...
...
Next Story

TGSRTC : పెట్రోల్ కష్టాల నడుమ టీజీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్.. టికెట్ ధరలపై 30 శాతం డిస్కౌంట్

TGSRTC Ticket Price : పెట్రోల్ కొరత భయంతో జనాలు పెట్రోల్ బంకుల వద్దకు భారీగా తరలివస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేదని ప్రభుత్వం చెప్పినా పట్టించుకోలవడం లేదు. మరోవైపు టీజీఎస్ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చింది. రాయితీ కూడా ప్రకటించింది.

Published on: Mar 25, 2026, 14:27:39 IST
Advertisement

హైదరాబాద్‌లో పెట్రోల్ బంకుల్లో జనాలు బారులు తీరారు. పెట్రోల్ అయిపోతుందేమోననే భయంతో తరలివస్తున్నారు. కానీ పెట్రోల్ కొరత లేదని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు టీజీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. హైదరాబాద్ పరిధిలో మెట్రో ఏసీ, డీలక్స్ బస్సుల్లో 30 శాతం రాయితీ ఇస్తున్నట్టుగా టీజీఎస్ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు.

టీజీఎస్ఆర్టీసీ
టీజీఎస్ఆర్టీసీ

ప్రస్తుత యుద్ధ వాతావరణం నేపథ్యంలో తలెత్తిన ఇంధన కొరత దృష్ట్యా, నగర వాహనదారులకు ఊరటనిచ్చేలా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TGSRTC) ఈ కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ బంకుల వద్ద గంటల తరబడి వేచి చూస్తున్న సామాన్యుడి కష్టాలను గమనించి, సుఖవంతమైన ప్రయాణాన్ని తక్కువ ధరకే అందించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు హైదరాబాద్ పరిధిలోని మెట్రో ఏసీ, మెట్రో డీలక్స్ బస్సుల్లో టికెట్ ధరలపై 30 శాతం రాయితీని కల్పిస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ప్రకటించారు.

'పెట్రోల్ ఇబ్బందులు పడటం ఎందుకు దండగ.. ఆర్టీసీ బస్సులు ఉండగా..!' అంటూ ప్రజలకు నాగిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న నాలుగు ప్రధాన ప్రయోజనాలను ఆయన వివరించారు.

పెట్రోల్ కోసం కిలోమీటర్ల మేర క్యూలైన్లలో నిలబడి విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని ఎండీ నాగిరెడ్డి సూచించారు. సొంత వాహనాల కోసం గంటల తరబడి వేచి చూసే బదులు, క్షేమంగా, వేగంగా గమ్యస్థానాలకు చేరడానికి ఆర్టీసీ బస్సులే మేలని పేర్కొన్నారు.

ఇంధన సంక్షోభం నెలకొన్న తరుణంలో ప్రతి చుక్క పెట్రోల్ విలువైనదే. వ్యక్తిగత వాహనాలను పక్కన పెట్టి ప్రజా రవాణాను ఆశ్రయించడం ద్వారా ఇంధనాన్ని ఆదా చేయవచ్చని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా తోడ్పడుతుందని ఆయన తెలిపారు.

సాధారణంగా ఏసీ బస్సులు ఖరీదు అనుకునే వారికి 30 శాతం రాయితీ ఒక గొప్ప అవకాశం. పెట్రోల్ ధరల సెగ నుంచి తప్పించుకుని, అతి తక్కువ ధరకే లగ్జరీ ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. ఇది సామాన్యుడి జేబుకు, ప్రయాణానికి ఎంతో హాయినిస్తుంది.

బంకుల వద్ద బారులు తీరొద్దని, సేఫ్‌గా బస్సెక్కండి... సుఖవంతమైన ప్రయాణం చెయ్యండి అని నాగిరెడ్డి హైదరాబాద్‌వాసులకు విజ్ఞప్తి చేశారు. నగర ప్రజలు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ట్రాఫిక్, పెట్రోల్ ఇబ్బందుల నుండి బయటపడాలని టీజీఎస్ఆర్టీసీ ఆకాంక్షిస్తోందని చెప్పారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe