...
...
Next Story

ఉప ఎన్నికలు, స్థానిక పోరు: నిజమైన ప్రజాభిప్రాయమా? ప్రభుత్వ పనితీరుకు రెఫరెండమా?

ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు అనగానే కొంతమంది ప్రభుత్వ పనితీరుకు రెఫరెండం అంటూ విశ్లేషణలు చేస్తారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంటుందో 'పీపుల్స్‌ పల్స్ రీసెర్చ్ సంస్థ' ఆసక్తికర విషయాలను వెల్లడించింది. సంస్థ డైరెక్టర్, రాజకీయ విశ్లేషకులు దిలీప్ రెడ్డి విశ్లేషణ వారి మాటల్లోనే చదవండి.

Published on: Sep 21, 2026, 14:12:32 IST
Advertisement

తెలంగాణ రాజకీయ చర్చోపచర్చలు ఇప్పుడు హైదరాబాద్‌లోని కీలకమైన ఖైరతాబాద్ నియోజకవర్గం చుట్టూనే తిరుగుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేయడంతో, న్యాయ ప్రక్రియకు లోబడి అక్కడ ఉపఎన్నిక అవకాశాలున్నాయి. మరోవైపు పొరుగునున్న ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. ఈ పరిణామాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ వర్గాలు, మీడియా విశ్లేషకులు ఈ ఎన్నికలను రాబోయే సాధారణ ఎన్నికలకు, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుకు పక్కా “రెఫరెండం”గా అభివర్ణించే వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఒక ఉపఎన్నిక నిజంగానే రెఫరెండమా?

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

స్థానిక సంస్థల ఫలితం రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ప్రజలిచ్చే నిజమైన తీర్పా? అనే ప్రశ్నలకు సంతుష్టికర సమాధానం కనుగొనే క్రమంలో 2014 రాష్ట్ర విభజనకు ముందు, తర్వాతి నుంచి గడచిన 12 ఏళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ తర్వాతి అసెంబ్లీ సాధారణ ఎన్నికల ఫలితాలను పీపుల్స్ పల్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లోతుగా అధ్యయనం చేసింది. ఈ పుష్కర కాలపు ఎన్నికల చరిత్రను, గణాంకాలను నిశితంగా పరిశీలించి, ఒకదానిపై మరోటి చూపే ప్రభావ అంచనాలతో గమనించినపుడు ఉప ఎన్నికల, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు రాష్ట్ర వ్యాప్త ప్రజాభిప్రాయానికి ఏ మాత్రం కొలమానం కావని తేటతెల్లమవుతోంది.

గతంలో ఫలితాలు

2014లో తెలంగాణ ఆవిర్భావం నుండి నేటి వరకు రాష్ట్రంలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరగ్గా, అందులో రెండు చోట్ల మినహాయించి దాదాపు అన్ని చోట్లా నాటి అధికార పార్టీయే విజయం సాధించింది. 2014 నుండి 2023 వరకు బీఆర్‌ఎస్ హయాంలో నారాయణఖేడ్, పాలేరు, హుజూర్ నగర్, హుజూరాబాద్, దుబ్బాక, మునుగోడు, నాగార్జున సాగర్ మొత్తం 7 స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. వీటిలో సిట్టింగ్ ఎమ్మెల్యేల మరణంతో నారాయణఖేడ్, పాలేరు, నాగార్జున సాగర్, దుబ్బాకలలో ఎన్నికలు వచ్చాయి. హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ ఎంపీగా గెలవడంతో రాజీనామా చేశారు.

2023లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు వచ్చాయి. గతంలో బీఆర్‌ఎస్ ప్రాతినిధ్యం వహించిన ఈ రెండు స్థానాల్లోనూ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీనే విజయం సాధించింది. ముఖ్యంగా 2025 నవంబర్ లో జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నాయకుడు హరీష్ రావుతో పాటు మొత్తం బీఆర్‌ఎస్ యంత్రాంగం మోహరించినా, తమ సిట్టింగ్ సీటును నిలబెట్టుకోలేకపోయింది.

