వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనుల్లో జాప్యంపై సీఎం రేవంత్ సీరియస్ - కీలక ఆదేశాలు!

వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణంలో జాప్యంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే 30 రోజులు 24 గంటలూ పనులు జరపాలని… కలెక్టర్ ప్రతిరోజూ పనుల పురోగతిని పర్యవేక్షించాలని ఆదేశించారు.

Published on: Sep 22, 2026, 07:38:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ పరంగా గ్రీన్ ఛానల్‌లో నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ నిర్మాణంలో జాప్యం జరగడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష

రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల నిర్మాణ పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవన నిర్మాణ పనుల్లో జరుగుతున్న ఆలస్యంపై ఈ సందర్భంగా అధికారులపై ఆయన తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వపరంగా గ్రీన్ ఛానల్‌లో అవసరమైన నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నప్పటికీ…. పనుల్లో ఎందుకు పురోగతి కనిపిండం లేదని ఆయన ప్రశ్నించారు.

సీఎం కీలక ఆదేశాలు…

నిర్మాణ వేగాన్ని పుంజుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాబోయే 30 రోజుల పాటు రోజుకు 24 గంటల చొప్పున మూడు షిఫ్టుల్లో పనులు నిరంతరాయంగా కొనసాగాలని స్పష్టం చేశారు. పనుల పూర్తికి నిర్దిష్టమైన టైమ్‌లైన్‌తో ఒక షెడ్యూల్‌ను సిద్ధం చేసుకుని, దానికి అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని అధికారులకు సూచించారు.

వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను ముఖ్యమంత్రి కార్యాలయ (CMO) అధికారులు క్షేత్రస్థాయికి వెళ్ళి క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు. పనుల్లో ఎలాంటి అలసత్వం వహించినా సహించేది లేదని హెచ్చరించారు. ప్రతి ప్రధాన పనికి ఒక ప్రత్యేక అధికారికి పూర్తి బాధ్యతలను అప్పగించాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఇకపై ప్రతిరోజూ ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిని నేరుగా పర్యవేక్షించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

ఆసుపత్రి నిర్మాణంలో పాల్గొంటున్న వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కొరవడకుండా ప్రత్యేకంగా ఒక సమన్వయ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. రోగులకు, వారి సహాయకులకు మానసిక ప్రశాంతతను అందించేలా ఆసుపత్రి పరిసరాలను ఆహ్లాదకరమైన వాతావరణంలో, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని చెప్పారు.

ఇదే సమావేశంలో రాష్ట్రంలోని ఇతర ప్రముఖ వైద్య సంస్థల పనులపైనా ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్ సనత్‌నగర్ టిమ్స్ (TIMS) ఆసుపత్రి తరహాలోనే వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో కూడా వెంటనే ఔట్ పేషెంట్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.

అలాగే…. సనత్‌నగర్ టిమ్స్‌లో వైద్యులు, సిబ్బంది కోసం స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఆసుపత్రి నిర్వహణ బాధ్యతలను, పారిశుద్ధ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా ఒక ప్రొఫెషనల్ ఏజెన్సీకి అప్పగించాలని అధికారులకు సూచించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More