TG Ration Card eKYC : రేషన్ కార్డుదారులకు అలర్ట్ - ఈ నెలాఖరుతో ముగియనున్న ఈ-కేవైసీ గడువు
Telangana Ration Card eKYC : రాష్ట్రంలోని రేషన్ కార్డు లబ్ధిదారులు ఈ నెలాఖరులోగా తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ ఆదేశించింది. గడువు దాటితే రేషన్ బియ్యం పంపిణీని నిలిపివేస్తారు.
Telangana Ration Card eKYC : రాష్ట్రంలోని రేషన్ కార్డు లబ్ధిదారులకు పౌర సరఫరాల శాఖ ముఖ్యమైన అలర్ట్ జారీ చేసింది. రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ-కేవైసీ (e-KYC) నమోదు చేసుకోవాలని స్పష్టం చేసింది. గత రెండున్నరేండ్లుగా ప్రభుత్వం దీనిపై పదేపదే అవగాహన కల్పిస్తున్నప్పటికీ…. ఇప్పటికీ లక్షలాది మంది లబ్ధిదారులు ఈ ప్రక్రియను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరు నాటికి (జూలై 31) ప్రతి లబ్ధిదారుడు ఈ-కేవైసీ ప్రక్రియను ముగించాల్సి ఉంటుంది.

రాష్ట్రంలో అర్హులైన అసలైన పేద కుటుంబాలకు మాత్రమే ఉచిత రేషన్…. సంక్షేమ ఫలాలు అందాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. రేషన్ పంపిణీ వ్యవస్థలో పారదర్శకతను పెంచడం, నకిలీ, చెల్లుబాటు కాని కార్డులను పూర్తిగా ఏరివేయడమే పౌరసరఫరాల శాఖ ప్రధాన ఉద్దేశం. రేషన్ కార్డులు ఉండి వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన వారు, మరణించిన వారి పేర్లను తొలగించకపోవడం వల్ల రేషన్ ధాన్యం పక్కదారి పడుతోంది. ఈ-కేవైసీ ద్వారా ప్రతి సభ్యుడి వివరాలను ప్రామాణీకరించడం వల్ల అసలైన లబ్ధిదారులను గుర్తించడం సాధ్యమవుతుంది.
ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా ఈ-కేవైసీ పూర్తి చేయని సభ్యుల పేర్లను రేషన్ కార్డుల నుంచి అధికారులు తొలగించే అవకాశాలు ఉన్నాయి. దీంతో భవిష్యత్తులో ఉచిత రేషన్ బియ్యం నిలిచిపోవడమే కాకుండా, రేషన్ కార్డు (ఆహార భద్రతా కార్డు) ప్రాతిపదికన ప్రభుత్వం అందించే ఇతర సంక్షేమ పథకాలను కూడా కోల్పోవాల్సి వస్తుంది. అందుకే చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే ప్రక్రియను పూర్తి చేయాలని యంత్రాంగం కోరుతోంది.
ఈ-కేవైసీ ఎక్కడ… ఎలా చేసుకోవాలి…?
లబ్ధిదారులు తమ పరిధిలోని రేషన్ దుకాణానికి వెళ్లాలి. అక్కడ ఉండే ఈ-పోస్ (e-POS) యంత్రంలో వేలిముద్ర (బయోమెట్రిక్) లేదా ఐరిస్ స్కాన్ ద్వారా కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. మీసేవా కేంద్రాల్లో కూడా ఆధార్ ధృువీకరణ ద్వారా ఈ-కేవైసీ చేసుకునే సదుపాయం ఉంది. రేషన్ కార్డుతో పాటు, అందులో నమోదైన సభ్యులందరి ఒరిజినల్ ఆధార్ కార్డులను వెంట తీసుకెళ్లాలి. ఈ-కేవైసీ నమోదు ప్రక్రియ పూర్తిగా ఉచితం. దీని కోసం రేషన్ డీలర్లకు లేదా ఇతరులకు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది.
త్వరలోనే స్మార్ట్ రేషన్ కార్డులు….
మరోవైపు అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా రేషన్ సరకులు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ సరికొత్త స్మార్ట్ రేషన్ కార్డులను ప్రవేశపెట్టనుంది. రాప్రస్తుతం లబ్ధిదారులు ఏ4 (A4) సైజ్ కాగితం రూపంలో ఉన్న రేషన్ కార్డులనే వాడుతున్నారు. చిరిగిపోయే అవకాశం ఉన్న ఈ పాత పేపర్ కార్డుల స్థానంలో…. ఇప్పుడు ఆధునిక హంగులతో కూడిన స్మార్ట్ కార్డులను ప్రభుత్వం అందించనుంది.
ఈ కొత్త కార్డులపై క్యూఆర్ కోడ్ ఉంటుంది. రేషన్ దుకాణానికి వెళ్లినప్పుడు ఈ కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు.. ఆ కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? అనేది తెలిసిపోతుంది. కార్డులో ఉన్నవారికి ఇప్పటివరకు బియ్యం, గోధుమలు, చక్కెర వంటి రేషన్ వస్తువులు ఏయే నెలల్లో ఎంతెంత పంపిణీ అయ్యాయనే పూర్తి హిస్టరీ కంప్యూటర్ స్క్రీన్‌పై డిస్ ప్లే అవుతుంది. కార్డుదారుడు కేవలం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి లేదా కార్డు నంబర్ చెప్పి… కుటుంబంలో ఎవరైనా సరే బయోమెట్రిక్ (వేలిముద్ర) వేసి సులభంగా రేషన్ తీసుకోవచ్చు.
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పేపర్ రూపం నుంచి ప్లాస్టిక్ కార్డు రూపంలోకి రేషన్ కార్డులు రావడం ఇదే తొలిసారి. వీటిని మన చేతిలో ఉండే క్రెడిట్, డెబిట్ కార్డుల సైజులో ఎంతో రూపొందించారు. ఈ స్మార్ట్ రేషన్ కార్డుపై లబ్ధిదారుడి (యజమాని) ఫోటోతో పాటు పేరు, చిరునామా స్పష్టంగా ముద్రించి ఉంటుంది.
కొత్త కార్డుల కోసం ప్రజల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయరు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,05,42,188 రేషన్ కార్డులు ఉండగా…. వాటి ద్వారా లబ్ధి పొందుతున్న వారి సంఖ్య 3,39,96,239 గా ఉంది. ఈ డిజిటల్ మార్పుతో రేషన్ పంపిణీ వ్యవస్థలో పారదర్శకత మరింత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

