విద్య, వైద్య శాఖల్లో ఫేషియల్ అటెండెన్స్ తప్పనిసరి చేయండి - సీఎం రేవంత్ ఆదేశాలు
మార్చి 16 నుంచి జూన్ 12 వరకు తెలంగాణలో సాగిన ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యా, వైద్య రంగాల్లో ఉద్యోగులందరికీ ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ తప్పనిసరి చేయాలని ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంతో ప్రజా ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. మార్చి 16 నుంచి జూన్ 12 వరకు దాదాపు 99 రోజుల పాటు రాష్ట్రమంతటా ఈ కార్యక్రమం నిరంతరాయంగా సాగింది. ఈ సుదీర్ఘ కార్యాచరణపై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

విభాగాల వారీగా క్షేత్రస్థాయిలో చేపట్టిన కార్యక్రమాలు, వాటి ద్వారా ప్రజలకు చేకూరిన లబ్ధి మరియు సాధించిన ఫలితాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కీలక సమావేశంలో రాజ్యసభ ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, డీజీపీ సీవీ ఆనంద్‌తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఆయా విభాగాలు సాధించిన ప్రగతిపై నివేదికలను ముఖ్యమంత్రికి సమర్పించాయి.
99 రోజుల కార్యాచరణ ప్రణాళికను విజయవంతం చేసిన అధికారులను, సిబ్బందిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఇదే సమయంలో విధుల్లో అలసత్వాన్ని ఆయన సహించబోరని స్పష్టం చేశారు. ప్రధాన కార్యదర్శుల నుంచి జిల్లా కలెక్టర్ల వరకు అన్ని విభాగాల ఉన్నతాధికారులు ప్రతి నెలా క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని గతంలోనే ఆదేశించామని గుర్తు చేశారు. ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తూ క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లని అధికారులు, జిల్లా కలెక్టర్లపై తక్షణమే పూర్తి నివేదిక ఇవ్వాలని చీఫ్ సెక్రటరీని సీఎం ఆదేశించారు.
వివిధ స్థాయిల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను పక్కాగా నమోదు చేయాలని చెప్పారు. గ్రామాల్లో గుర్తించిన స్థానిక సమస్యలను ఆయా శాఖలు తక్షణమే పరిష్కరించాలని స్పష్టం చేశారు. గడిచిన మూడు నెలల కాలంలో చేపట్టిన అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు, సృష్టించిన ఆస్తుల వివరాలన్నింటినీ రికార్డుల్లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.
విద్యా, వైద్య శాఖల్లో ఫేషియల్ అటెండెన్స్
ప్రభుత్వ సేవల్లో జవాబుదారీతనం పెంచేందుకు సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యా, వైద్య విభాగాల్లో అన్ని స్థాయిల్లో 'ఫేషియల్ రికగ్నిషన్' (ముఖ గుర్తింపు) అటెండెన్స్ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి కాలేజీల వరకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (PHC) నుంచి ఉస్మానియా, గాంధీ వంటి అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల వరకు పనిచేసే ఉద్యోగులందరికీ ఇదే హాజరు విధానాన్ని పాటించాలని ఆదేశించారు.
రాష్ట్రంలో ఇప్పటికీ సొంత గ్రామ పంచాయతీ భవనాలు లేని గ్రామాలు ఎన్ని ఉన్నాయో గుర్తించి, వెంటనే ఆ జాబితాను సిద్ధం చేయాలని పంచాయతీరాజ్ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆయా గ్రామాల్లో కొత్తగా భవనాల నిర్మాణాలను చేపట్టేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సూచించారు. పర్యావరణ హితానికి పెద్దపీట వేస్తూ.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
త్వరలోనే ప్రగతి నివేదికలు
రాష్ట్రస్థాయిలో 99 రోజుల ప్రగతిపై సమీక్ష జరిపినట్లే….. జిల్లాల వారీగా కూడా తక్షణమే సమీక్షలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ సమీక్షల పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయి నుంచి ప్రతి జిల్లాకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేక అధికారిగా (Special Officer) నియమించి క్షేత్రస్థాయికి పంపాలని చెప్పారు. ఆయా జిల్లాల వారీగా ప్రగతి నివేదికలను అధికారికంగా విడుదల చేయాలన్నారు.
జిల్లాలతో పాటు నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల వారీగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, లబ్ధిదారుల వివరాలు, ప్రజా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల సమాచారాన్ని సిద్ధం చేయాలని చెప్పారు. ఈ వివరాలన్నింటినీ ప్రజలకు పారదర్శకంగా తెలిసేలా అధికారిక డ్యాష్ బోర్డులో అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.
తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాల పర్యటనలు, వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలకు ఇచ్చిన హామీల అమలు తీరుపై అధికారులను ఆరా తీశారు. నియోజకవర్గాల వారీగా ముఖ్యమంత్రి హామీల పురోగతి ఏ స్థాయిలో ఉందో స్పష్టమైన నివేదిక సమర్పించాలని ప్రణాళికా విభాగాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

