Telangana SIR : రాష్ట్రంలో సర్ గడువు మరోసారి పొడిగింపు.. ఆగస్టు 10 చివరి తేదీ!
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ గడువును మరోసారి పొడిగించారు. ఇప్పటివరకు ప్రక్రియను పూర్తి చేయనివారికి ఇది మంచి అవకాశం. వెంటనే సర్ పూర్తి చేసుకోండి.
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియకు సంబంధించి ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేర్లను నమోదు చేసుకునేందుకు వీలుగా, ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించే తుది గడువును మరోమారు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. తొలుత ఈ గడువును జూలై 24 నుంచి ఆగస్టు 3 వరకు పెంచగా, తాజాగా ప్రజల నుంచి వస్తున్న స్పందనను దృష్టిలో ఉంచుకుని దానిని ఆగస్టు 10 వరకు పొడిగించారు.

కేంద్ర ఎన్నికల సంఘం తాజా ఆదేశాల ప్రకారం.. బూత్ స్థాయి అధికారులు (BLOలు) నిర్వహించే ఇంటింటి సర్వే, ఎన్యూమరేషన్ ప్రక్రియ ఆగస్టు 10 వరకు కొనసాగుతుంది. ఈ పొడిగింపు కారణంగా, ఓటర్ల ముసాయిదా జాబితా ప్రచురణ తేదీతో పాటు తదుపరి షెడ్యూల్‌లోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. సవరించిన నిబంధనల ప్రకారం ముసాయిదా ఓటర్ల జాబితా ఇకపై ఆగస్టు 10న విడుదల కానుంది. అలాగే, జాబితాపై అభ్యంతరాలు, క్లెయిమ్‌ల స్వీకరణ ప్రక్రియ ఆ తేదీ నుంచి సెప్టెంబర్ 9 వరకు ఉంటుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
రాష్ట్రంలో జరుగుతున్న ఈ సమగ్ర సవరణ ప్రక్రియ చాలా వరకు విజయవంతంగా ముందుకు సాగుతోంది. ఎన్నికల సంఘం అధికారిక గణాంకాల ప్రకారం, ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 77.12 శాతం ఎన్యూమరేషన్ పనులు పూర్తయ్యాయి. అయితే ప్రధాన నగరాలు, చుట్టుపక్కల ఉన్న జిల్లాలలో మాత్రం ఈ సర్వే వేగం కొంత నెమ్మదిగా సాగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రధాన పట్టణ ప్రాంతాలైన.. హైదరాబాద్ జిల్లాలో 56.31 శాతం మాత్రమే ఎన్యూమరేషన్ పూర్తయింది. రంగారెడ్డి జిల్లాలో 63.43 శాతం మేర సర్వే కవర్ అయింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 61.37 శాతం ప్రక్రియ ముగిసింది.
ఈ మూడు ప్రధాన జిల్లాల్లో ఇంకా గణనీయమైన సంఖ్యలో ఫారాలు అందాల్సి ఉండటమే గడువు పొడిగింపునకు ప్రధాన కారణమని తెలుస్తోంది.
ఎన్నికల సంఘం కల్పించిన ఈ అదనపు సమయాన్ని అర్హులైన ప్రతి ఒక్క పౌరుడు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కోరారు. ఇంకా ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తి చేసి అందించని వారు వెంటనే స్థానిక BLOలను సంప్రదించి తమ వివరాలను సరిచూసుకోవాలని సూచించారు. సరైన సమచారంతో పారదర్శకమైన, తప్పులేని ఓటర్ల జాబితాను రూపొందించడమే ఈ ప్రత్యేక సమగ్ర సవరణ ప్రధాన ఉద్దేశమని యంత్రాంగం పేర్కొంది. తుది గడువు ముగిసేలోపు మిగిలిన ప్రక్రియను కూడా వంద శాతం పూర్తి చేసేలా జిల్లా అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


