ఎల్ నినో సవాళ్లపై తెలంగాణ సర్కార్ ప్రణాళిక.. స్మార్ట్ ఎనర్జీ మేనేజ్‌మెంట్
ఎల్ నినో సవాళ్లపై తెలంగాణ సర్కార్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ రంగాలపై ప్రభావం పడకుండా ముందస్తు చర్యలు తీసుకుంటోంది.
ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో చోటుచేసుకుంటున్న ఎల్ నినో వంటి మార్పులు రాష్ట్ర ప్రజలపై, ముఖ్యంగా వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ రంగాలపై ప్రభావం చూపకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం దూరదృష్టితో పక్కా ప్రణాళికలు రూపొందిస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్లానింగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన "పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతల పెరుగుదల నుంచి తెలంగాణ సంసిద్ధత వరకు" అనే అంశంపై రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సుకు ఆయన రాష్ట్ర మంత్రి మహమ్మద్ అజారుద్దీన్‌తో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు. 'కేవలం పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా ఎల్ నినో ప్రభావంపై ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. సమస్య తీవ్రతను ముందే గ్రహిస్తే ప్రతి కుటుంబం, ప్రతి గ్రామం సొంతంగా సరైన ప్రణాళికలు వేసుకోగలుగుతుంది.' అని భట్టి విక్రమార్క అన్నారు.
వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న భూమధ్యరేఖా పసిఫిక్ మహాసముద్రంలో జరిగే ఉష్ణోగ్రతల మార్పులు తెలంగాణలోని చెరువులు, వాగులు, గ్రామాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో శాస్త్రవేత్తల ద్వారా విశ్లేషింపజేసి, సమర్థవంతమైన కార్యాచరణ రూపొందిస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. తాగునీరు, సాగునీటితో పాటు పశువులు, పక్షులు, అడవి జంతువుల నీటి, ఆహార అవసరాలకు ఇబ్బంది కలగకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. వ్యక్తిగత, కుటుంబ, గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో ఎవరికి వారు సంసిద్ధమయ్యేలా ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు.
వర్షాభావ పరిస్థితులు ఎదురైనా రైతులు ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకు నిపుణుల సూచనల మేరకు తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల విధానాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని భట్టి తెలిపారు. ఈ సమాచారాన్ని ప్రత్యక్ష ప్రసారాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ తీసుకెళ్లడంలో టీవీ ఛానెళ్లు తమ సామాజిక బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నాయని అభినందించారు.
మన జీవన విధానంలో విద్యుత్ అత్యంత ప్రధానమైనదని, ఎల్ నినో వల్ల పెరిగిన డిమాండ్‌ను తట్టుకునేందుకు ప్రభుత్వం అత్యంత సమర్థవంతమైన 'ఎనర్జీ మేనేజ్‌మెంట్' అమలు చేస్తోందని వివరించారు. పగటి పూట విరివిగా, తక్కువ ధరకు లభించే సౌర విద్యుత్‌ను (సోలార్ పవర్) గరిష్టంగా వినియోగించుకోవడం ద్వారా ప్రజలపై, ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. సోలార్ సమయాన్ని సమర్థవంతంగా వాడుకుంటూ, తదుపరి అవసరాలకు థర్మల్ విద్యుత్‌ను క్రమబద్ధంగా వినియోగించడం ద్వారా గ్రిడ్ స్థిరత్వాన్ని కాపాడుతున్నామని స్పష్టం చేశారు.
ఉష్ణోగ్రతలు పెరగడంతో పగలు, రాత్రి అనే తేడా లేక ఫ్యాన్లు, ఏసీలు, లైట్లు, బోర్‌వెల్స్, లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్ల వాడకం భారీగా పెరిగిందన్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. సాధారణంగా వర్షాకాలంలో విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉంటుంది, కానీ ఎల్ నినో ప్రభావంతో తెలంగాణలో ప్రస్తుత డిమాండ్ ఏప్రిల్ (వేసవి) నాటి గరిష్ట (పీక్) స్థాయికి చేరుకుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న సీజన్లకు అనుగుణంగా విద్యుత్ వినియోగంలో మార్పులు వస్తున్నాయని, పెరిగిన అవసరాలకు తగ్గట్టుగా ఎనర్జీ ప్లానింగ్ రూపొందించుకోవడంలో తెలంగాణ ముందుంటుందని తెలిపారు. ఏసీలు, ఫ్యాన్లు, మోటార్ల వాడకంలో వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు.
సమాజంలో చైతన్యం తీసుకురావడానికి విషయ నిపుణులను ఆహ్వానించి ఈ సదస్సును ఏర్పాటు చేసిన ప్లానింగ్ శాఖను ఉప ముఖ్యమంత్రి అభినందించారు. వ్యవసాయ, విద్యుత్, సాగునీటి భూగర్భ జల శాఖలతో పాటు అనుబంధ శాఖలన్నింటినీ సమన్వయం చేసుకుని సదస్సును నిర్వహించడం ప్రణాళికా శాఖ ప్రతిభకు, సామాజిక బాధ్యతకు నిదర్శనమని కొనియాడారు. ఇటువంటి అవగాహన సదస్సులను భవిష్యత్తులో జిల్లాల వారీగా కూడా నిర్వహించి ప్రజలను భాగస్వాములను చేస్తూ పూర్తి స్థాయి చైతన్యం తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పాలనాధికారులు తమ విధులతో పాటు సమాజానికి మేలు చేసే ఇటువంటి అంశాలలో ప్రజలను చైతన్యవంతం చేయడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో ఎనర్జీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్, ప్లానింగ్ సెక్రెటరీ గౌరవ ఉప్పల్, ఐఏఎస్ అధికారులు దివ్య దేవరాజన్, గోపి, జితేష్ వి పాటిల్ ప్లానింగ్ డైరెక్టర్ రూఫొస్ దత్తం తదితరులు పాల్గొన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


