Delhi Liquor Case : దిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితకు క్లీన్ చిట్.. కేసులు కొట్టేసిన కోర్టు.. సీబీఐపై సీరియస్

దిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితకు క్లీన్ చిట్ లభించింది. కేసును కొట్టివేసింది. అంతేకాదు సీబీఐపై తీవ్ర విమర్శలు చేసింది కోర్టు.

Published on: Feb 27, 2026, 12:28:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దిల్లీ మద్యం పాలసీ కేసులో కల్వకుంట్ల కవిత పెద్ద ఉపశమనం లభించింది. ఆమె ఆడిటర్ బుచ్చి బాబుతో సహా ఇతర నిందితులపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నమోదు చేసిన కేసులను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఆప్ నాయకులు మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఇతర నిందితులపై సీబీఐ దాఖలు చేసిన కేసును కూడా కోర్టు కొట్టివేసింది.

కల్వకుంట్ల కవిత
కల్వకుంట్ల కవిత

రెండు వైపుల నుండి వివరణాత్మక వాదనలు విన్న తర్వాత ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. తన ఉత్తర్వులో కోర్టు సీబీఐపై తీవ్ర విమర్శలు చేసింది. కేసు నమోదు, దర్యాప్తు విధానాన్ని తీవ్రంగా విమర్శించింది. ప్రక్రియలో తీవ్రమైన లోపాలను గమనించిన కోర్టు, కేసు నమోదు, దర్యాప్తు నిర్వహణ రెండింటిలోనూ ఏజెన్సీ విధానాన్ని తప్పుబట్టింది. చివరికి నిందితులందరిపై ఉన్న అభియోగాలను కొట్టివేసింది.

కల్వకుంట్ల కవిత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ఇలా మెుత్తం 23 మందికి ఈ కేసులో ఉపశమనం లభించింది. వారిపై ఎటువంటి క్రిమినల్ ఆధారాలు సమర్పించలేకపోవడంతో వారందరికీ క్లీన్ చిట్ ఇచ్చింది.

ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే ఈ కేసు కారణంగా కవిత, అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరూ పెద్ద రాజకీయ పరిణామాలను ఎదుర్కొన్నారు. రాజకీయంగా ఈ కేసు నష్టం చేసిందనే చెప్పాలి. కవితను బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చారు. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు.

ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న కవితకు ఈ కేసులో క్లీన్ చిట్ రావడం పెద్ద ఉపశమనం అని చెప్పవచ్చు. తెలంగాణ జాగృతి ద్వారా తెలంగాణలో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి కవిత ప్రయత్నాలు చేస్తున్నారు. తన సొంత రాజకీయ పార్టీకి రంగం సిద్ధం చేసుకుంటున్న తరుణంలో దిల్లీ లిక్కర్ కేసులో నిర్దోషిగా బయటపడ్డారు. దాదాపు ముడేళ్లపాటు ఈ కేసు కొనసాగింది.

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఏంటి?

అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా ఉన్నప్పుడు దిల్లీ ప్రభుత్వం 2021 నవంబర్‌లో కొత్త మద్యం పాలసీని అమల్లోకి తెచ్చింది. ఈ విధానంలో అవకతవకలు, స్కామ్ జరిగిందని ఆరోపణలు వచ్చాయి. పెద్ద ఎత్తున విమర్శల పాలైంది ప్రభుత్వం. దీంతో దిల్లీ సర్కార్ 2022 సెప్టెంబర్‌లో పాలసీని వెనక్కు తీసుకుంది. కానీ అప్పటికే లైసెన్సుల కేటాయింపులు, ఎక్సైజ్ పాలసీ సవరణలో భారీ అక్రమాలు జరిగాయని, ఆప్ నేతలు, మరికొందరు మనీలాండరింగ్‌కు పాల్పడినట్టుగా సీబీఐ, ఈడీ ఆరోపణలు చేశాయి.

లైసెన్స్‌దారులకు నిబంధనలకు విరుద్ధంగా ప్రయోజనం చేకూర్చినట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఇందుకోసం నిందితులు భారీగా డబ్బులు తీసుకున్నారని సీబీఐ, ఈడీ ఆరోపించింది. ఇందులో భాగంగా అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ఇతర ఆప్ నేతలతోపాటుగా కల్వకుంట్ల కవితను కూడా అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత జైలు శిక్ష తర్వాత బెయిల్ మీద విడుదల అయ్యారు. తాజాగా ఈ కేసులో 23 మందికి క్లీన్ చిట్ ఇచ్చింది కోర్టు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More