...
...
Next Story

ఆదిలాబాద్‌లో అతిపెద్ద ఎయిర్‌పోర్ట్.. మామునూరు విమానాశ్రయానికి 3 నెలల్లో శంకుస్థాపన

Telangana Airport : ఆదిలాబాద్‌లో అతిపెద్ద ఎయిర్‌పోర్ట్ రానుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. అంతేకాదు వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్‌పై కూడా అప్డేట్ ఇచ్చారు.

Published on: Apr 8, 2026, 22:01:54 IST
Advertisement

కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను అశ్వినీ వైష్ణవ్, కిషన్ రెడ్డితో కలిసి విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు సమావేశమయ్యారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు సంబంధించి.. అన్ని డిమాండ్లను పరిశీలిస్తున్నట్టుగా రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఫీజబులిటీ ఉన్న చోట ఎయిర్‌పోర్టులను నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. మామునూరు ఎయిర్‌పోర్టుకు మరో మూడు నెలల్లో శంకుస్థాపనం చేయాలని అనుకుంటున్నామన్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఆదిలాబాద్, కొత్తగూడెం ఎయిర్‌పోర్టు ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్టుగా రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు అంశం మీద కూడా తాజాగా కీలక చర్చ చేసినట్టుగా తెలిపారు. ఆదిలాబాద్‌లో అతిపెద్ద ఎయిర్‌పోర్ట్ నిర్మించాలని అనుకుంటున్నట్టుగా పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్రం ప్రణాళికలు వేస్తోందన్నారు.

'ఆదిలాబాద్‌లో రక్షణ శాఖకు 300 ఎకరాల భూమి ఉంది. సివిల్ ఏవియేషన్‌తో కలిసి జాయింట్ వెంచర్‌కు సిద్ధంగా ఉన్నామని రక్షణ శాఖ వెల్లడించింది. సైన్యానికి శిక్షణతోపాటుగా సివిల్ ఏవియేషన్ అవసరాల కోసం వాడాలని రక్షణ మంత్రి వెల్లడించారు. ఈ నెల 17న క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లాలని అధికారులు నిర్ణయించారు.' అని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు తెలంగాణ ప్రభుత్వం 450 ఎకరాలు ఇవ్వాల్సి ఉంటుందని రామ్మోహన్ నాయుడు చెప్పారు. భూసేకరణకు ఎలాంటి సమస్యలు లేవని ఆదిలాబాద్ నేతలు చెబుతున్నట్టుగా తెలిపారు. ఎయిర్‌పోర్టుకు కావాల్సిన అన్ని పాటిబులిటీస్ ఆదిలాబాద్‌కు ఉన్నాయన్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం దగ్గర ఎయిర్‌పోర్ట్ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం పంపించిన విషయాన్ని రామ్మోహన్‌నాయుడు గుర్తు చేశారు.

'ఆదిలాబాద్‌లో పెద్ద ఎయిర్‌పోర్ట్ నిర్మించాలని కేంద్రం భావిస్తోంది. సైనిక, పౌరుల అవసరాలకు అనుగుణంగా ఈ ఎయిర్‌పోర్ట్ ఉండనుంది. ఇందుకు సివిల్ ఏవియేషన్‌తో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం.' అని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks