మెుదటిసారిగా ఇక్కడ తెలుగులో ఛార్జ్‌షీట్.. పోలీసు శాఖలో సరికొత్త అధ్యాయం

సాధారణంగా ఛార్జ్‌షీట్‌ను ఇంగ్లీష్‌లో దాఖలు చేస్తుంటారు. కానీ ఓ మహిళా కానిస్టేబుల్ తెలుగులో అభియోగపత్రం దాఖలు చేసి కొత్త విధానానికి నాంది పలికారు.

Published on: Jan 7, 2026, 14:40:54 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏదైనా కేసు సంబంధించిన విషయాలు ఇంగ్లీషులో ఉండటంతో చదివేందుకు, అర్థం చేసుకోవడానికి సామాన్యులకు చాలా ఇబ్బంది. న్యాయవ్యవస్థలోని పలు విషయాలు తెలుగులో సామాన్యులకు మరింత అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో సైబరాబాద్ కమిషనరేట్‌లోని దుండిగల్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఒక మహిళా హెడ్ కానిస్టేబుల్ పూర్తిగా తెలుగు భాషలోనే ఛార్జ్ షీట్లు దాఖలు చేయడం ద్వారా ప్రశంసలు అందుకున్నారు.

డీజీపీ శివధర్ రెడ్డి, ఐపీఎస్ శిఖా గోయల్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న హెడ్ కానిస్టేబుల్ స్వరూప
డీజీపీ శివధర్ రెడ్డి, ఐపీఎస్ శిఖా గోయల్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న హెడ్ కానిస్టేబుల్ స్వరూప

సాధారణంగా అధికారిక విధానాలలో ఇంగ్లీష్ ఆధిపత్యం కొనసాగుతుంది. పోలీసుల ఛార్జ్‌షీట్లు, ప్రభుత్వ జీవోల్లో మెుత్తం ఇంగ్లీషే. అయితే దుండిగల్ హెడ్ కానిస్టేబుల్ స్వరూప, 2025లో రెండు కేసులలో దర్యాప్తు పూర్తి చేసి అన్ని తుది నివేదికలను తెలుగులో కోర్టుకు సమర్పించారు. దీని వలన ఫిర్యాదుదారులు, స్థానికులు కేసుకు సంబంధించిన విషయాలపై మెరుగైన అవగాహన ఏర్పడింది.

బౌరంపేటలోని ఒక కిరాణా దుకాణంలో వ్యక్తి మద్యం అమ్ముతుండగా పోలీసులు పట్టుకున్నారు. అతడిపై కేసును ఎక్సైజ్ చట్టం ప్రకారం దర్యాప్తు పూర్తి చేసి.. అభియోగపత్రాన్ని తెలుగులోనే మేడ్చల్ మెుదటి తరగతి మెజిస్ట్రేట్‌కు సమర్పించారు. మరో కేసులో తప్పిపోయిన 35 ఏళ్ల మహిళ, ఆమె కుమార్తెను కనుగొని వారిని సురక్షితంగా వారి కుటుంబంతో తిరిగి కలిపారు. దర్యాప్తు తుది నివేదికను తెలుగులోనే కోర్టులోనే సమర్పించారు.

సీనియర్ అధికారులు హెడ్ కానిస్టేబుల్ చొరవకు మద్దతు ఇచ్చారు. ప్రాంతీయ భాషలను ఉపయోగించడం వల్ల చట్టం గురించి జనాల్లో మరింత అవగాహన వస్తుందని పేర్కొన్నారు. స్వరూప ప్రయత్నాలకు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు లభించాయి. తరువాత హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి పోలీసు కార్యక్రమంలో ఆమె సైబర్ వారియర్స్‌లో ఒకరిగా గుర్తింపు పొందారు.

ఏసీపీ శంకర్ రెడ్డి సహకారంతో మేడ్చల్ కోర్టులో ఈ తెలుగు అభియోగపత్రాలను దాఖలు చేశారు. ​తెలుగు భాషలో దర్యాప్తు పూర్తి తుదినివేదికను దాఖలు చేసినందుకు గాను ఇటీవల బంజారాహిల్స్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో డీజీపీ శివధర్ రెడ్డి, శిఖా గోయల్ ఐపీఎస్ చేతుల మీదుగా హెడ్ కానిస్టేబుల్ స్వరూప ప్రశంసలు అందుకున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More