Bandi Bhageerath Case : పరారీలో బండి భగీరథ్.. మూడు రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్

Bandi Bhageerath Case : బండి సాయి భగీరథ్ ‌పోక్సో కేసుపై సిట్ ఏర్పాటు అయిన విషయం తెలిసిందే. అయితే భగీరథ్ పరారీలో ఉన్నాడని సిట్ అధికారులు వెల్లడించారు.

Published on: May 12, 2026, 05:34:52 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బండి భగీరథ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలతో పోక్సో(POCSO) కేసు నమోదైన నేపథ్యంలో ఆయన గత మూడు రోజులుగా పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉండటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

పరారీలో బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్
పరారీలో బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్

మూడు రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్!

పెట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైనప్పటి నుండి భగీరథ్ ఆచూకీ లభించడం లేదు. సిట్ అధికారి రితిరాజ్ ప్రకారం, గత మూడు రోజులుగా బండి భగీరథ్ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. పోలీసుల కళ్లు గప్పి ఆయన ఎక్కడో రహస్య ప్రాంతంలో తలదాచుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఆయన కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఫోన్ స్వీచ్ ఆఫ్ రావడంపై మరింతగా సిట్ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేసామని, మరిన్ని వివరాల కోసం ఇంకోసారి స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి వస్తుందని పోలీసులు తెలిపారు.

అసలేం జరిగింది?

ఒక 17 ఏళ్ల మైనర్ బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. గతేడాది డిసెంబర్ 31న మొయినాబాద్‌లోని ఒక ఫామ్‌హౌస్‌లో జరిగిన పార్టీలో తనపై బండి భగీరథ్ లైంగిక దాడికి పాల్పడ్డారని ఆ బాలిక ఆరోపించింది. ఆ ఘటన తర్వాత కూడా తనను మానసికంగా వేధించాడని, ఆ తట్టుకోలేక తాను రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేశానని తన ఫిర్యాదులో పేర్కొంది.

అయితే ఈ కేసు నమోదు కావడానికి కొన్ని గంటల ముందే భగీరథ్ కూడా కరీంనగర్‌లో ఒక ఫిర్యాదు చేశాడు. ఆ బాలిక కుటుంబం తనను హనీట్రాప్ చేసి బ్లాక్‌మెయిల్ చేస్తోందని, రూ. 50 వేలు వసూలు చేశారని ఆయన ఆరోపించాడు. రూ. 5 కోట్లు డిమాండ్ చేశారని భగీరథ్ ఫిర్యాదులో పేర్కొన్నాడు.

సీఎం రేవంత్ రెడ్డి సీరియస్.. సిట్ ఏర్పాటు

ఈ కేసు రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ వ్యవహారంపై స్పందిస్తూ, నిందితుడు ఎంతటి వారైనా వదిలేది లేదని స్పష్టం చేశారు. డీజీపీ సీవీ ఆనంద్‌తో మాట్లాడిన సీఎం, కేసు విచారణలో జాప్యంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ కేసును సమగ్రంగా విచారించేందుకు రాష్ట్రప్రభుత్వం కూకట్‌పల్లి డీసీపీ (కూకట్‌పల్లి జోన్-సైబరాబాద్) రితిరాజ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది.

రాజకీయ ప్రకంపనలు

బీఆర్ఎస్ నేతలు ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్ర మంత్రి కుమారుడు కావడంతో పోలీసులు మెతక వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు, తెలంగాణ బీజేపీ స్పందిస్తూ.. ఇది ఒక చట్టపరమైన అంశమని, దీనికి పార్టీకి ఎటువంటి సంబంధం లేదని పేర్కొంది.

ప్రస్తుతం పోలీసులు భగీరథ్ కాల్ డేటా రికార్డులను (CDR) విశ్లేషిస్తున్నారు. ఈ 'హై ప్రొఫైల్' కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయోనని రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More