ఏపీలో కథ మరోలా

ఆంధ్రప్రదేశ్‌లో 2014 నుండి చూస్తే... నందిగామ, తిరుపతి, అల్లగడ్డ, నంద్యాల, బద్వేలు, ఆత్మకూరు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. బద్వేలు అసెంబ్లీ, తిరుపతి పార్లమెంట్ స్థానాలు మినహాయిస్తే... ఉపఎన్నికల్లో గెలిచిన ఏ ఒక్క పార్టీ కూడా ఆ తర్వాతి(2019, 2024) సాధారణ ఎన్నికల్లో విజయం సాధించలేకపోయింది. 2014-2024 మధ్య జరిగిన ఉపఎన్నికల్లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ పోటీకి దూరంగా ఉన్న సందర్భాలే ఎక్కువ. అయితే నంద్యాల అసెంబ్లీకి వైసీపీ, తిరుపతి పార్లమెంట్‌కు టీడీపీ పోటీ చేశాయి.

2017 నంద్యాల ఉపఎన్నికలో వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి దాదాపు 10 రోజులకు పైగా నియోజకవర్గంలోనే మకాం వేసి, ఇంటింటి ప్రచారం నిర్వహించినా... భారీ మెజారిటీతో అధికార టీడీపీ అభ్యర్థే గెలిచారు. కానీ, సరిగ్గా 2019 అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి అదే నంద్యాల స్థానంలో వైసీపీ విజయం సాధించడమే కాకుండా, రాష్ట్రంలో ఏకంగా 151 సీట్లతో అధికారంలోకి వచ్చింది. ఇదే రీతిలో 2019 నుండి 2024 వరకు జరిగిన అన్ని ఉపఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించి క్లీన్ స్వీప్ చేసింది. కానీ 2024 సాధారణ ఎన్నికల్లో అదే వైసీపీ దారుణంగా (11 స్థానాలకు పడి) ఓడిపోయి, కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది.

ఉపఎన్నికల్లో గెలుపు, తదనంతర సాధారణ ఎన్నికలకు గ్యారెంటీ కాదనడానికి రెండు రాష్ట్రాల్లోనూ అనేక రుజువులున్నాయి. 2016 పాలేరు ఉపఎన్నికలో బీఆర్‌ఎస్ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు భారీ మెజారిటీతో గెలిచారు. కానీ 2018 సాధారణ ఎన్నికల్లో అదే పాలేరు నుండి బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి ఆయన ఓడిపోయారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు, నాగార్జున సాగర్‌లలో కాంగ్రెస్ గెలవగా... గత ఉపఎన్నికల్లో బీజేపీ గెలిచిన హుజూరాబాద్, దుబ్బాకలలో బీఆర్‌ఎస్ విజయం సాధించింది. ఇక ఉమ్మడి రాష్ట్రంలో 2009-2014 మధ్య జరిగిన ఏ ఉపఎన్నికలోనూ తెలుగుదేశం పార్టీ గెలవలేదు సరికదా, కొన్నిచోట్ల డిపాజిట్లు కూడా కోల్పోయింది. కానీ రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో, ఉపఎన్నికల్లో డిపాజిట్లు పోయిన చోట కూడా టీడీపీ గెలిచి నవ్యాంధ్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ఇదేం వేరు కాదు

తిరిగి ఖైరతాబాద్ విషయానికి వస్తే, ఈ నియోజకవర్గ ఓటింగ్ చరిత్రే భిన్నమైన కథ చెప్తోంది. 2009 డిలిమిటేషన్ తర్వాత ఇక్కడ జరిగిన 4 ఎన్నికల్లో మూడుసార్లు దానం నాగేందర్ (2009 కాంగ్రెస్, 2018, 2023 బీఆర్‌ఎస్) గెలవగా, 2014లో టీడీపీ పొత్తుతో బీజేపీ తరఫున చింతల రామచంద్రారెడ్డి గెలిచారు. ఇక్కడి ఓటు శాతం వ్యత్యాసాలను చూసినప్పుడు కాంగ్రెస్‌కు 2009లో అత్యధికంగా 39.1 శాతం రాగా, 2014లో అత్యల్పంగా 22.4 శాతానికి పడిపోయింది. బీఆర్‌ఎస్ ఇప్పటివరకు 3 సార్లు పోటీ చేయగా, 2018లో అత్యధికంగా 44.6 శాతం, 2014లో అత్యల్పంగా 13.7 శాతం ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి 4 సార్లు పోటీ చేయగా, టీడీపీ పొత్తు ఉన్న 2014లో అత్యధికంగా 36.9 శాతం, 2009లో అత్యల్పంగా 12.4 శాతం ఓట్లు సాధించారు.

