారీగా ఆస్తులను అధికారులు గుర్తించారు. ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువల ప్రకారం వీటి ఖరీదు రూ.6.22 కోట్లు (ఇందులో రూ.5.68 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి). అయితే, బహిరంగ మార్కెట్‌లో వీటి అసలు విలువ రూ.100 కోట్లకు పైనే ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. సోదాల అనంతరం వంశీమోహన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

శేరిలింగంపల్లి తహసీల్దార్‌గా ఉన్నప్పుడే

వంశీమోహన్ అవినీతి సామ్రాజ్యానికి పునాది ఆయన శేరిలింగంపల్లి తహసీల్దార్‌గా పనిచేసిన కాలంలోనే (2019-23) పడినట్లు తెలుస్తోంది. ఐటీ కారిడార్‌ ప్రాంతంలో వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేటు శక్తులకు కట్టబెట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు ఉన్నాయి.

మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, ఖానామెట్, గుట్టలబేగంపేట్, గోపన్‌పల్లి, హఫీజ్‌పేట్ ప్రాంతాల్లోని వివాదాస్పద ప్రభుత్వ భూములపై కోర్టు కేసులు నడుస్తున్నప్పటికీ.. అవేవీ ఖాతరు చేయకుండా ప్రైవేటు వ్యక్తులు పాగా వేసేలా సహకరించారు. ఈ అక్రమాల్లో అప్పటి జిల్లా కలెక్టర్ స్థాయి అధికారి ఒకరు వంశీమోహన్‌కు అండగా నిలిచారని, వారిద్దరూ కలిసి పెద్ద ఎత్తున లబ్ధి పొందారని ఏసీబీ అనుమానం వ్యక్తం చేస్తోంది.

మామ పేరిట రిజిస్ట్రేషన్

ఆ తర్వాత ఈ భూమిని ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థకు అప్పగించి, దానికి ప్రతిఫలంగా సదరు వెంచర్‌లో 10 ఖరీదైన ప్లాట్లను వంశీమోహన్ లంచంగా పొందినట్లు వస్తున్న ఆరోపణలపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

ముందే ఊహించి.. పక్కా స్కెచ్‌తో లాకర్లు ఖాళీ!

డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ చాలా తెలివిగా వ్యవహరించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఎప్పటికైనా తనపై ఏసీబీ నిఘా పడుతుందని ఊహించిన ఆయన, గడిచిన రెండేళ్లుగా ఎలాంటి ఆధారాలు దొరకకుండా జాగ్రత్తపడ్డారు. వనస్థలిపురంలోని ఇంట్లో కనీసం ఆస్తి పత్రాలు కూడా దొరకకపోవడం అధికారులను ఆశ్చర్యపరిచింది.

ఆయనకు చెందిన రెండు బ్యాంక్ లాకర్లను తెరిచి చూడగా, అందులో కనీసం భార్య బంగారు ఆభరణాలు కూడా లేవు. ఏసీబీ రైడ్ జరుగుతుందనే ముందస్తు అనుమానంతోనే పక్కా ప్లాన్ ప్రకారం నగదు, బంగారం, డాక్యుమెంట్లను సురక్షిత ప్రాంతాలకు లేదా బినామీల వద్దకు మార్చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. గడిచిన రెండు సంవత్సరాలుగా పెద్దగా లావాదేవీలు కూడా ఏం చేయలేదు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe