హైదరాబాద్ నుంచి చుక్కలు చూపిస్తున్న ఫ్లైట్ టికెట్ ధరలు.. బ్యాంకాక్, సింగపూర్ కంటే ఎక్కువ

దీపావళి పండుగ వస్తుండటంతో బ్యాంకాక్, సింగపూర్ కంటే దేశీయ విమాన సర్వీసుల టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్‌ నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే ఫ్లైట్ టికెట్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.

Published on: Oct 8, 2026, 11:46:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

దీపావళి పండుగ వేళ సొంత ఊళ్లకు, పర్యటనలకు వెళ్లే ప్రయాణికులకు విమానయాన సంస్థలు షాక్ ఇస్తున్నాయి. హైదరాబాద్ శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(RGIA) నుంచి దేశీయ విమాన ఛార్జీలు ఊహించని రీతిలో ఆకాశాన్ని తాకుతున్నాయి. ఏకంగా విదేశీ ప్రయాణాల కంటే కూడా దేశీయ నగరాలకు వెళ్లే విమాన టికెట్ల ధరలే అధికంగా ఉండటం ప్రయాణికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

పెరిగిన విమాన టికెట్ల ధరలు
పెరిగిన విమాన టికెట్ల ధరలు

సాధారణంగా పండుగల సమయంలో ప్రయాణికుల రద్దీ వల్ల ఛార్జీలు పెరగడం సాధారణమే అయినప్పటికీ, ఈసారి పరిస్థితి మరీ తీవ్రంగా మారింది. హైదరాబాద్ నుంచి సింగపూర్, మలేషియా, థాయిలాండ్‌లోని బ్యాంకాక్ వంటి అంతర్జాతీయ పర్యాటక ప్రాంతాలకు వెళ్లే వన్-వే విమాన టికెట్ ధరలు రూ. 15,000 నుండి రూ. 18,000 మధ్య అందుబాటులో ఉన్నాయి.

కానీ హైదరాబాద్ నుంచి ఉత్తరాది, ఈశాన్య నగరాలకు వెళ్లే విమాన టికెట్ల ధరలు మాత్రం వీటిని దాటేసి రికార్డు స్థాయికి చేరుకున్నాయి: సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి చండీగఢ్ లేదా పట్నాకు వన్-వే టికెట్ ధర రూ. 9,000 వరకు ఉంటుంది. కానీ ఈ దీపావళి సీజన్‌లో ఇది ఏకంగా రూ. 22,000 దాటిపోయింది.

కోల్‌కతా, గౌహతి, లక్నో, భోపాల్, ఇండోర్ తదితర నగరాలకు వెళ్లే విమాన ఛార్జీలు కూడా భారీగా పెరిగాయి. పండుగ తేదీలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రయాణికుల రద్దీ మరింత పెరిగి, ఈ విమాన ఛార్జీలు మరింత ప్రియం కానున్నాయని ట్రావెల్ ఏజెంట్లు హెచ్చరిస్తున్నారు.

పండుగల వేళ సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగినప్పటికీ, దానికి తగినట్లుగా విమాన సీట్ల లభ్యత లేకపోవడమే ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. మధ్యప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా విమానయాన రంగానికి చెందిన అంతర్జాతీయ రూట్లలో మార్పులు, విమానాల లభ్యతపై ప్రభావం పడింది.

డిమాండ్ పెరిగే కొద్దీ ఆటోమేటిక్‌గా ధరలు పెరిగే డైనమిక్ ప్రైసింగ్ విధానం వల్ల చివరి నిమిషంలో బుక్ చేసుకునే వారిపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది.

విమాన ఛార్జీల బాదుడుతో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులకు భారతీయ రైల్వే ఊరటనిస్తోంది. పండుగ రద్దీని తట్టుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక చర్యలు చేపట్టింది. తెలంగాణను ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ భారత దేశంలోని వివిధ ప్రాంతాలతో అనుసంధానిస్తూ దాదాపు 600 పండుగ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది.

వీటిలో పలు రైళ్లలో ఇప్పటికీ బెర్త్‌లు అందుబాటులో ఉన్నాయని రైల్వే అధికారులు వెల్లడించారు. విమాన ఛార్జీల భారాన్ని తట్టుకోలేని వారు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా ఈ ప్రత్యేక రైళ్లలో రిజర్వేషన్లు చేసుకోవచ్చని సూచించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More