రేషన్‌కార్డుదారులకు బిగ్ అలర్ట్ - ఆగస్ట్ 1 నుంచి ఒకేసారి 3 నెలల రేషన్ పంపిణీ - ఈకేవైసీ గడువు కూడా పొడిగింపు
3 Months Free Ration in Telangana: రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు ఆగస్టు 1 నుంచి 31 వరకు ఒకేసారి మూడు నెలల కోటాను పంపిణీ చేయనున్నారు. మరోవైపు ఈ-కేవైసీ గడువును ఆగస్టు 31 వరకు పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
Telangana Ration Card eKYC Status : రాష్ట్రంలోని పేద కుటుంబాలకు ఊరటనిచ్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కొక్క నెలకు విడివిడిగా కాకుండా…. రాబోయే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబరు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి లబ్ధిదారులకు అందజేయనుంది. కేంద్రం నుంచి మార్గదర్శకాలు రావడంతో… ఆగస్టు 1వ తేదీ నుంచే ఈ మూడు నెలల బియ్యం పంపిణీ ప్రక్రియను ప్రారంభించేందుకు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.

ఈ-కేవైసీ ఉంటేనే రేషన్ సరుకులు..!
రేషన్ పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట వేసి, పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం ఆహార భద్రత (రేషన్) కార్డుదారులకు ఈ-కేవైసీ (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) నమోదును తప్పనిసరి చేసింది. కొత్త నిబంధనల ప్రకారం…. ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తయిన లబ్ధిదారులకు మాత్రమే వచ్చే నెల(ఆగస్ట్ 2026) నుంచి ఉచిత రేషన్ బియ్యం పొందే వెసులుబాటు ఉంటుంది.
ఈకేవైసీ గడువు పొడిగింపు…
రేషన్ కార్డుదారులకు పౌర సరఫరాల శాఖ ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. ఆహార భద్రత కార్డులో ఉన్న సభ్యుల వివరాలను ఆధార్ కార్డుతో అనుసంధానించే ఈ-కేవైసీ (eKYC) ప్రక్రియ సమయాన్ని ఆగస్టు 31 వరకు పొడిగించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమం వేగంగా జరుగుతుండటం, అలాగే భారీ వర్షాల కారణంగా లబ్ధిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాబట్టి కార్డుదారులు ఆందోళన చెందకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకుని నిర్దేశిత గడువులోగా తమ ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు కోరారు.
ఈకేవైసీ ఎందుకంటే..?
మరణించిన వారి పేర్లు, అనేక ఏళ్లుగా రేషన్ సరుకులు తీసుకోకుండా వదిలేసిన వారి పేర్లను రేషన్ కార్డుల నుంచి తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అనర్హులను తొలగించి, నిజమైన పేదలు, అర్హులైన కుటుంబాలకు మాత్రమే రేషన్ ఫలాలు అందేలా చూడటమే ఈ కేవైసీ ప్రాథమిక ఉద్దేశం. దీంతో కార్డులో పేరు ఉన్న ప్రతి లబ్ధిదారుడు ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది.
ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం వేర్వేరు ప్రాంతాలకు వలస వెళ్లిన కార్డుదారులు ఈ-కేవైసీ కోసం తమ సొంత గ్రామాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన 'రేషన్ పోర్టబిలిటీ' సౌకర్యం ద్వారా దేశంలో లేదా రాష్ట్రంలో తాము ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతానికి సమీపంలో ఉన్న ఏ రేషన్ దుకాణానికైనా వెళ్లి ఈ-కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. తమ వద్ద ఉన్న రేషన్ కార్డు. ఆధార్ కార్డు వివరాలను చూపిస్తే అక్కడే ప్రక్రియ పూర్తవుతుంది.
ఈకేవైసీ ఎక్కడ చేసుకోవాలంటే..?
రేషన్ షాపుల్లో ఉండే ఈ-పోస్ (e-POS) యంత్రంలో వేలిముద్ర (బయోమెట్రిక్) లేదా ఐరిస్ స్కాన్ ద్వారా కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. మీసేవా కేంద్రాల్లో కూడా ఆధార్ ధృువీకరణ ద్వారా ఈ-కేవైసీ చేసుకునే సదుపాయం ఉంది. రేషన్ కార్డుతో పాటు, అందులో నమోదైన సభ్యులందరి ఒరిజినల్ ఆధార్ కార్డులను వెంట తీసుకెళ్లాలి. ఈ-కేవైసీ నమోదు ప్రక్రియ పూర్తిగా ఉచితం. దీని కోసం రేషన్ డీలర్లకు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు.
e-KYC స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే..?
- ముందుగా https://smartpds.telangana.gov.in/ లింక్‌పై క్లిక్ చేయాలి.
- హోమ్ పేజీ ఓపెన్ అయిన తర్వాత… అందులో కనిపించే Beneficiary Details పై నొక్కాలి.
- ఇక్కడ ఓపెన్ అయ్యే విండోలో మీ రేషన్ కార్డు నెంబర్ తో పాటు క్యాప్చాను నమోదు చేయాలి.
- ఇక్కడ రేషన్ కార్డులోని సభ్యుల పేర్లతో పాటు ఈకేవైసీ స్టేటస్ వివరాలు కూడా కనిపిస్తాయి.
- స్టేటస్ యాక్టివ్ అని ఉంటే ఈకేవైసీ పూర్తి అయినట్లు భావించాలి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

