దానం నాగేందర్ డిస్‌క్వాలిఫికేషన్ కేసు - రేపు సుప్రీంకోర్టులో విచారణ
అనర్హత తీర్పును సవాల్ చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ అత్యవసర పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. బుధవారం విచారణ జరగనుంది.
తెలంగాణ రాజకీయంలో ఎమ్మెల్యేల అనర్హత అంశం తీవ్ర కలకలం రేపుతోంది. బీఆర్‌ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పాటు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలను సవాలు చేస్తూ దానం నాగేందర్ సోమవారం అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన అనర్హతపై స్పందిస్తూ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు.

రేపు విచారణ…
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చి, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం ఎదుట ఈ పిటిషన్ ప్రస్తావనకు వచ్చింది. దానం నాగేందర్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ….. ఈ వ్యవహారంలో అత్యవసర విచారణ జరపాలని న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం…. ఈ వ్యవహారాన్ని అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది.
ఒకవేళ కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తే ఇబ్బందులు వస్తాయని… కాబట్టి మంగళవారమే ఈ కేసును అత్యవసరంగా విచారించాలని దానం తరపు న్యాయవాది రోహత్గీ కోరారు. అయితే…. ప్రతివాదుల తరఫు న్యాయవాది కల్పించుకుని.. ఈ విచారణను మంగళవారం కాకుండా బుధవారం చేపట్టాలని కోరారు. అనంతరం ధర్మాసనం విచారణ బుధవారం చేపడతామని స్పష్టం చేసింది.
గతంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చిన నిర్ణయాన్ని తోసిపుచ్చుతూ తెలంగాణ హైకోర్టు ఈ సంచలన తీర్పును వెలువరించింది. దానం నాగేందర్‌పై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ స్పీకర్ ఈ ఏడాది మార్చి 11న ఇచ్చేసిన ఉత్తర్వులను హైకోర్టు పక్కనబెట్టింది. ఖైరతాబాద్ నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన నాగేందర్, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే వేరే పార్టీ బి-ఫారమ్‌పై పోటీ చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు, రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ నిబంధనల ప్రకారం ఆయన లోక్‌సభ ఎన్నికల నామినేషన్ వేసిన 2024 ఏప్రిల్ 23వ తేదీ నుంచే అసెంబ్లీ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది.
శాసనసభలో బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన వేర్వేరు రిట్ పిటిషన్లపై సమగ్ర విచారణ జరిపిన తర్వాతే హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌లో పేర్కొన్న 2(1)(ఏ) నిబంధన ప్రకారం నామినేషన్ వేసిన నాటి నుంచే నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని, స్పీకర్ ఇచ్చిన నిర్ణయం చెల్లదని పిటిషనర్లు కోరారు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరడంతో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

