Delhi liquor case : దిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్​కి ఊరట! నిర్దోషిగా ప్రకటించిన కోర్టు..

Arvind Kejriwal news : దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలకు భారీ ఊరట లభించింది. వీరు, కల్వకుంట్ల కవితతో పాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం 23 మందిని దిల్లీ కోర్టు శుక్రవారం నిర్దోషులుగా ప్రకటిస్తూ సంచలన తీర్పునిచ్చింది.

Published on: Feb 27, 2026 11:16 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సంచలనాలకు కేరాఫ్​ అడ్రెస్​గా నిలిచిన దిల్లీ మద్యం విధానం (లిక్కర్​ పాలసీ) కేసులో గత కొంతకాలంగా సాగుతున్న న్యాయపోరాటంలో ఆమ్ ఆద్మీ పార్టీకి అతిపెద్ద విజయం లభించింది! సీబీఐ దాఖలు చేసిన ఈ అవినీతి కేసులో దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా మొత్తం 23 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ దేశ రాజధానిలోని రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది.

అరవింద్​ కేజ్రీవాల్​కి క్లీన్​ చిట్​! (ANI/@msisodia)
అరవింద్​ కేజ్రీవాల్​కి క్లీన్​ చిట్​! (ANI/@msisodia)

ఇదే కేసులో నిందితురాలిగా ఉన్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్​ కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు సైతం క్లీన్​ చిట్​ లభించింది.

కోర్టు కీలక వ్యాఖ్యలు:

దిల్లీ లిక్కర్​ కేసు తీర్పులో భాగంగా ప్రత్యేక న్యాయమూర్తి జితేంద్ర సింగ్ ఈ ఆదేశాలను జారీ చేశారు. నిందితులపై మోపిన ఆరోపణలను నిరూపించడానికి దర్యాప్తు సంస్థ (సీబీఐ) సరైన ఆధారాలను సమర్పించలేకపోయిందని కోర్టు స్పష్టం చేసింది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోవడానికి కోర్టు నిరాకరించింది. నిందితులకు వ్యతిరేకంగా ఎటువంటి బలమైన ఆధారాలు లేవని, అందుకే వారిని ఈ కేసు నుంచి విముక్తులను చేస్తున్నామని న్యాయమూర్తి పేర్కొన్నారు.

అదే సమయంలో సీబీఐ పనితీరుపైనా కోర్టు అసహనం వ్యక్తం చేసింది. నిందితుడికి బెయిల్​ ఇచ్చి, అనంతరం అతడిని అప్రూవర్​గా మార్చి, దర్యాప్తులో ఉన్న లోపాలను పూరించేందుకు అతని స్టేట్​మెంట్​ తీసుకోవడం సరైన పద్ధతి కాదని తేల్చిచెప్పింది. ఇలాంటి ప్రవర్తనకు అనుమతిస్తే నిబంధనలకు తీవ్ర ఉల్లంఘన జరిగినట్టే అని స్పష్టం చేసింది.

భావోద్వేగానికి గురైన అరవింద్​ కేజ్రీవాల్..

ఆమ్​ ఆద్మీ పార్టీని, మరీ ముఖ్యంగా అరవింద్​ కేజ్రీవాల్​ని ఈ దిల్లీ లిక్కర్​ పాలసీ కేసు గత కొన్నేళ్లుగా ఇబ్బంది పెడుతూ వస్తోంది. వాస్తవానికి గతేడాది జరిగిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్​తో పాటు పార్టీ ఘోర పరాభవానికి ఉన్న ప్రధాన కారణాల్లో ఈ కేసు కూడా ఒకటి.

ఇక తాజా తీర్పు నేపథ్యంలో దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన జీవితంలోనే అత్యంత భావోద్వేగభరితమైన క్షణాలను ఎదుర్కొన్నారు. లిక్కర్ పాలసీ కేసులో కోర్టు తనపై ఉన్న అన్ని ఆరోపణలను కొట్టివేసిన తర్వాత, ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. దాదాపు రెండేళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత తనకి దక్కిన ఈ విజయం కేజ్రీవాల్‌ను ఉద్వేగానికి గురిచేసింది.

ఈ సందర్భంగా కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

"ఆప్ పార్టీని అంతం చేయడానికి మా ఐదుగురు అగ్రనేతలను జైల్లో పెట్టారు. భారత చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రిని ఇంటి నుంచి లాక్కెళ్లి ఆరు నెలల పాటు బంధించారు. మా డిప్యూటీ మనీష్ సిసోడియాను దాదాపు రెండేళ్లపాటు జైల్లో ఉంచారు. ఇదంతా ఒక పెద్ద రాజకీయ కుట్ర," అని హిందీలో ఆవేదన వ్యక్తం చేశారు.

"నన్ను వేధించారు. టీవీ ఛానళ్లలో చర్చలు పెట్టారు, కేజ్రీవాల్ అవినీతిపరుడు అని వార్తలు చూపించారు," అని చెబుతున్న సమయంలో కేజ్రీవాల్ కంఠం మూగబోయింది. ఎప్పుడూ ధైర్యంగా కనిపించే ఆయన, ఒక్కసారిగా తలదించుకుని చిన్నపిల్లాడిలా ఏడ్చేశారు. పక్కనే ఉన్న మనీష్ సిసోడియా వెంటనే కేజ్రీవాల్‌ను దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు. ఈ దృశ్యం అక్కడున్న వారందరినీ కదిలించింది.

కన్నీళ్లు తుడుచుకున్న అనంతరం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. "కేజ్రీవాల్ అవినీతిపరుడు కాదు. నేను నా జీవితాంతం నిజాయితీతోనే బతికాను. నా సంపాదన అదే. వారు తప్పుడు కేసు పెట్టారు, కానీ ఈరోజు నిజం నిరూపితమైంది. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ఆమ్ ఆద్మీ పార్టీ అత్యంత నిజాయితీ గలవారని కోర్టు స్పష్టం చేసింది," అని పేర్కొన్నారు.

దిల్లీ లిక్కర్​ పాలసీ కేసు నేపథ్యం..

2021-22 దిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో అవినీతి జరిగిందంటూదిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ చేసిన ఫిర్యాదుతో సీబీఐ ఈ దర్యాప్తు చేపట్టింది. విమర్శలు, ఆరోపణల మధ్య అప్పటి దిల్లీ ప్రభుత్వం ఈ పాలసీని రద్దు చేసింది. కాగా ఈ కేసులో భాగంగానే అప్పట్లో పదవిలో ఉన్న కేజ్రీవాల్, సిసోడియాలను కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశాయి. మరీ ముఖ్యంగా కేజ్రీవాల్​ని అరెస్ట్​ చేయడం, దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

అయితే, ఈ ఏడాది జనవరిలోనే ఈడీ సమన్లను ఉల్లంఘించారనే కేసులో కూడా కేజ్రీవాల్‌కు విముక్తి లభించింది. నేడు సీబీఐ కేసులో కూడా క్లీన్ చిట్ రావడంతో ఆప్ శిబిరంలో సంబరాలు కనిపిస్తున్నాయి.

2006లో ప్రతిష్టాత్మక రామన్ మెగసెసే అవార్డు పొందిన కేజ్రీవాల్, తన నైతికతపై జరిగిన దాడిని ఈ తీర్పుతో తిప్పికొట్టారని ఆప్ శ్రేణులు అభివర్ణిస్తున్నాయి.