డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) విద్యార్థులకు అద్భుతమైన అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. కాలపరిమితి ముగిసిపోయి, ఇంకా డిగ్రీ పూర్తి చేయలేకపోయిన పాత బ్యాచ్ విద్యార్థుల కోసం ప్రత్యేక రీ-అడ్మిషన్ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు విశ్వవిద్యాలయం అధికారికంగా ప్రకటించింది. డిగ్రీ , సీబీఎస్సీ పాత విధానంలో చదివి సబ్జెక్టులు మిగిలిపోయిన అనేకమంది విద్యార్థుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని వర్సిటీ పాలకవర్గం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
1990 నుంచి 2014 బ్యాచ్ విద్యార్థులకు…

ఈ ప్రత్యేక రీ-అడ్మిషన్ ప్రక్రియ ద్వారా 1990 నుంచి 2014వ సంవత్సరం మధ్య వర్సిటీలో చేరి, వివిధ కారణాల వల్ల డిగ్రీ పూర్తి చేయలేకపోయిన విద్యార్థులందరూ లబ్ధి పొందవచ్చు. నిర్ణీత రుసుము చెల్లించి, నిబంధనలకు అనుగుణంగా అడ్మిషన్ పొంది తమ పెండింగ్ బ్యాక్‌లాగ్ పరీక్షలు రాసేందుకు వర్సిటీ వెసులుబాటు కల్పించింది. ఏళ్ల తరబడి డిగ్రీ పట్టా అందుకోలేక ఇబ్బంది పడుతున్న వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ అవకాశాన్ని అందించినట్లు అధికారులు స్పష్టం చేశారు.
అర్హులైన విద్యార్థులు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రధాన కార్యాలయానికి నేరుగా వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ లర్నర్ సపోర్ట్ సర్వీసెస్ (డైరెక్టర్‌ను స్వయంగా కలిసి వివరాలను నమోదు చేసుకోవాలని విశ్వవిద్యాలయం సూచించింది. ఇకపై ఈ విషయంలో ఎలాంటి అదనపు మినహాయింపులు లేదా గడువు పెంపు ఉండదని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేసింది.
ఈ రీ-అడ్మిషన్ ప్రక్రియ, ఫీజు వివరాలు, ఇతర నిబంధనలకు సంబంధించిన సందేహాల నివృత్తి కోసం విద్యార్థులు హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించవచ్చని వర్సిటీ తెలిపింది.
- టోల్ ఫ్రీ కాల్ సెంటర్ నంబర్: 1800 599 0101
- హెల్ప్ డెస్క్ నంబర్లు: 040-23680222 / 333 / 444 / 555 లో ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.