Bandi Sanjay : కుమారుడిపై పోక్సో కేసు.. బండి సంజయ్ రియాక్షన్ ఇదే

బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. దీనిపై బండి సంజయ్ స్పందించారు. ఒక ప్రకటన విడుదల చేశారు.

Published on: May 10, 2026, 05:36:08 IST
By , Karimnagar
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తన కుమారుడు బండి సాయి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైన ఘటన మీద బండి సంజయ్ స్పందించారు. తనకు చట్టంపై గౌరవం, న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. జీవితాంతం భారత రాజ్యాంగానికి కట్టుబడే ఉన్నానని, దశాబ్దాలుగా ప్రజలతోనే ఉన్న నేను మచ్చ లేని జీవితం గడిపానని గర్వంగా చెప్పగలను అన్నారు.

కుమారుడితో బండి సంజయ్
కుమారుడితో బండి సంజయ్

తనను రాజకీయంగా ఎదుర్కోలేక కొందరు తన పిల్లలను, కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఇది వారిలో గూడుకట్టుకున్న నిరాశ నిస్పృహలకు అద్దం పడుతుందన్నారు.

'అట్టడుగు స్థాయి నుంచే నా ప్రజా జీవితాన్ని మొదలుపెట్టాను. కష్టపడి పనిచేసి ప్రజల ఆశీర్వాదంతో నాడు కార్పొరేటర్ గా, నేడు ఎంపీగా ఎన్నికై, కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వెనకబడి వర్గాలకు చెందిన బీసీ వ్యక్తి, నాయకుడిగా కేంద్రమంత్రి స్థాయికి ఎదగడాన్ని కొన్ని శక్తులు జీర్ణించుకోలేక కుట్రలకు తెరతీశాయి.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో నన్ను వ్యక్తిగతంగా అప్రతిష్టపాలు చేయాలన్నదే ఆ కుట్రల వెనకున్న అసలు లక్ష్యం. తప్పేదో.. ఒప్పేదో.. న్యాయవ్యవస్థ నిర్ణయిస్తుందన్న నమ్మకం నాకుంది. సమయం ప్రతి ఆరోపణకు సమాధానం ఇస్తుంది, ప్రతి కుట్రను బహిర్గతం చేస్తుంది.' అని బండి సంజయ్ అన్నారు.

ఏం జరిగిందంటే

గతేడాది డిసెంబర్ 31వ తేదీన మొయినాబాద్‌లోని ఒక ఫామ్‌హౌస్‌లో భగీరథ్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు 10వ తరగతి మధ్యలోనే ఆపేసిన విద్యార్థినిగా గుర్తించారు. ఆమె కుటుంబ సభ్యులు పెట్‌బషీరాబాద్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో, బాలిక వయస్సును ధృువీకరించుకున్న పోలీసులు.. పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు.

మరోవైపు ఈ కేసులో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. ఈ పోక్సో కేసు నమోదు కావడానికి ఒక రోజు ముందే బండి భగీరథ్ కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సదరు బాలిక కుటుంబంపై ఫిర్యాదు చేశారు. తనను స్నేహం పేరుతో ట్రాప్ చేసి.. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నాడు. తాను నిరాకరించడంతో రూ. 5 కోట్లు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని తన ఫిర్యాదులో ప్రస్తావించాడు.

స్నేహితుల ద్వారా పరిచయమైన ఆ అమ్మాయి తనను ఫ్యామిలీ ఫంక్షన్లకు, దేవాలయాలకు ఆహ్వానించిందని.. అంతా పథకం ప్రకారమే జరిగిందని ఆయన ఆరోపించారు. ఆమె తండ్రికి రూ. 50,000 చెల్లించానని ఫిర్యాదులో వివరించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More