Bandi Bhagirath POCSO Case : బండి భగీరథ్ కేసుపై తక్షణమే దర్యాప్తు చేపట్టండి - డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

Bandi Bhagirath POCSO Case : బండి భగీరథ్‌పై నమోదైన కేసులో విచారణను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీ సీవీ ఆనంద్‌ను ఆదేశించారు. ఫిర్యాదు అందినప్పటికీ చర్యలు తీసుకోవడంలో జాప్యం ఎందుకు జరిగిందని ప్రశ్నించారు.

Published on: May 11, 2026, 13:19:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Bandi Bhagirath POCSO Case : కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసుపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో బండి భగీరథ్‌పై నమోదైన కేసుపై తక్షణమే దర్యాప్తు ప్రారంభించాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను ఆదేశించారు. ఈ నెల 8వ తేదీనే ఫిర్యాదు అందినప్పటికీ…. నిందితుడిపై చర్యలు తీసుకోవడంలో జాప్యం జరగడంపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

డీజీపీ సీవీ ఆనంద్ ఈ కేసులోని పూర్వాపరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీసు బలగాలన్నీ భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నాయని…. ఆ కారణం చేతనే కేసు దర్యాప్తులో కొంత జాప్యం జరిగిందని డీజీపీ ముఖ్యమంత్రికి వివరణ ఇచ్చారు.

అయితే ఈ వివరణపై స్పందించిన ముఖ్యమంత్రి…. కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని సమగ్ర విచారణ కోసం ప్రత్యేక బృందాలను (Special Teams) ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చట్టం ముందు అందరూ సమానమేనని… ఎటువంటి పక్షపాతం లేకుండా విచారణ జరిపి నివేదిక సమర్పించాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో… బండి భగీరథ్ కేసు విచారణ వేగవంతం కానుంది. ప్రత్యేక బృందాలు ఈ కేసులోని సాక్ష్యాధారాలను సేకరించి, నిందితులపై తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

ఆరోపణలు ఏంటి..?

ఈ కేసులో ఫిర్యాదు చేసిన 17 ఏళ్ల మైనర్ బాలిక కథనం ప్రకారం.. గతేడాది డిసెంబర్ 31వ తేదీన మొయినాబాద్‌లోని ఒక ఫామ్‌హౌస్‌లో భగీరథ్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు 10వ తరగతి మధ్యలోనే ఆపేసిన విద్యార్థినిగా గుర్తించారు. ఆమె కుటుంబ సభ్యులు పెట్‌బషీరాబాద్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో.. బాలిక వయస్సును ధృువీకరించుకున్న పోలీసులు… పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు.

మరోవైపు ఈ కేసులో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. ఈ పోక్సో కేసు నమోదు కావడానికి ఒక రోజు ముందే బండి భగీరథ్ కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సదరు బాలిక కుటుంబంపై ఫిర్యాదు చేశారు. తనను స్నేహం పేరుతో ట్రాప్ చేసి…. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నాడు. తాను నిరాకరించడంతో రూ. 5 కోట్లు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని తన ఫిర్యాదులో ప్రస్తావించాడు.

ప్రస్తుతానికి పోలీసులు రెండు ఫిర్యాదులను వేర్వేరుగా దర్యాప్తు చేస్తున్నారు. పెట్‌బషీరాబాద్ పోలీసులు లైంగిక దాడి ఆరోపణలపై విచారణ జరుపుతున్నారు. ఇదే సమయంలో కరీంనగర్ టూ టౌన్ పోలీసులు కూడా రంగంలోకి దిగారు.

ఇదిలా ఉంటే కేంద్రమంత్రి సంజయ్ కుమారుడు భగీరథ్ ను కాపాడేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ కేసులోని నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తోంది. కేసు నమోదైనప్పటికీ… ఇప్పటి వరకు నిందితుడిని ఎందుకు అదుపులోకి తీసుకోలేదని ప్రశ్నిస్తోంది. బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని… అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని కూడా ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More