దాదాపు 30 శాతం ముస్లిం ఓటర్లు ఉన్న ఖైరతాబాద్‌లో ఎంఐఎం నేరుగా ఎప్పుడూ పోటీ చేయలేదు. బీహార్, యూపీ, మహారాష్ట్ర, కర్ణాటకలలో పోటీ చేసే ఎంఐఎం, ఇక్కడ మాత్రం కాంగ్రెస్‌ కో లేదా బీఆర్‌ఎస్‌ కో మద్దతు ఇస్తూ వచ్చింది. కేవలం 2014 పార్లమెంట్ ఎన్నికల సమయంలో సికింద్రాబాద్ ఎంపీ పరిధిలోని ఖైరతాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో 8.5 శాతం ఓట్లు సాధించింది.

చరిత్ర ఏం చెబుతోంది?

ఉపఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిసారీ ఓటర్లు అధికార పార్టీల వైపే మొగ్గు చూపడానికి కొన్ని నిర్దిష్టమైన కారణాలు పనిచేస్తాయి. అధికార పార్టీ అభ్యర్థినే గెలిపిస్తే మిగిలిన కాలంలో తమ ప్రాంతానికి నిధులు వచ్చి, ఎంతో కొంత అభివృద్ధి జరుగుతుందనే ఆశతో ప్రజలు ఓటేస్తారు. దీనికి తోడు ఉపఎన్నికలు లేదా స్థానిక పోరులో అధికార పార్టీలు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేయడం, బెదిరింపులకు పాల్పడటం, వ్యవస్థలన్నింటినీ దుర్వినియోగం చేయడం పరిపాటైంది. ప్రజలు కూడా ఉపఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఓటేసినా, ప్రభుత్వాలపైన అసలు తీర్పును మాత్రం సాధారణ ఎన్నికల్లోనే చూపించాలన్న ధోరణితో వ్యవహరిస్తుంటారు. పుష్కరకాలపు చరిత్ర ఇదే చెబుతోంది.

2023 తెలంగాణ ఎన్నికలకు ముందు గ్రామ స్థాయి వార్డు మెంబర్ నుండి ఎమ్మెల్యే వరకు దాదాపు అంతటా బీఆర్‌ఎస్ నేతలే ఉన్నారు. 2019 నుంచి 2024 మధ్య ఏపీలోనూ వైసీపీదీ అదే తరహా క్షేత్రస్థాయి ఆధిపత్యం. కానీ సాధారణ ఎన్నికలు వచ్చేసరికి రెండు పార్టీలూ ఘోర ఓటమిని చవిచూశాయి. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరిగితేనే అవి ప్రజాభిప్రాయానికి కొలమానం అవుతాయి. కానీ అధికార మదంతో, ఆధిపత్యంతో వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ సాధించే ఉపఎన్నికల విజయాలను, స్థానిక ఎన్నికల ఫలితాలను “శాశ్వత ప్రజాభిప్రాయం” అని భ్రమపడి వ్యవహరించే పార్టీలు తమ గోతిని తామే తవ్వుకుంటున్నాయి. త్వరలో జరగనున్న ఖైరతాబాద్ ఉపఎన్నికైనా, ఆంధ్రప్రదేశ్‌ లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలైనా ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రవ్యాప్త ప్రభుత్వ పనితీరుకు ‘రెఫరెండమ్‌’ కానేకావు. ఉపఎన్నికల్లో గెలిచినంత మాత్రాన సాధారణ ఎన్నికల్లో గెలుస్తామనే భ్రమల నుంచి అధికార పార్టీలు బయటపడి, ప్రజల అంతరంగాన్ని అర్థం చేసుకుంటేనే ఆయా పార్టీల ఎన్నికల ఫలితాలకు, రాజకీయ భవితకు మంచిది!

వ్యాసకర్త:

దిలీప్ రెడ్డి,

రాజకీయ విశ్లేషకులు,

డైరెక్టర్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ

దిలీప్ రెడ్డి, రాజకీయ విశ్లేషకులు, డైరెక్టర్ పీపుల్స్‌ పల్స్ రీసెర్చ్ సంస్థ
 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks