...
...
Next Story

TGSRTC : బస్సులో భరోసా.. ప్రయాణికుల సేఫ్టీ కోసం టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో సీసీ కెమెరాలు

CC Cameras In TGSRTC : ప్రయాణికుల భద్రత విషయంలో టీజీఎస్ఆర్టీసీ ఎప్పుడూ ముందు ఉంటుంది. అందులో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది.

Published on: Apr 15, 2026, 16:21:39 IST
Advertisement

ప్రయాణికులకు భద్రత కల్పించే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( టీజీఎస్ఆర్టీసీ ) తెలంగాణ పోలీసుల భాగస్వామ్యంతో ఆదిలాబాద్ జిల్లాలో 'బస్సులో భరోసా' పథకాన్ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో బస్సుల్లో జరిగే కార్యకలాపాలను సరిగ్గా పర్యవేక్షించేందుకు, ప్రయాణికులకు తగిన భద్రత కల్పించేందుకు జిల్లాలో నడుస్తున్న 175 టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాల ద్వారా దొంగతనం, వేధింపుల వంటి ఎలాంటి తప్పుడు పనులు చేసినా.. సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతుంది. దీంతో అధికారులు నిందితులను పట్టుకునేందుకు సులువుగా ఉంటుంది.

ఆర్టీసీ బస్సులో సీసీ కెమెరాలు
ఆర్టీసీ బస్సులో సీసీ కెమెరాలు

ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సమక్షంలో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఈ పథకాన్ని ఆవిష్కరించారు. ఆదిలాబాద్‌లో భద్రతను పెంచేందుకు పోలీసులు అన్ని బహిరంగ ప్రదేశాలలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కెమెరాల ఏర్పాటు ప్రయాణికులకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందని పోలీసులు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళలలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందంటున్నారు. ఈ పథకాన్ని ఇతర జిల్లాల్లో కూడా అమలు చేయాలని టీజీఎస్ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మె

మరోవైపు తెలంగాణ ఆర్టీసీ కార్మికులు కొంతకాలంగా వేతనాలు, బెనిఫిట్స్, సర్వీస్ సమస్యల మీద ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తున్నారు. మార్చి 13న ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటీసులు ఇచ్చాయి. ఈ క్రమంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు సమ్మె చేపట్టనున్నారు. ఏప్రిల్ 22 గడువు సమీపిస్తుండటంతో అన్ని జిల్లాల్లో విస్తృత స్థాయిలో సేవలు నిలిచిపోతాయని యూనియన్ నాయకులు హెచ్చరిస్తున్నారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. సమ్మె సంస్థకూ, ప్రజలకూ తీవ్ర నష్టం కలిగిస్తుందని పేర్కొంటూ ఆర్టీసీ ఉద్యోగులు తమ సమ్మెను విరమించుకోవాలని కోరారు. ఆర్టీసీ సిబ్బందికి సంబంధించిన అన్ని సమస్యలను చర్చలు, పరస్పర అవగాహన ద్వారా పరిష్కరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగులు తమ సమస్యలను తెలియజేసి, పరిష్కారాలు కోరడానికి ప్రభుత్వ ద్వారాలు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని ఆయన హామీ ఇచ్చారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks