నిమ్స్‌ ఆసుపత్రికి వచ్చేవారికి సూచన.. 3 నెలలు సొంత వాహనాల్లో రాకండి

నిమ్స్‌కు వచ్చేవారి కోసం అధికారులు విజ్ఞప్తి చేశారు. 3 నెలలపాటు సొంత వాహనాల్లో రాకపోవడమే మంచిదని తెలిపారు. పార్కింగ్ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు.

Published on: Oct 13, 2026, 20:44:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) ఒక ప్రకటన జారీ చేసింది. నిమ్స్‌ను సందర్శించే రోగులు, సహాయకులు, సందర్శకులు ప్రజా రవాణాను ఉపయోగించుకోవాలని తెలిపింది. అత్యవసరం అయితే తప్ప ప్రైవేట్ వాహనాలను తీసుకురావద్దని కోరింది.

నిమ్స్
నిమ్స్

రాబోయే మూడు నెలల పాటు ఆసుపత్రి ప్రాంగణంలో జీహెచ్‌ఎంసీ దశలవారీగా సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్న నేపథ్యంలో ఈ మేరకు నిమ్స్ అధికారులు ప్రకటన జారీ చేశారు. సీసీ రోడ్ల నిర్మాణ పనుల కారణంగా.. ఈ మూడు నెలల నిర్మాణ కాలమంతా ఆసుపత్రి ప్రాంగణంలో పార్కింగ్ లభ్యత తీవ్రంగా పరిమితంగా ఉంటుందని నిమ్స్(NIMS) తెలిపింది.

ఈ మౌలిక సదుపాయాల పనుల్లో భాగంగా క్యాంపస్‌లోని పలు కీలక ప్రాంతాలలో పనులు చేపట్టనున్నారు. వీటిలో పుంజాగుట్ట ఎంట్రీ, ఎగ్జిట్ ద్వారాలు, మిలీనియం, ఫిజియోథెరపీ బ్లాక్, డయాలసిస్ వెయిటింగ్ ఏరియా, వెల్‌నెస్ సెంటర్, ఎన్‌పీఆర్ బ్లాక్, యూనియన్ బ్యాంక్ వద్ద ఉన్న సిబ్బంది పార్కింగ్ ప్రాంతం ఉన్నాయి.

నిర్మాణ పనుల వల్ల నర్సింగ్ హాస్టల్‌కు వెళ్లే మార్గం, డాక్టర్స్ క్లబ్ ముందున్న డాక్టర్ల పార్కింగ్, CSSD, జనరల్ స్టోర్స్‌కు వెళ్లే దారి, పోర్టికో, ఉమ్మడి పార్కింగ్ ప్రాంతం కూడా ప్రభావితమవుతాయి. దీంతో సొంత వాహనాల్లో వస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. పార్కింగ్ కోసం వెతకాల్సిన పరిస్థితులు రావొచ్చు.

ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, ప్రాంగణంలో వాహనాల రాకపోకలు సజావుగా సాగేలా చేయడానికి, అంబులెన్స్‌లు, ఇతర అత్యవసర సేవలకు ఆటంకాలు లేని ఎంట్రీ కల్పించడానికి అధికారులు ఈ మేరకు ప్రకటన జారీ చేశారు. ఈ చర్యలు అత్యవసరం అని ఆసుపత్రి యాజమాన్యం పేర్కొంది. ఎమర్జెన్సీ ఉన్నవారికి ఇబ్బంది చేయకుండా, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌పై ఆధారపడటమం మంచిదని అధికారులు వెల్లడించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More