...
...
Next Story

'రోడ్లు బాగాలేకపోతేనే ప్రమాదాలు తగ్గుతాయి' - బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కామెంట్స్

చేవెళ్ల మండలం మీర్జాపూర్ గేటు వద్ద జరిగిన RTC బస్సు ప్రమాదంపై స్థానిక ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పందించారు. గత పదేళ్లుగా జరిగిన ప్రతి సంఘటనకు పూర్తి కారణం గత BRS ప్రభుత్వమే అని ఆరోపించారు. రోడ్లు ఖరాబ్ ఉంటే యాక్సిడెంట్స్ తక్కువ అవుతాయని… బాగుంటేనే యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయని కామెంట్స్ చేశారు.

Published on: Nov 5, 2025, 06:50:08 IST
Advertisement

రోడ్లు బాగుంటే మరిన్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని చేవెళ్ల లోక్ సభ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. చేవెళ్లలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి చెందడంపై ఆయన మీడియాతో మాట్లాడారు. మన్నెగూడ, పరిగి మీదుగా వెళ్ళే హైదరాబాద్-బీజాపూర్ (కర్ణాటక) రహదారిలోని తెలంగాణ భాగంలో భూసేకరణ పూర్తి చేయడంలో జాప్యం జరిగిందని.. ఇందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు.

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

"ఈ రోజుల్లో రోడ్లు ఎంత ఖరాబ్ ఉంటే యాక్సిడెంట్స్ తక్కువ అవుతాయి. వాహనాలు నెమ్మదిగా వెళ్లి… తక్కువ ప్రమాదాలు జరుగుతాయి. రోడ్లు ఎంత మెరుగ్గా ఉంటే అంత పెద్ద ప్రమాదాలు జరుగుతాయి "అని ఆయన పేర్కొన్నారు.

బీఆర్ఎస్ పట్టించుకోలేదు - ఎంపీ కొండా

చేవెళ్ల రహదారిని నిజాం కాలంలో నిర్మించారని… అప్పటి పాలకులు వేసవి కాలంలో అనంతగిరి కొండలకు వెళ్లడానికి దీనిని ఉపయోగించారని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. రోడ్లు పాడైపోయినప్పటికీ అదే వంకర రహదారి ఇప్పటికీ ఉపయోగించబడుతోందన్నారు. తాను తొలిసారిగా చేవెళ్ల ఎంపీ అయినప్పుడు రహదారిని మరమ్మతు చేయాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అభ్యర్థించానని చెప్పారు. ఈ రోడ్డును జాతీయ రహదారిగా మార్చాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని అభ్యర్థించానని గుర్తు చేశారు.

హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారితో పాటు ప్రకటించిన మరో ఎనిమిది జాతీయ రహదారులు ఇప్పటికే పూర్తయ్యాయని ఆయన తెలిపారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం భూసేకరణను పూర్తి చేయలేదన్నారు. ఐదేళ్లుగా భూసేకరణ పూర్తి కాలేదు.2016లో బీజాపూర్ జాతీయ రహదారిని ప్రకటించినప్పటికీ, రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం భూసేకరణ చేయకుండా వదిలేసిందని ఆయన ఆరోపించారు.

కొందరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించి పిటిషన్లు దాఖలు చేశారని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. అయితే ఇటీవలనే అన్ని కేసులు క్లియర్ అయ్యాయని చెప్పారు. ఇప్పటికైనా వేగంగా రోడ్డు పనులను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వద్ద సోమవారం జరిగిన ఘటనలో టిప్పర్ లారీ ప్రభుత్వ బస్సును ఢీకొన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 19 మంది మృతి చెందగా, 30 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన 30 మందిలో ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదు. వారు వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks