ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్.. ఏ2గా ప్రణయ్

ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో దర్యాప్తు వేగవంతమైంది. సూసైడ్ నోట్, కీలక వీడియోలున్న ఐఫోన్‌ను దాచి సాక్ష్యాలను ట్యాంపర్ చేసినట్టుగా ఉదయ్ సోదరుడు ప్రణయ్ కృష్ణారెడ్డిని పోలీసులు ఏ2గా చేర్చారు.

Published on: Nov 24, 2026, 13:32:24 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తోటి మహిళా ఐపీఎస్ అధికారిణిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలతో ఇప్పటికే అరెస్టయిన ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారంలో ఇప్పుడు ఆయన సోదరుడు ప్రణయ్ కృష్ణారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. కేసులో కీలక ఆధారాలను మాయం చేసేందుకు ప్రయత్నించారన్న అభియోగంతో పోలీసులు ప్రణయ్‌ను ఈ కేసులో రెండో నిందితుడిగా(A2) చేర్చారు.

ఉదయ్ కృష్ణారెడ్డి
ఉదయ్ కృష్ణారెడ్డి

మహిళా ఐపీఎస్ అధికారిణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, ఇప్పటికే ప్రధాన నిందితుడిగా (A1) ఉదయ్ కృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో లోతైన విచారణ జరుపుతున్న దర్యాప్తు బృందానికి విస్తుపోయే నిజాలు తెలిశాయి.

పోలీసుల విచారణను పక్కదారి పట్టించేందుకు, కేసు తీవ్రతను తగ్గించేందుకు ఉదయ్ సోదరుడు ప్రణయ్ కృష్ణారెడ్డి సాక్ష్యాలను ట్యాంపర్ చేసినట్లు అధికారులు ఆధారాలు సేకరించారు. ఈ నేపథ్యంలో భారతీయ న్యాయ సంహిత (BNS) లోని సాక్ష్యాల తారుమారు సెక్షన్ల కింద ప్రణయ్ కృష్ణారెడ్డిని ఏ2 నిందితుడిగా ఎఫ్ఐఆర్‌లో చేర్చారు.

దర్యాప్తు అధికారుల సమాచారం ప్రకారం.. ఈ కేసులో అత్యంత కీలకమైన రెండు ఆధారాలను ప్రణయ్ ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టినట్లు తేలింది. గతంలో ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేసిన సమయంలో రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులకు చిక్కకుండా ప్రణయ్ కృష్ణారెడ్డి మాయం చేసినట్లు విచారణలో వెల్లడైంది. కేసు దర్యాప్తులో ఆ లేఖలో ఉన్న అంశాలు అత్యంత కీలకమని పోలీసులు భావిస్తున్నారు.

ఇక బాధితురాలిని బెదిరించడానికి ఉపయోగించిన వీడియోలు, ఇతర డిజిటల్ ఆధారాలు ఉన్న మరో ఐఫోన్‌ను కూడా ప్రణయ్ రహస్యంగా దాచినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఫోన్ స్వాధీనం చేసుకుంటే కేసులో మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉంది.

తనను పోలీసులు ఏ2గా చేర్చారని, ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని గ్రహించిన ప్రణయ్ కృష్ణారెడ్డి ముందుగానే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తనకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా, విచారణ జరిపిన కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ప్రస్తుతానికి ప్రణయ్ అరెస్ట్ నుంచి తప్పించుకున్నప్పటికీ, దర్యాప్తుకు పూర్తిస్థాయిలో సహకరించాలని, దాచిపెట్టిన ఆధారాలను పోలీసులకు అప్పగించాలి.

ఒక సాధారణ కానిస్టేబుల్ స్థాయి నుంచి కష్టపడి చదివి సివిల్స్ సాధించి ఐపీఎస్‌కు ఎంపికైన ఉదయ్ కృష్ణారెడ్డి ఆదర్శవంతంగా ఉన్నారు. అయితే శిక్షణ సమయంలో పరిచయమైన ఓ మహిళా ఐపీఎస్ అధికారిణిని ప్రేమ పేరుతో వంచించడమే కాకుండా, ఆమెపై లైంగిక దాడికి పాల్పడి, వ్యక్తిగత వీడియోలతో బెదిరింపులకు గురిచేశారన్న ఆరోపణలు ఒక్కసారిగా కలకలం రేపాయి. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఉదయ్‌ను అరెస్ట్ చేయగా, ఇప్పుడు సాక్ష్యాలను తారుమారు చేసిన ఆయన సోదరుడిపైనా ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో దాచిన ఐఫోన్, సూసైడ్ నోట్ రికవరీ కోసం పోలీసులు తదుపరి చర్యలు చేపట్టారు.

ABOUT THE AUTHOR

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.