నేరస్థులను త్వరగా గుర్తించడానికి ఏఐ టెక్నాలజీని వినియోగించాలి : సీఎం రేవంత్ రెడ్డి

Police Officers Retreat 2026 : నేరాలను నిరోధించడం, నేరస్థులను త్వరగా గుర్తించడానికి ఏఐ టెక్నాలజీని వినియోగించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న నేపథ్యంలో కొత్త తరహా నేరాలు పెరగకుండా సైబర్ క్రైమ్ విభాగాన్ని మరింత పటిష్టం చేయాలన్నారు.

Published on: Mar 9, 2026, 22:24:25 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భవిష్యత్తులో రాబోయే సవాళ్లను ఎదుర్కొనడానికి పోలీసు శాఖ సర్వసన్నద్ధం కావలసిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రాబోయే 25 సంవత్సరాలకు అవసరమైన కార్యాచరణపై చర్చించి ప్రణాళికలు రూపొందించుకోవాలని పోలీసు శాఖకు సూచించారు.

పోలీస్ రిట్రీట్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి
పోలీస్ రిట్రీట్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి

ఆర్‌బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో సుదీర్ఘ కాలం తర్వాత నిర్వహించిన పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్ 2026 కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఫ్యూచర్ రెడీ కార్యక్రమంలో భాగంగా వివిధ విభాగాల పోలీసు ఉన్నతాధికారులు ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రికి వివరించారు. పోలీసింగ్‌కు సంబంధించి భవిష్యత్తులో చేపట్టాల్సిన మార్పులు, ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యల ఆవశ్యకతను ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ పోలీస్ అకాడమీ లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టంను ఆవిష్కరించారు.

సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న నేపథ్యంలో కొత్త తరహా నేరాలు పెరగకుండా సైబర్ క్రైమ్ విభాగాన్ని మరింత పటిష్టం చేయాలని సీఎం రేవంత్ చెప్పారు. నేరాలను నిరోధించడం, నేరస్థులను త్వరగా గుర్తించడానికి AI టెక్నాలజీని వినియోగించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.

శాంతి భద్రతలు కాపాడటంలో దేశంలో తెలంగాణ ఒక మెరుగైన రాష్ట్రంగా గుర్తింపు పొందిందని సీఎం రేవంత్ అన్నారు. అందుకు పోలీసు శాఖను అభినందిస్తున్నానని తెలిపారు. 2047 లక్ష్యాలను చేరుకోవడానికి ఎంపవర్ కావలసిన అవసరం ఉందన్నారు.

ఫ్యూచర్ రెడీ కోసం పోలీసు శాఖ చేసిన ప్రతిపాదనలు, అనుసరించాల్సిన విధానం, దానికి చట్ట బద్ధత కల్పించడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో రవాణా శాఖ ప్రత్యేక కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శితో కూడిన కమిటీని నియమిస్తామని ప్రకటించారు సీఎం. ఆర్థిక, న్యాయ, సాంకేతిక, పరిపాలన పరమైన అంశాలను చర్చించిన తర్వాత చట్టరూపం కల్పించే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.

'పోలీసు శాఖను ఎంపవర్ చేయడానికి అవసరమైన నిధులు కేటాయించడంలో ఇబ్బంది లేదు. కానీ ఫలితాలొచ్చే విధంగా ఆ నిధులు సద్వినియోగం అవుతాయన్న ఒక విశ్వాసం కల్పించాలి. మనకున్న ఫిజికల్ క్రైమ్, మన ఎకోసిస్టమ్ ఆధారంగా మాన్యువల్స్ రాసుకున్నాం. ఇప్పుడు పరిస్థితుల్లో చాలా మార్పులొచ్చాయి. నేర స్వరూపమే పూర్తిగా మారిపోయింది. సైబర్ క్రైమ్, డ్రగ్స్ వంటి కొత్త సమస్యలొచ్చాయి. పోలీసు అధికారులు మొట్టమొదట సమస్య ఏంటో అర్థం చేసుకోగలగితే సగం సమస్య పరిష్కారమైనట్టే. సమస్య అర్థంకానప్పుడు వేగంగా పరిష్కరించాలని ప్రయత్నించినా ప్రయోజనం ఉండదు. ఉద్యోగం వచ్చింది కదా అని సమాజంతో పనిలేదన్న భావన రావొద్దు. బాధ్యత మరింతగా పెరిగిందని గుర్తించాలి. ఉద్యోగం వచ్చిందని ఆటో మోడ్‌లోకి వెళ్లి రిలాక్స్ అయ్యారంటే నష్టం జరుగుతుంది.' అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..

  • 'దేశంలోని ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా లాంటి మెట్రోపాలిటన్ నగరాలు అనేక సమస్యలతో సతమతవుతున్నాయి. మెట్రో నగరాల్లోని పరిస్థితులను పోలీసు శాఖ కచ్చితంగా నేర్చుకోవలసిన అంశాలున్నాయి.
  • ప్రజలు సమస్య వచ్చినప్పుడు మొట్టమొదటగా సహాయం కోసం చూసేది పోలీసుల వైపే. అది పోలీసుల్లోని మంచి తనం కావొచ్చు. వ్యవస్థ కావొచ్చు. తీవ్రవాదం లేదా ఇతర సమస్యలను ఎదుర్కొనడానికి గ్రేహౌండ్స్, ఆక్టోపస్, నార్కోటిక్స్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్.. ఇలా రకరకాల వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాం.
  • సిబ్బంది విషయంలోనూ అనేక సమస్యలున్నాయి. తక్కువ జనాభా ఉన్న ప్రాంతానికి ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతానికి ఒకే విధంగా సిబ్బంది కేటాయించడంకన్నా జనాభా ప్రాతిపదికన సిబ్బంది రేషనలైజేషన్‌పై ఆలోచనలు చేయండి.
  • శాఖాపరంగా చర్చించుకుని మానవ వనరులను ఒక పద్ధతి ప్రకారం వినియోగించుకోవాలి. ఒక పర్పస్ కోసం ఒక ఫోర్స్‌ను తయారు చేసిన తర్వాత ఆ పర్పస్ పరిష్కారమైన తర్వాత ఆ ఫోర్స్‌ను ఇతరత్రా వినియోగించడంపై సమీక్ష చేయాలి.
  • సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడమే కాకుండా నేర పరిశోధన, ఇతరత్రా పోలీసు శాఖలో ఉన్న సమాచారానికి సంబంధించిన డేటాను ICCC కంట్రోల్ రూమ్‌తో కనెక్ట్ చేయాలి. ఏ పోలీస్ స్టేషన్‌లో ఏ సమాచారం కావాలన్నా నిమిషాల్లో ఆన్‌లైన్‌లో పొందే విధంగా సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకునేలా ఉండాలి.
  • ఉన్నతస్థాయిలో ఉన్న అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందితో అనుసంధానం ఏర్పాటు చేసుకోగలిగితే కిందిస్థాయిలో ఉండే సమస్యలు అర్థమవుతాయి. పోలీస్ శాఖ మానవీయ దృక్పథం కలిగి ఉండాలి. కింది స్థాయి సిబ్బందికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చినప్పుడే మంచి ఫలితాలు, గుర్తింపు వస్తుంది.
  • 2002 సంవత్సరంలో పోలీస్ రిట్రీట్ కార్యక్రమం తర్వాత ఇప్పుడు మళ్లీ రిట్రీట్ జరుపుకొంటున్నాం. సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు, నేరాలు, నేరాల స్వరూపం చర్చించుకుని అవగాహన కల్పించినప్పుడు తెలంగాణ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడుతుంది.' అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More