SIR in Telangana : ముగిసిన 'సర్' డెడ్‌లైన్ - 73 లక్షల ఓట్ల తొలగింపు...! తుది జాబితాపై ఉత్కంఠ!

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) గడువు ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 78.26 శాతం ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ పూర్తయినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. యాదాద్రి జిల్లా అగ్రస్థానంలో నిలిచింది.

Published on: Aug 11, 2026, 08:04:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియ ముగింపు దశకు చేరుకోవడంతో రాష్ట్రంలో భారీ స్థాయిలో ఓట్ల కోత తప్పడం లేదు. బూత్ స్థాయి అధికారులుసేకరించిన ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ సోమవారం సాయంత్రం 6 గంటలతో ముగిసింది. అందిన తుది సమాచారం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 74 లక్షలకు పైగా ఓట్లు తొలగించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో ముగిసిన సర్
తెలంగాణలో ముగిసిన సర్

రాష్ట్రంలో తొలగిపోనున్న ఓట్లలో అధిక భాగం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదయ్యాయి. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలో మొత్తం 1.14 కోట్ల ఓటర్లు ఉండగా…. కేవలం 71.05 లక్షల మంది మాత్రమే బీఎల్‌వోలకు ఎన్యూమరేషన్ పత్రాలను అందజేశారు. మిగిలిన 43.09 లక్షల మంది ఓటర్లు తమ పత్రాలను సమర్పించలేదు. దీంతో ఈ 43 లక్షలకు పైగా ఓట్లను జాబితా నుంచి పూర్తిగా తొలగించేందుకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు.

డిజిటలైజేషన్ లెక్కలు ఇలా…

తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్లు ఉండగా, సోమవారం సాయంత్రానికి 2.64 కోట్ల మంది (78.26 శాతం) ఓటర్ల పత్రాల డిజిటలైజేషన్ ప్రక్రియ మాత్రమే పూర్తయింది. మిగిలిన 74 లక్షల మంది ఓటర్లు తమ నింపిన పత్రాలను బీఎల్‌వోలకు అందించలేదు.

ఈ తొలగించనున్న 74 లక్షల ఓట్లలో దాదాపు 73.40 లక్షల (21.70 శాతం) ఓట్లను సేకరించడానికి వీలులేని (అన్‌కలెక్టబుల్) జాబితాలో చేర్చారు. స్థానిక చిరునామాలో లేకపోవడం, శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వలస వెళ్లడం, మరణించడం, మరియు ఒకరికంటే ఎక్కువ చోట్ల ఓటు కలిగి ఉండడం (ASDD - ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్, డూప్లికేట్) కారణాల వల్ల వీటిని తొలగిస్తున్నారు. ఇక వివరాల్లో తేడాలు ఉండి, సరైన ధ్రువపత్రాలు సమర్పించని వారి ఓట్లను కూడా అదనంగా తొలగించనున్నారు.

మరోవైపు రాష్ట్ర పరిధిలోనే రెండు, మూడు చోట్ల ఓట్లు కలిగి ఉన్న ఓటర్లను గుర్తించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించింది. ఈ అధునాతన సాంకేతికత ద్వారా సుమారు 3.18 లక్షల మందికి ఒకటికంటే ఎక్కువ ఓటర్ ఐడీ కార్డులు ఉన్నట్లు అధికారులు పక్కాగా గుర్తించారు. ఈ డూప్లికేట్ ఓట్లను కూడా జాబితా నుంచి పూర్తిగా తొలగిస్తున్నారు.

డిజిటలైజేషన్‌లో యాదాద్రి టాప్…

ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్‌లో యాదాద్రి భువనగిరి జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో ఏకంగా 94.31 శాతం డిజిటైజేషన్ పూర్తయింది. ఇక రాజధాని హైదరాబాద్ జిల్లా 58.89 శాతంతో చివరి స్థానంలో నిలిచింది.

  • యాదాద్రి భువనగిరి: 94.31% (మొదటి స్థానం)
  • జనగామ: 91.98%
  • మెదక్: 90.53%
  • సూర్యాపేట: 90.45%
  • మహబూబాబాద్: 90.11%
  • కుమురం భీమ్ ఆసిఫాబాద్: 89.43%
  • జగిత్యాల: 89.61%
  • నల్గొండ: 89.52%
  • పెద్దపల్లి: 88.59%
  • సిద్దిపేట: 88.02%
  • ఖమ్మం: 87.30%
  • హనుమకొండ: 79.99%
  • సంగారెడ్డి: 79.51%
  • రంగారెడ్డి: 65.16%
  • మేడ్చల్-మల్కాజిగిరి: 63.97%
  • హైదరాబాద్: 58.89% (చివరి స్థానం)

తదుపరి షెడ్యూల్ వివరాలు…

ఎన్నికల సంఘం సవరించిన షెడ్యూల్ ప్రకారం తదుపరి చర్యలు ఈ క్రింది విధంగా ఉంటాయి. ఈనెల 17వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు.

  • ఆగస్టు 17న ఓటర్ల ముసాయిదా జాబితా (Draft Electoral Rolls) ప్రచురణ
  • ఆగస్టు 17 నుంచి సెప్టెంబరు 16 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్‌ల స్వీకరణ
  • ఆగస్టు 17 నుంచి అక్టోబరు 15 వరకు నోటీసుల జారీ, అభ్యంతరాల పరిష్కారం
  • అక్టోబరు 19న ఓటర్ల తుది జాబితా (Final Electoral Rolls) ప్రచురణ

ఓటర్ల జాబితాను పారదర్శకంగా, తప్పుల్లేకుండా రూపొందించడమే లక్ష్యంగా ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అయితే ముసాయిదా ఓటర్ జాబితా విడుదలైన తర్వాత…. సర్ ప్రక్రియలో భాగంగా ఎన్ని ఓటు తొలగిపోయాయి అనే విషయంపై అధికారికంగా మరింత స్పష్టత రానుంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More